ఆ ఊరి పక్కనే ఒక ఏరు
(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)
శివ రామ కృష్ణ కొట్ర
"పెళ్లిచేసుకోబోయే అమ్మాయిలో ఉండాల్సిన ఉత్సాహం, చురుకుతనం ఆ అమ్మాయిలో కనిపించడం లేదు." మంగవేణి అంది.
"ఆ అమ్మాయి ప్రాబ్లెమ్ నీకు చెప్పాను కదా మామ్, అది సాల్వ్ అయ్యేవరకూ తను అలాగే ఉంటుంది." భోజనం చేస్తూ అంది తనూజ.
"ఏం ప్రాబ్లమో ఏమిటో. అది సాల్వ్ చెయ్యడం నీవల్ల అవుతుంది అన్న నమ్మకం మాత్రం నాకు కలగడం లేదు. ఎవరైనా ఇంకో పెద్ద సైకాలజిస్ట్ కి తనని చూపించడం మంచిదేమో." మంగవేణి అంది.
ఆ మాట వింటూనే నవ్వింది వనజ.
"నువ్వైనా నన్ను నమ్మమ్మా ప్లీజ్." కోపంగా అంది తనూజ.
"నిన్ను నమ్మటం మాట ఆలా వుంచు. మీరంతా ఏమనుకున్నా నేను ఒక్క మాట చెప్పదలచుకున్నాను. ఇది మీరంతా అనుకుంటున్నట్టుగా ఎదో మానసిక సమస్య అనిపించడం లేదు. ఇప్పటికి ఇంకా ఆ చిట్టిరాణి వాళ్ళ ఇంటికి రాలేదు. అదే చచ్చి దెయ్యం అయి సుస్మితని పీడిస్తోందన్న ఆలోచన మీకెందుకురావడం లేదు?" మంగవేణి అంది భోజనానికి ఉపక్రమించేముందు.
"మామ్, నువ్వాపుతావా? అతికష్టం మీద వీళ్లందరినీ నేను తనది కేవలం మానసిక సమస్య మాత్రమే అని ఒప్పించాను. నువ్వది మళ్ళీ నీ పిచ్చిమాటలతో మార్చడానికి ప్రయత్నించకు." తనూజ కోపంగా అంది.
"నేను ఈ ఇంటి మంచికోరుకునే దాన్ని. నువ్వేదో నీ మోడరన్ ఆలోచనలన్నీ వీళ్ళ మీద ప్రయోగించి, వీళ్ళని ఇబ్బందులపాలు చేస్తానంటే చూస్తూ ఊరుకోలేను." మంగవేణి అంది.
దానికి తనూజ ఎదో అనబోతూవుండగా మేడమీదనుండి ఉత్సాహంగా దిగుకుంటూ కిందకి వచ్చింది సుస్మిత. "అదేమిటి, నేను లేకుండానే మీరంతా భోజనాలు చేసేస్తున్నారు?" కోపంగా అడిగింది.
"నువ్వు హెడేక్ అని పడుకున్నావు. అది తగ్గాక తింటావులే అని మేమందరం తింటున్నాం." సుస్మితలో ఆ ఉత్సాహాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు మదన్.
"హెడేక్ లేదు, ఏమీ లేదు. చాలా హాపీగా వున్నాను నేనిప్పుడు." మంగవేణి పక్కన ఖాళీగా వున్నా కుర్చీని లాక్కుని అందులో కూలబడుతూ అంది సుస్మిత. "అవునూ ఈ రోజు నాన్-వెజ్ ఏమీ వండలేదా?"
"ఎందుకు వండలేదూ? ఈ రోజు అన్నీ నాన్-వెజ్ ప్రత్యేకమే. ఆలా చూడు ఫిష్ కర్రీ, చిల్లీ చికెన్, బటర్ ప్రాన్స్,ఆలా చూడు."
