బ్రతుకు ఆశయము
- బివిడి.ప్రసాదరావు
BVD.Prasada Rao
నిజమే, రవి చనిపోయిన తొలినాళ్లల్లో పద్మ ఎంతగానో చలించి పోయింది. బిక్కు బిక్కుమంటూ ఎన్నెన్నో అవస్థలు పడింది. బేలగా భోరుమంది. ఎడబాటు భరించలేక బెంబేలు పడింది. అలాంటిది కాలం గడిచేకొద్దీ అవన్నీ మరుగయ్యాయి.
క్రమేణా రవి జ్ఞాపకాలను మరువగలిగింది పద్మ. ఆమె ఇప్పుడు మునుపటి పద్మ అవుతోంది. ఇదంతా కాల ప్రభావం. కాలం దొడ్డది. తాను కరిగిపోతూ అన్నిటినీ మరుగుపరుస్తుంది. మచ్చుకు పద్మే.
పెద్దలు చూపిన రవిని పెళ్లాడింది పద్మ. మనసారా అతడిని ఆరాధించింది.
పద్మ అంటే రవికి ఎంతో ప్రేమ. గిల్లికజ్జాలు ఆడితే ఆమె ఎక్కడ నొచ్చుకుంటుందో నని ఆమె పట్ల అతడు సుతిమెత్తగా మెలిగేవాడు.
ఉద్యోగరీత్యా పయనిస్తూండగా జరిగిన బస్సు ప్రమాదంలో రవి అక్కడికక్కడే చని పోవలసినవాడు ... పద్మను చూసి పోవాలనే తపనతో ఊపిరిని కొనన బిగపట్టి, హాస్పిటల్ వద్ద ఆమె చెయ్యి పుచ్చుకున్న పిమ్మట వదలలేక వదలలేక శ్వాస విడిచి పెట్టాడు. రవి, పద్మలు భార్యాభర్తలై అప్పటికి సంవత్సరం కూడా కాలేదు.
అటువంటి పరిస్థితిలో రవిని కోల్పోయిన పద్మ తేరుకోలేదేమోనని అయిన వారంతా ఆందోళన చెందారు. హైరానా పడ్డారు. కానీ ఆమె మెల్లిగా తేరుకోవడంతో వారంతా సాఫీగా ఊపిరి పీల్చుకొన్నారు.
రవి చనిపోయిన తర్వాత అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరింది పద్మ. అయినా ఆమె అత్త కాంతం, మామయ్య సూర్యం తరచూ ఆమె వద్దకు వస్తూ పోతూనే ఉన్నారు. తమ అంచనా కంటే తొందరగా పద్మలో వచ్చిన మార్పుకు వారు ఎంతగానో సంతోషపడ్డారు.
ఉదయమే మళ్లీ పద్మ వద్దకు వచ్చారు కాంతం, సూర్యంలు. మధ్యాహ్నం భోజనాల తర్వాత - వారు పద్మని, ఆమె తల్లిదండ్రులు పార్వతి, జోగారావులను, ఆమె అన్నా వదినలు ప్రభాకర్, మాలతిలను పిలిచి తమ దగ్గర కూర్చుండబెట్టుకున్నారు.
కాంతం భర్తతో, "చెప్పండి" అంది.
జోగారావు వంక చూస్తూ, "బావగారూ, మన పద్మ గురించి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా?" అన్నాడు సూర్యం సౌమ్యంగా.
జోగారావు సన్నగా చలించాడు. తన భార్య వంక చూశాడు. ఆ ఇద్దరూ తటపటా యిస్తున్నారు.
అస్థిమితంగా కదిలాడు ప్రభాకర్.
కాంతం కలుగజేసుకుంటూ పార్వతితో, "మీరు చెప్పండి వదినగారూ. ఇక మనం పద్మ గురించి ఆలోచించాలి" అంది మృదువుగా.
పద్మ అయోమయంగా అందర్నీ చూస్తోంది.