"నేనీరోజు వీటిల్లో వేటినీ వదిలిపెట్టను. మొదట చికెన్ తో మొదలుపెడతాను." ఎవర్నీ అడక్కుండా అక్కడున్న ఒక ప్లేట్ తీసుకుని ఆ చికెన్ కర్రీ వడ్డించుకుంటూ అంది సుస్మిత.
సుస్మిత వ్యవహారం చూసి అప్పుడు అక్కడ వున్నది సుస్మిత కాదు, చిట్టిరాణి అని అందరికీ అర్ధం అయిపొయింది.
"అవునమ్మాయ్, నువ్వు బ్రాహ్మిన్ వి కదా. మరి చికెనేమిటి ఆలా తినేస్తున్నావు?" ఏ సంకోచం లేకుండా చికెన్ తినేస్తున్న సుస్మితని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మంగవేణి.
"నేను బ్రాహ్మిన్ ఏమిటి ఆంటీ? నాదీ మీ కులమే కదా." ఇంకొంచెం చికెన్ వడ్డించుకుంటూ అంది సుస్మిత. సుస్మిత ఆలా చికెన్ తింటూవుంటే, మదన్ కి ఆరోజు తనూజ బలవంతంగా చికెన్ తినిపిస్తూ ఉంటే ఏడ్చిన సుస్మిత గుర్తుకి వచ్చింది.
"వనజక్క ని అడగండి. నాన్-వెజ్ అంటే నాకెంత ఇష్టమో. తను వండుతూవున్నప్పుడే నేను తీసుకుని తినేసేదాన్ని."
అదికూడా గుర్తుంది మదన్ కి. వంటింట్లో వనజ కి సాయంగా ఉండడమే కాదు, వండినవి ఎక్కువగా తనే రుచి చూసేస్తూ కూడా ఉండేది. చికెన్ తరువాత, తక్కిన నాన్-వెజ్ ఐటమ్స్ కూడా ఒకదాని తరువాత ఒకటి పెట్టుకుని సుస్మిత తినేస్తూ ఉంటే తక్కిన అందరూ భోజనాలు చెయ్యడం కూడా మర్చిపోయి తననే చూస్తూ ఉండిపోయారు.
"మీకన్నా ఆలస్యంగా వచ్చిన నా భోజనమే ముందు పూర్తయ్యింది. మీ గురించి వెయిట్ చెయ్యలేను. నేను వెళ్తున్నా." ప్లేటులోనే చెయ్యికడుక్కుని అక్కడనుండి వెళ్ళిపోయింది సుస్మిత.
"ఆ రోజు సుస్మిత అన్న మాట గుర్తుందా మదన్? తను కూడా నీ అలవాట్లన్నీ చేసుకోవాలని చెప్పింది. అందుకనే ఈ రోజు నాన్-వెజ్ ఇలా తినేసింది." ఇంకా ఆశ్చర్యంగా చూస్తూవున్న మదన్ మొహంలోకి చూస్తూ అంది తనూజ.
"ఆలా అయితే తను సుస్మితలాగే వచ్చి తినొచ్చు. ఇలా చిట్టిరాణిలా వచ్చి తిననక్కరలేదు." చిరాగ్గా అన్నాడు మదన్. "అయినా తను ఇప్పుడు తిన్న తీరు ఎదో అలవాటు చేసుకుంటున్నట్టుగా లేదు. ఎప్పటినుంచో అలవాటుగా, ఇష్టంగా వున్నది తిన్నట్టుగా వుంది."
మదన్ ఆలా అనేసరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది తనూజ.
" నాకింక ఆకలిగా లేదు." ప్లేటులోనే చెయ్యి కడుక్కుని లేచిపోయాడు మదన్.
&&&
"నువ్వేమిటి కిందనుండి వస్తున్నావు?" రూమ్ లోకి వచ్చిన మదన్ ని చూస్తూ అడిగింది సుస్మిత.
"కిందని భోజనం చేసి వచ్చాను." చిరాగ్గా అన్నాడు మదన్.