తడుముకుంటున్నట్టు, "ఏముంది ఆలోచించడానికి? ఏమని ఆలోచించాలి!" అంది పార్వతి.
"జరిగింది దురదృష్టకరమే. అయినా జరగవలసింది జరిగిపోయింది. ఇక జరగ నున్న దానికి మనం ఆలోచించుకోవాలిగా" అంది కాంతం.
"అన్నీ అనుకున్నట్టే అవుతున్నాయా?" అంది పార్వతి దిగులుగా.
"కానీ సలక్షణంగా ఒకసారి అనుకోవడం మానవ ధర్మం చెల్లెమ్మా" అన్నాడు సూర్యం వెంటనే.
ఏమీ అనలేకపోయింది పార్వతి. భర్త వంక చూసింది.
అప్పుడు జోగారావు, "ఏమీ అనుకోవడం లేదు బావగారూ" చెప్పాడు.
వెంటనే సూర్యం, "మా కొడుకుని పెళ్లి చేసుకోవడంతో మీ పద్మ మా ఇంటి కోడలు అయింది. ఇప్పుడు మా కొడుకు పోయినా పద్మ మా ఇంటి కోడలే. మా వాడి మూలంగా మాకు వారసురాలే కదా." అని ఆగాడు.
మిగతావారు ఏమీ అనలేదు.
"అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. కాకపోతే ఆమె తల్లిదండ్రులు మీరు, కనుక మిమ్మల్ని సంప్రదిస్తున్నాం" చెప్పాడు సూర్యం.
పద్మ కన్నవారు ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్నారు.
"వదినగారూ, పద్మ కోరి తెచ్చుకోలేదు ఈ స్థితిని. మనలో ఎవరి రాతో - ఇలా జరిగిపోయింది" అంటూ, "జరిగినది మరిచి, ఇక మనమే చొరవ తీసుకొని, పద్మకు దన్నుగా నిలిస్తేనే ధర్మం." అంది కాంతం, పార్వతిని చూస్తూ.
పద్మ కన్నవారు ఏమీ మాట్లాడలేకపోతున్నారు ఇంకా. విషయం ఏమిటో వారికి తెలియడం లేదు.
"బావగారూ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఈ స్థితి నా కొడుకుకి వస్తే, నేను వాడికి మళ్లీ పెళ్లి చేపట్టేవాడిని" అన్నాడు సూర్యం, గబుక్కున.
పద్మ కన్నవారు మొహాలు చూసుకున్నారు.
"అవును వదినగారూ, రోజులకు తగ్గట్టు నడుచుకోవాలి. పద్మ పెళ్లి తర్వాత జీవితం ఏమి అనుభవించింది! ఆమెని మూలకు నెట్టేయడం ఏమి సబబు?" అంది కాంతం, తొందరగా.
ఆయోమయంలో పడ్డారు పద్మ కన్నవారు.
"బావగారూ, మనం పద్మ సుఖాన్ని ఆశిద్దాం. కొద్ది వయసులోనే ఆమెకు ఏర్పడిన ఈ తెరను మనం తొలగిద్దాం" అన్నాడు సూర్యం.
"మాకు తెలిసిన ఒకతను ఉన్నాడు. మంచి వాడు. ఉఁ, అనుకుంటే మేమే వాళ్లతో మాట్లాడతాం. మేము పద్మకు దగ్గరుండి మళ్లీ పెళ్లి చేస్తాం. ఆమెకు తిరిగి మంచి బ్రతుకుని ఇద్దాం" అంది కాంతం, చొరవగా.
అప్పటికీ పద్మ కన్నవారు ఏమీ అనలేకపోతున్నారు.
"బావగారూ, పద్మతో మీరు మాకు ఇచ్చిన అన్నిటిని మేము తిరిగి ఇచ్చేస్తాం. వాటితోనే తిరిగి పద్మకు పెళ్లిచేసి ఆమె బ్రతుకును చక్కబెడదాం" చెప్పాడు సూర్యం.