"నన్ను పిలవొచ్చుకాడా. నేనూ భోజనం చెయ్యలేదు. నీ కూడా వచ్చి భోజనం చేసేదాన్ని."
"ఇప్పుడే కిందన పీకలదాకా తినివచ్చావు, అప్పుడే మర్చిపోయావా?" మదన్ లో చిరాకు ఇంకా పెరిగిపోయింది.
"ఏమిటి నేను కిందకొచ్చి భోజనం చేసానా? ఇప్పుడే కదా నేను నిద్రనుండి లేచింది!" ఆశ్చర్యంగా అంది సుస్మిత. అంతలోనే ఎదో గమనించినట్లుగా అంది. "ఎస్, యూ ఆర్ రైట్. నా పొట్ట చాలా హెవీ గా వుంది. నేను కిందకొచ్చి భోజనం చేసే వుంటాను."
"థాంక్ గాడ్! ఏం చెయ్యాలి ఇప్పుడు నేను." అక్కడే వున్నా కుర్చీలో నిస్సత్తువగా కూలబడుతూ అన్నాడు మదన్. "నువ్వెప్పుడూ చిట్టిరాణి గా మారతావో, ఎప్పుడు సుస్మిత గా ఉంటావో అస్సలు తెలియడం లేదు."
"ఐ యాం సో సారీ, మదన్. నేను నిన్ను చాలా బాధపెడుతున్నాను కదా." మదన్ కుర్చీ వెనక్కొచ్చి అతని భుజాల చుట్టూ తన చేతులు వేసి అంది సుస్మిత.
మదన్ కుర్చీలోనుండి లేచి, కొంచెం అటుగా వచ్చి సుస్మితని తన కౌగిలి లోకి తీసుకున్నాడు. "నన్ను బాధపెట్టడం కాదు. నన్ను ప్రేమించానని ఇంతదూరం నా దగ్గరికి వచ్చి నువ్వే పడరాని పాట్లు పడుతున్నావు. చిట్టిరాణి గా మరి నువ్వేం చేస్తున్నావో నీకే తెలియడంలేదు. నువ్వేం తింటున్నావో నీకే తెలియడంలేదు. కిందని భోజనంలో నువ్వు కేవలం నాన్-వెజ్ ఐటమ్స్ మాత్రమే తిన్నావు."
"నిజంగానా?" షాక్ తో నిండిపోయింది సుస్మిత మొహం.
"ఆ రాక్షసి నిన్నెప్పుడు పూర్తిగా వదిలేస్తుందో బాధపడడం లేదు. దానిని ప్రేమించని పాపానికి నన్ను, నిన్నూ ఇంత బాధపెడుతుందని అనుకోలేదు." విచారంగా అన్నాడు మదన్.
"విచారపడకు మదన్. అన్ని సమస్యలు త్వరలోనే తీరిపోతాయి." మొదట తనని కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. తరువాత ఆలా కిందకి వచ్చి మెడమీద సున్నితంగా ముద్దుపెట్టుకుంది. ఆ ముద్దులని ఆస్వాదిస్తూ అలాగే వున్నాడు మదన్. అంతలోనే నోరు గట్టిగా జాపి ఊహించని రీతిలో మదన్ మెడ మీద గట్టిగా కరిచింది సుస్మిత. ఎంత గట్టిగా కరిచింది అంటే గాట్లుపడి రక్తం కారడం ప్రారంభించింది. ఆ బాధ తట్టుకోలేక పెద్దగా అరిచాడు మదన్.
"నేను రాక్షసినా? నిన్ను మనసారా ప్రేమించడమేగా నేను చేసిన తప్పు? నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఇంతకూ ఇంతా అనుభవించేలా చేస్తాను." పెద్దగా నవ్వుతూ అరవడం మొదలుపెట్టింది సుస్మిత.
అప్పుడే భోజనాలు పూర్తి చేసి,వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళబోతున్న అందరూ ఒక్క వుదుటన మెడమీద గదిలోకి వచ్చారు. అప్పటికి ఇంకా సుస్మిత పెద్దగా ఆలా నవ్వుతూనే వుంది. తనూజ వేగంగా సుస్మిత ముందుకువెళ్లి తన రెండు భుజాలు పట్టుకుని బలంగా కుదిపింది.
"ఏం .....ఏం .....జరిగింది?" అయోమయంగా చూస్తూ అడిగింది సుస్మిత.
"ఏం జరిగిందా, చూడు నువ్వు మదన్ ని ఎలా కొరికేసావో?" మదన్ మెడ మీదనుండి కారిపోతూవున్న రక్తాన్ని తన చీరకొంగుతో ఒత్తుతూ కోపంగా అంది వనజ.
"ఐ యామ్ సారీ, ఐ యామ్ సో సారీ మదన్. నేనిలా ఎలా చేశాను?" వేగంగా వచ్చి మదన్ ని కౌగలించుకుని భోరుమని ఏడుస్తూ అంది సుస్మిత.
"ఇది నువ్వు చేసిన పని కాదే పిల్లా. నీలో వున్నఆ చిట్టిరాణి దెయ్యం చేసింది. ఇప్పటికైనా ఆ దెయ్యాన్ని తరమగొట్టేందుకు ఏదోఒకటి చెయ్యకపోతే లాభంలేదు." మంగవేణి అంది.
"మామ్, ప్లీజ్." తనూజ కోపంగా ఎదో అనబోయింది.
"ఆంటీ చెప్పినదాంట్లో తప్పేంలేదు. నాకూ అదే నిజం అనిపిస్తూంది." అని మదన్ అక్కడే వున్న వంశీ మొహంలోకి చూసాడు. "నీకు తెలిసిన భూతవైద్యుడు వున్నాడని అన్నావు కదా. వాడిని కొంచెం తీసుకొస్తావా?"
" తప్పకుండా తీసుకొస్తాను. వాడు ఇలాంటి దెయ్యాల్ని చాలా వాటిని వదలగొట్టాడు అని విన్నాను." వంశీ అన్నాడు.
"కానీ వాడు చింత బరికలు, వేప బరికలు తో సుస్మిత వళ్ళంతా బాదేస్తాడు. అది నీకిష్టమా?" తనూజ అడిగింది.
"నాలోంచి ఆ చిట్టిరాణి దెయ్యం పోవడానికి నేనేమైనా భరిస్తాను. నాకు దీనికి అభ్యంతరం లేదు." సుస్మిత చెప్పింది.
"ఇంకా ఆలస్యం దేనికి? ఆ భూతవైద్యుడు ని పిలిపించి ఆ దెయ్యాన్ని వదలగొట్టించేయండి." మంగవేణి సజెస్ట్ చేసింది.
"అలాగే చేస్తారులే కానీ ఇప్పుడు ఇక్కడనుండి మీరందరూ వెళ్తే నేను, సుస్మిత ఇంకా పడుకోవాలి." తనూజ చిరాగ్గా అంది.
తరువాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక, తనూజ, సుస్మిత కాస్సేపు కబుర్లాడుకున్నాక నిద్రకి ఉపక్రమించారు.
&&&
"నా దెబ్బపడితే వదలని దెయ్యం ఉండదు. ఇలాంటి దెయ్యాల్ని ఎన్నింటినో వదలగొట్టాను. ఇంతకీ ఆ దెయ్యం పట్టిన పిల్ల ఎక్కడ వుంది?" వంశీ తీసుకొచ్చిన భూతవైద్యుడు గట్టిగా అరుస్తూ అడిగాడు.
ఎర్రటి బట్టలతో, నుదుట పెద్ద బొట్టుతో, చేతిలో వేపమండలతో చూడడానికే చాలా భయంకరంగా వున్నాడు ఆ భూతవైద్యుడు. వాడి చేతిలో ఒక సంచీ కూడా వుంది.