"ఇక మీదే ఆలోచన. మేము పద్మ సుఖ జీవితాన్ని మనసారా కోరుకుంటున్నాం" చెప్పింది కాంతం.
పద్మనే చూస్తున్నారు ఆమె కన్నవారు. ఆమె ఆయోమయంగా చూస్తోంది.
"వత్తిడి తెస్తున్నామని అనుకోవద్దు. కాలయాపన చెడ్డది. మీరూ నేటికి తగ్గట్టుగా ఆలోచించండి." చెప్పాడు సూర్యం.
అప్పుడే డోర్ బెల్ మ్రోగింది. ప్రభాకర్ లేచి వెళ్లాడు. బయట తలుపు తీశాడు. వచ్చినామెను చూసి, "రా అమ్మా. ఎప్పుడు వచ్చావు?" అన్నాడు పలకరింపుగా.
"ఉదయమే అన్నయ్యా" అంది ఆ వచ్చినామె. ఆమె పద్మతో కలిసి చదువుకుంది. ప్రస్తుతం పెళ్లి రీత్యా, ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటుంది.
ఆమె ప్రభాకర్ తో లోనికి వస్తూ, "రవి పోయిన వెంటనే పద్మను కలవలేక పోయాను. నీకు తెలుసుగా వెంటనే రావడం కుదరదు. ప్చ్." అంది.
ప్రభాకర్ చిన్నగా నవ్వి, పద్మతో "సరళ వచ్చిందిరా" అన్నాడు.
పద్మ లేచి వచ్చింది.
సరళ మెల్లిగా పద్మను దగ్గరగా లాక్కుంది.
ఇద్దరి కళ్లల్లో నీళ్లు కదలాడుతున్నాయి.
సరళను పద్మ తల్లిదండ్రులు, వదిన పలకరించారు.
"గదిలోకి వెళ్లి కూర్చోండమ్మా" పద్మతో చెప్పింది పార్వతి.
వాళ్లిద్దరూ గదిలోకి వెళ్లారు.
"పద్మతో పదవ తరగతి నుంచి డిగ్రీ వరకూ కలిసి చదువుకున్నఅమ్మాయి ఆమె. ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ ఊరమ్మాయే. ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. ఇంటికి వచ్చి, తెలిసి వచ్చినట్టుంది." చెప్పింది పార్వతి, కాంతంతో.
"అలాగా. అయితే ఆమెతో మాట్లాడి, ఆమెతో పద్మకు చెప్పిద్దాం. ఎంతైనా మంచి స్నేహితురాలు అంటున్నారు, పైగా అమెరికాలో ఉంటుందంటున్నారు. మనకంటే ఆమె మాటలు పద్మకు నచ్చవచ్చు" అంది కాంతం, చురుకుగా.
"ఆ విషయాలు తర్వాత మాట్లాడు కుందాం. కొద్ది రోజులు పోనీయండి" అన్నాడు ప్రభాకర్.
"అవునవును, పద్మతో మాట్లాడి తర్వాత మేము చెప్తాం." అన్నాడు జోగారావు వెంటనే.
"టైం ఎంతైందిరా" అడిగింది కొడుకుని పార్వతి.
"నాలుగు అవుతోంది" చెప్పాడు ప్రభాకర్.
"టీ కలుపుకు వస్తాను" అంటూ మాలతి వంట గది వైపు నడిచింది.
"మాకు ఇంటి వద్ద పనులు ఉన్నాయి. ఈ విషయం గురించే వచ్చాం. మేము ఇక బయలుదేరతాం" చెప్పాడు సూర్యం, కాస్త అసహనంగా.
"బావగారూ, నిజంగా మేము ఇంకా పద్మ గురించి ఏమీ అనుకోలేదు. మీరు ఇప్పటికిప్పుడు చెప్పమంటే ఏమీ చెప్పలేక పోతున్నాం" అన్నాడు జోగారావు నిదానంగా.