"నువ్వు కాస్త గొంతు తగ్గించు. విషయం ఏమిటంటే, ప్రస్తుతం తన వంట్లో ఆ దెయ్యం లేదు. అది వచ్చిన తరువాత కదా నువ్వు వదలగొట్టగలిగేది." చిరాగ్గా అన్నాడు మదన్.
"నేనా దెయ్యాన్ని రప్పిస్తాను, బంధిస్తాను.ముందు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి." ఆ భూతవైద్యుడు అన్నాడు.
వనజ సుస్మిత రూమ్ లోకి వెళ్లి అక్కడనుండి సుస్మితని కిందకి తీసుకొచ్చింది. "ఇతనే నీలో వున్న దెయ్యాన్ని వదలగొట్టబోయే భూతవైద్యుడు." సుస్మిత చెప్పింది.
" ఏమే, నువ్వెక్కడ చచ్చావు? ఈ అంకాల భూతవైద్యుడిని చూస్తే నీకు భయంపుట్టిందా? ముందు ఈ అమ్మాయిలోకి రా." గట్టిగా అరిచాడు ఆ భూతవైద్యుడు.
"నాకు చాలా భయంగా వుంది. నేను ఇక్కడినుండి వెళ్ళిపోతాను." అక్కడనుండి వెళ్ళిపోడానికి వెనక్కి తిరిగింది సుస్మిత.
"నువ్వు కూడా ఒప్పుకుంటేనే కదమ్మా తీసుకొచ్చాం. ఆ దెయ్యం వెళ్ళిపోతే నీకూ హాయిగా ఉంటుంది కదా. కాస్త ఓపిక పట్టు." సుస్మిత భుజాలచుట్టూ తన కుడిచెయ్యివేసి అనునయంగా అంది వనజ.
"ముందు అమ్మాయిని ఆ కుర్చీలో కూచోపెట్టండి. కదలకుండా పట్టుకోండి." గట్టిగా హుంకరిస్తూ అన్నాడు ఆ భూతవైద్యుడు అక్కడ వున్న ఒక కుర్చీని గది మధ్యలోకి లాగి .
"నన్నెవరూ పట్టుకోనక్కరలేదు. నేనే కూచుంటాను." ఆ కుర్చీలో కూచుంటూ అంది సుస్మిత.
"నేనంటే నీకు భయమేమిటె? అందుకనే ఇక్కడికి రాకుండా దాక్కున్నావా? నిన్ను రప్పిస్తానే? నిన్ను నా దగ్గరున్న కుండలో బంధించి ఏడూ సముద్రాల అవతల పడేస్తాను. ఈ రోజు నిన్నెవ్వరూ నానుండి కాపాడలేరు." ఆలా అన్నాక ఏవో మంత్రాలూ చదువుతూ సుస్మితని తన చేతిలో వున్న వేపమండలతో గట్టిగా బాదడం మొదలు పెట్టాడు.
"అపరా, ఆపు. నన్నెందుకురా ఇలా కొడతావు." సుస్మిత అరుస్తూ కుర్చీలోనుంచి లేవబోయింది.
"దానిని లేవకుండా కుర్చీలో అదిమి పట్టుకోండి." భూతవైద్యుడు ఆలా అనగానే ఒక్క తనూజ తప్ప తక్కిన అందరూ కూడా అదే పని చేశారు.
"ఒరేయ్, అపరా, ఆపు. నేను వెళ్ళిపోతాను. ఇంక రాను. కొట్టడం ఆపు." భూతవైద్యుడు విచక్షణా రహితంగా వేపమండలతో బాదేస్తూ ఉంటే గట్టిగా ఏడుస్తూ అంది సుస్మిత.
"నువ్వు వెళ్లిపోవడం కాదే. నా దగ్గర వున్న ఈ కుండలోకి రా, నువ్వు ఈ కుండలోకి వచ్చేవరకూ నేను కొట్టడం ఆపను." తన సంచీలోనుంచి ఒక చిన్న మూతవున్న కుండని మూత తీసి కిందని పెట్టాక మళ్ళీ సుస్మితని గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు వాడు.