"సరే అన్నయ్యగారూ, మీరంతా ఆలోచించుకొని చెప్పండి. రెండు మూడు రోజుల్లో చెప్పండి. మేము పద్మ గురించి బాగా ఆలోచించే మాట్లాడు తున్నామని మాత్రం గుర్తు పెట్టుకోండి" అంది కాంతం వెంటనే.
"అలాగేనమ్మా" అన్నాడు జోగారావు.
"అయితే మేము బయలుదేరతాం" అంటూ లేచింది కాంతం.
"ఉదయమే వచ్చారుగా. పనులు ఉంటే ఈ రాత్రికి ఉండి, రేపు ఉదయం బయలుదేరండి వదినగారూ" అంది పార్వతి.
"లేదమ్మా, వెళ్లాలి" చెప్పాడు సూర్యం.
అంతలోనే హాట్, స్వీట్, టీతో మాలతి అక్కడకు వచ్చింది. అందరికీ అవి పెట్టింది.
ఆ తర్వాత పద్మ అత్త, మామలు వెళ్లిపోయారు. వెళ్తూ, "పద్మ విషయంలో మా ఆలోచనను కాదనరనే మేము వెళ్తున్నాం. ఆ చక్కని కబురు కై ఎదురు చూస్తుంటాం. త్వరగా ఫోన్ చేయండి." అని చెప్పారు కోరస్ గా.
ఆత్తమామలను సాగనంపడానికి వచ్చిన పద్మ, వాళ్లు వెళ్లిపోయన తర్వాత, తిరిగి సరళతో కలిసి గదిలోకి నడిచింది.
అప్పటికే తన అత్తమామలు చెప్పిన తన మళ్లీ పెళ్లి ఆలోచనని క్లుప్తంగా సరళతో చెప్పింది పద్మ.
"విన్నావా, వాళ్లు వెళ్తూ కూడా ఆ విషయమే నొక్కి చెప్పారు." అంది పద్మ, సరళతో.
"ఆఁ, అవునే ... అయినా నీ నిర్ణయమే తుది నిర్ణయం. ఆలోచించి నడు." చెప్పింది సరళ.
సూర్యం, మర్నాడు ఉదయాన్నే తన కొడుకు కొలీగ్ శ్రీకర్ ని కలుసుకున్నాడు.
"వాళ్లు ఏమన్నారు?" శ్రీకర్ అడిగాడు.
"ఆలోచించి చెబుతారట" చెప్పాడు సూర్యం.
"గమ్మున తేల్చండి" అన్నాడు శ్రీకర్.
ఏమీ అనలేదు సూర్యం.
"ఒక వేళ వాళ్లు ఆమెకు మళ్లీ పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోతే, మళ్లీ పెళ్లితో లింక్ పెట్టక, ఆమె నుంచి మీకు లభించినవన్నీ తిరిగి వారికి నేరుగా ఇచ్చేసి, తెగ తెంపులు చేసుకోండి. అలాగైనా మీ కోడలుతో బంధుత్వం మీరు తెంచుకోవచ్చు. ఇలా కూడా మీరు ఆశిస్తున్నది మీరు పొందవచ్చు." చెప్పాడు శ్రీకర్.
అప్పుడే తన కోసం కొంతమంది రావడంతో వారితో మాటలు మొదలు పెట్టాడు శ్రీకర్.
సూర్యం కొద్దిసేపు ఉండి, లేచి, "మళ్లీ కలుస్తాను" చెప్పాడు.
శ్రీకర్ 'సరే'నన్నట్టు తలూపాడు.
సూర్యం అక్కడి నుంచి అసహనంగా కదిలాడు.
ఇంటికి తిరిగివచ్చాడు.
"నిజమే కదండి ... ఆ అబ్బాయి చెప్పింది బాగుంది. ఎలాగూ మనం అవన్నీ తిరిగి ఇచ్చేయాలనుకున్నాం కదా. అన్నీ ఇచ్చేసి, వాళ్లకూ మనకూ మధ్య ఇకపై ఏ సంబంధాలూ లేవనుకుంటే సరిపోతుందిగా" అంది కాంతం, ఉత్సాహంగా.