"అలాగే చేస్తాను, నన్ను కొట్టకు. నేను ఆ కుండలోకి వచ్చేస్తాను." ఏడుస్తూ అంటోంది సుస్మిత. అందరూ తను కదలకుండా కుర్చీలో అలాగే నొక్కిపట్టి అట్టేపెట్టారు.
"ముందు నువ్వు ఈ కుండలోకి రావే, ఈ కుండలోకి రా. అప్పుడుగాని నిన్ను వదిలేది లేదు." ఇంకా గట్టిగా కొడుతూ అరుస్తున్నాడు ఆ భూతవైద్యుడు.
సడన్ గా సొమ్మసిల్లి పక్కకి వాలిపోయింది సుస్మిత.
"ఆ ఇప్పుడు ఆ దెయ్యం ఈ కుండలోకి వచ్చేసింది." ఆ కుండమీద మూతని చటుక్కున పెట్టేసి, దానిని తన సంచీలో పెట్టేసుకుంటూ అన్నాడు భూతవైద్యుడు. "దీనిని ఏడూ సముద్రాల అవతల భూస్థాపితం చేసేస్తాను. ఇంక ఆ దెయ్యం మీ జోలికే రాదు." మదన్ మొహంలోకి ఎక్సపెక్టింగా చూస్తూ అన్నాడు భూతవైద్యుడు.
"వంశీ ఇతనికి ఇవ్వాల్సినదేదో ఇచ్చిపంపించు." వంశీతో చెప్పి ఆందోళనగా సుస్మిత దగ్గరికి వచ్చాడు మదన్.
"ఇప్పుడు మీ అందరికీ ఆనందంగా వుందా? చూడు ఆ వేపమండలతో రక్తం వచ్చేలా ఎలా బాదేశాడో?" అప్పుడే కళ్ళు తెరిచి మూలుగుతూ వున్న సుస్మితని పక్కనే మోకాళ్ళమీద కూచుని తన రెండుచేతుల్లోకి తీసుకుని, మదన్ మొహంలోకి చూస్తూ కోపంగా అంది తనూజ.
"అయితే ఏం, ఆ దెయ్యం వదిలిపోయిందికదా. ఇక్కడనుండి తను హాపీగానే ఉంటుంది." సుస్మిత దగ్గరగా వెళ్లి తన కుడిచేతిని తన రెండుచేతుల్లోకి తీసుకుని నొక్కుతూ అన్నాడు మదన్.
"ముందు తనని తన రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టండి. నేను తనకి వేడి పాలు తీసుకుని వస్తాను." అక్కడనుండి వెళుతూ అంది వనజ.
&&&
"నావల్లే కదా నీకీ పాట్లన్నీ.నన్ను వెదుక్కుంటూ వచ్చి ఉండక పొతే హాయిగా వుండేదానివి." బెడ్ మీద తనని పడుకోబెట్టి ఆ పక్కనే ఎడ్జ్ మీద కూచుంటూ అన్నాడు మదన్.
దానికి సమాధానం ఏమీ చెప్పకుండా నెమ్మదిగా కళ్ళు మూసుకుంది సుస్మిత.
"తనకి బాగా అలసటగా ఉన్నట్టుంది బావా. ఇప్పుడేం మాట్లాడించకు." తనూజ అంది.
"ముందు నేను తెచ్చిన ఈ వేడి పాలు తాగితే తనకి శక్తి వస్తుంది. అప్పుడు కాస్సేపు పడుకుంటే అంతా సర్దుకుంటుంది." తన తెచ్చిన పాలగ్లాస్ బెడ్ దగ్గరికి వచ్చి సుస్మిత వైపు తెస్తూ అంది వనజ. "ఈ పాలు చాలా వేడిగా వున్నాయి. నువ్వు పట్టుకుని తాగలేవు అందుచేత నేను నీ చేత తాగిస్తాను."
"పరవాలేదు. నా చేతికి ఇవ్వండి." కుడిచేతిని చాపుతూ అంది సుస్మిత.