"అయితే ఇప్పుడే వాళ్లకు ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడతాను" అన్నాడు సూర్యం.
"ఉండండి. రెండు మూడు రోజులు ఆగండి. అప్పటికీ వాళ్ల నుంచి సమాధానం లేకపోతే ఏం ఆలోచించారని అడుగుతూ, ఈ విషయం కూడా చెప్పి, వెంటనే ఏదో ఒకటి తేల్చమనండి." అంది కాంతం, నిదానంగా.
"సరే, నీ ఇష్టం" అన్నాడు సూర్యం.
మర్నాడు సాయంకాలం సూర్యంకి ఫోన్ వచ్చింది శ్రీకర్ నుంచి.
"నేను ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కొరియర్ ద్వారా మీ కోడలు ఉత్తరం పంపించింది. చనిపోయిన తన భర్తకు సంస్థ నుంచి రావలసినవన్నీ తనకు ఇప్పించవలసిందిగా కోరుతూ ఉత్తరం రాసింది. కనుక ఇక మీకు నేను చేసేది ఏమి లేదు. పైగా మా సంస్థ మేనేజర్ సెటిల్ మెంట్ గడువు దగ్గరైందని ఎకాఎకీగా ఆ ఏర్పాట్లు కూడా అప్పుడే మొదలు పెట్టేశాడు. ఈ విషయమై ఇక నన్ను మరి కలవవలసిన అవసరం లేదు." చెప్పాడు శ్రీకర్, ఏకబిగిగా.
ఫోన్ పెట్టేసి, కాంతంకై కేక వేశాడు సూర్యం.
ఆవిడ గబగబా వచ్చింది. "ఏమిటండీ" అంటూ.
కాంతంకి విషయం చెప్పాడు సూర్యం.
"అదేమిటండీ, ఇలా అయింది. పోషిస్తున్న కొడుకు పోయాడు. ఇక కోడలు మనల్ని ఏం చూస్తుంది అన్న ఆందోళనతో దానిని వదిలించుకొని, చనిపోయిన వాడికి మనమే లీగల్ గా వారసులం అని చూపి, వాడి మూలంగా అందుతుందనుకున్న సొమ్ము పొంది, ఏ ఆసరా లేని మనం ఇక మీదట కాలాన్ని సాఫీగా నెట్టుకు పోదామనుకుంటే ఇలా జరిగిందేమిటండీ" అంది కాంతం, దిగాలు పడి.
"పెట్టుబడి కంటే ఎక్కువ మొత్తం వారికి అందుతోంది కదా" అన్నాడు సూర్యం, కసిగా.
"పైగా పెళ్లిలో వారు పెట్టినవి తిరిగి అడుగుతుందేమో" అంది కాంతం, దిగాలుగా.
"చూద్దాం, చూద్దాం" అని అరిచాడు సూర్యం.
"అలాగని మనం వారికి తల వంచేస్తామా? అదే అయితే ఇక మీదట మన బ్రతుకు!" అంది కాంతం, అనుమానంగా.
"అవునవును, ఉండు, ఏమి ఆలోచించారని మనమే వాళ్లకు ఏమీ తెలియనట్టు ఫోన్ చేద్దాం" అంటూ ఫోన్ వైపు కదిలాడు సూర్యం.
పద్మ వాళ్ల ఇంటికి ఫోన్ చేశాడు సూర్యం. అటు ఫోన్ ఎంగేజ్ లో ఉంది. మరలా మరలా ట్రై చేసినా అదే ఫలితం.
"కొద్దిసేపు ఆగి చేద్దాంలే" అన్నాడు కాంతంతో, సూర్యం.
కాంతం వంట గదిలోకి నడిచింది.
సూర్యం వాలుకుర్చీలోకి చేరాడు.
కొద్ది నిమిషాల తర్వాత, పద్మ వాళ్ల నుంచి ఫోన్ వచ్చింది, సూర్యంకి.
అటు జోగారావు మాట్లాడుతున్నాడు, "నమస్కారం బావగారూ, మేము పద్మతో మాట్లాడేం. కానీ అప్పటికే పద్మ ఒక స్థిర నిర్ణయంకి వచ్చి ఉంది. అది మాతో చెప్పి, మమ్మల్ని ఒప్పించింది. మీతో కూడా పద్మ చెబుతానంటోంది. ఇదిగో తను మీతో మాట్లాడుతుంది ..."
రిసీవర్ అటు నుంచి ఇటు మార్చుకున్నాడు సూర్యం.
"నమస్కారం మామయ్మా, నేను మళ్లీ పెళ్లి చేసుకోలేను. మామాయ్యా, నన్ను క్షమించండి. నేను మనో నిబ్బరంతో బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఒక స్థిర ప్రణాళిక చేసుకున్నాను. పైగా అది సజావుగా సాగిపోవడానికై తగు నిధిని సమకూర్చుకొంటున్నాను." చెప్పుతోంది పద్మ.
రిసీవర్ ఇటు నుంచి అటు మార్చుకున్నాడు సూర్యం, అసహనంగా.
అప్పుడే, "ఎవరండీ ఫోన్" అంటూ వచ్చింది కాంతం.
సూర్యం జవాబు ఇవ్వలేదు. పద్మ చెబుతున్నది వింటున్నాడు -
"అందుకే మీ అబ్బాయి పనిచేసే సంస్థ వారికి ఫోన్ చేశాను. అక్కడ మేనేజర్ అన్నీ చెప్పారు. క్లయిమ్ డేట్ దగ్గరవ్వడంతో ఎకాఎకీన నిన్ననే ఉత్తరం పంపేను. ఆ సంస్థ నుంచి మా వారికి రావలసిన మొత్తాన్ని నాకు ఇప్పించమని కోరాను" అంటూ -
"నేను పెళ్లిలో తెచ్చుకున్నవి, మీకు ఇచ్చినవి తిరిగి, మీరు నాకు ఇచ్చేస్తా మన్నారు. సంతోషం. వాటిని కూడా కలుపుకొని, నా ప్రణాళికకు మంచి నిధిని సమకూర్చుకోగలను. దయచేసి, మీరు తప్పక నాకు సహకరించండి." అని చెప్పింది పద్మ, మృదువుగా.
"ఏమిటమ్మా నీ ప్రణాళిక!" అడిగాడు సూర్యం, చిరాకుగా.
"ఆర్థికంగా, సాంఘికంగా చితికిపోయిన వారి కొరకు, మీ అబ్బాయి జ్ఞాపకార్థంగా, ఆయన పేరున 'సంక్షేమ ఆశ్రమం' ఒకటి స్థాపించి, దానిని చక్కగా నిర్వహించా లన్నదే నా ప్రణాళిక మామయ్యా."అని -
"మీరు అన్యధా భావించ వద్దు, ఈ ఆలోచనకు ప్రేరకులు మీరే." అంటూ, "ముందుగా మీతో, అత్తమ్మగారితోనే ఆ ఆశ్రమం ప్రారంభమవుతోంది" అని చెప్పింది పద్మ.
సూర్యం ఉలిక్కిపడ్డాడు.
పద్మ ఇంకా చెప్పుతోంది -
సూర్యం కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లూరాయి. ఆ తడి కళ్లతో గోడన నవ్వుతూ ఉన్న తన కొడుకు రవి ఫోటో వంక చూస్తూ ఉండిపోయాడు. అతడికి అక్కడ రవి స్థానంలో పద్మ కనిపిస్తున్న ట్టనిపిస్తోంది.
***
(ముద్రితం : కథాకేళి మాస పత్రిక - జూలై, 2006)
***