"సరే అయితే. కానీ పాలు బాగా వేడిగా వున్నాయి. కొంచెం జాగ్రత్త." ఆ పాలగ్లాస్ ని సుస్మిత చేతిలో పెట్టింది వనజ.
ఆ పాలగ్లాసుని జాగ్రత్తగా చేత్తోపట్టుకుంది సుస్మిత. ఆ తరువాత ఒకటి రెండు సెకండ్ల పాటు మదన్ మొహంలోకి చూసింది. అప్పుడు ఊహించని రీతిలో ఆ గ్లాసుడు పాలని మదన్ మొహంమీద గుమ్మరించింది.
"అమ్మా" వేడిపాలు మొహాన్ని తాకగానే బాధ భరించలేక పెద్ద కేక పెట్టాడు మదన్.
"ఎంతపని చేసావే పాపిష్టి దానా." కోపంగా అరిచి మదన్ దగ్గరికి వచ్చి అతని మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంది వనజ.
చేతుల్లోవున్న గ్లాసుని దూరంగా విసిరి బెడ్ మీదనుండి కిందకి దిగింది సుస్మిత కోపంగా. "ఏమిటీ, నన్ను కుండలో బంధిస్తారా? ఏడు సముద్రాల అవతల భూమిలో పాతేస్తారా? ఈ చిట్టిరాణిని బంధించడం అంత తేలికైన విషయం అనుకుంటున్నారా?" గొంతెత్తి పెద్దగా అరవడం మొదలుపెట్టింది.
ఆ అరుపులకి ముకుందం, వంశీ, మంగవేణి కూడా మేడ మీదకి వచ్చేసారు.
"నేను ఏ కుండలోకి వెళ్ళలేదు. ఆలా వెళ్లినట్టు నటించాను అంతే. నీ మీద నా మోజు ఎప్పటికీ చావదు. నిన్ను నేను ఎప్పటికీ విడిచిపెట్టను." ఇంక అలాగే పెద్ద గొంతుతో అరుస్తోంది సుస్మిత.
"ఎక్కడరా ఆ భూతవైద్యుడు?" వేడిపాలు పడి కాలిపోయిన మొహాన్ని వదిన చీరకొంగుతో సున్నితంగా ఒత్తుకుంటూ అడిగాడు మదన్ కోపంగా.
"ఇంకెక్కడి భూతవైద్యుడు? డబ్బులిచ్చి పంపించేసాను." విషయం అర్ధం అయి బెరుకు, బెరుగ్గా చూస్తూ అన్నాడు వంశీ.
"నువ్వు వెంటనే నా ముందునుండి వెళ్ళిపో. లేకపోతె నిన్నేం చేస్తానో నాకే తెలీదు." కోపంగా అరిచాడు మదన్.
వంశీ భయపడిపోయి వెంటనే అక్కడనుండి వెళ్ళిపోయాడు.
"ఇందులో వంశీ తప్పేం వుంది? మనమందరం అనుకున్నాకే కదా ఆ భూతవైద్యుడిని తీసుకొచ్చాడు? వాడలా చేతగాని వాడని వంశీకి ఎలా తెలుస్తుంది?" వనజ అంది.
"నా దగ్గర ఏ భూతవైద్యుడైన చేతగానివాడే. సన్నాసుల్లారా మీరెవరూ నన్నేమీ చెయ్యలేరు." గదిమధ్యలో నిలబడి వికృతంగా నవ్వుతూ గట్టిగా అరుస్తోంది సుస్మిత.
తనూజ సుస్మిత ముందుకొచ్చి తన రెండు భుజాల్ని తనచేతుల్లోకి తీసుకుని గట్టిగా కుదిపింది. "ఆపుతావా లేదా?" గట్టిగా అరిచింది.
"నువ్వెవరివే నన్ను ఆపమనడానికి?" తనూజని రెండు చేతులతో బలంగా వెనక్కి తోస్తూ అరిచింది సుస్మిత.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)