Nirupama - 21 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | నిరుపమ - 21

Featured Books
  • नशे की रात - भाग - 2

    अनामिका ने अपने पापा मम्मी को इस तरह कभी नहीं देखा था कि मम्...

  • अनोखा विवाह - 7

    अनिकेत आप शादी के बाद के फैसले लेने के लिए बाध्य हैं पहले के...

  • अनामिका - 4

    सूरज के जीवन में बदलाव की कहानी हर उस इंसान के लिए है जो कभी...

  • इश्क दा मारा - 35

    गीतिका की बात सुन कर उसकी बुआ जी बोलती है, "बेटा परेशान क्यो...

  • I Hate Love - 4

    कल हमने पढ़ा था कि अंश गुस्से में उसे कर में बैठा उसे घर की...

Categories
Share

నిరుపమ - 21

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

"ఆల్రైట్" తలూపింది మేనక. "నిరంజన్ ఇక్కడ సెటిల్ అవడం మీ ఆయనగారికి ఇష్టమేనా?" మళ్ళీ అదే మంద్ర స్వరంతో నిర్మల మొహంలోకి చూస్తూ అడిగింది.

"అవును"

"మీరింకేమి మాట్లాడుకున్నారు?"

"తనని ఈ ఊళ్ళోంచి వెళ్లిపొమ్మని చాలా గట్టిగా చెప్పాను." నిర్మల చెప్పింది మామూలు గొంతుతో.

'ఎందుకలా చెప్పారు' అని అడగబోయి ఆగిపోయింది మేనక. ఆలా స్ట్రెయిట్ గా అడిగితే ఆ  ప్రశ్నకి సమాధానం రాకపోచ్చనిపించింది.

"దానికి నిరంజన్ గారు ఏమన్నారు?"

"నేనెందుకు వెళ్ళాలి? రంగనాథ్ కూడా ఈ వూళ్ళో సెటిల్ అవ్వమంటేనే నేనిక్కడ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాను’. అన్నాడు."

"దానికి మీరేమన్నారు?"

"రంగనాథ్ కి ఏమి తెలియదు కాబట్టి రమ్మన్నాడు. రంగనాథ్ కి, నిరుపమ కి విషయం తెలిసిపోతే’. అన్నాను."

అక్కడ వాతావరణం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపొయింది. రంగనాథ్ చెవులు రిక్కించుకుని వింటున్నాడు.

"దానికి ఆయనేమన్నాడు?"

"ఎలా తెలుస్తుంది? నేను ఈ బ్లాక్ స్పెక్ట్స్ ఎప్పుడూ తియ్యను. వీటిని తీస్తే తప్ప ఎటువంటి ప్రమాదం లేదు’. అన్నాడు."

"దానికి మీరేమన్నారు?"

"ఒక్కసారి నీ మొహంలోకి నీ స్పెక్ట్స్ లేకుండా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే అనుమానం వచ్చే అవకాశం వుంది. అసలు మీ కళ్ళల్లో ఎక్కడైనా తేడా వుందా? అవే కళ్ళు కదా’. అన్నాను."

వాతావరణం బాగా వేడెక్కి పోయింది. తరువాత క్రూసల్ క్వెస్చన్ అడగనా, వద్దా అన్నట్టుగా స్మరన్ మొహంలోకి చూసింది. అడుగు అన్నట్టుగా తలూపాడు స్మరన్.

"తనకి స్పెక్ట్స్ లేనప్పుడు తెలిసిన వాళ్ళు చూస్తే ఏ అనుమానం వస్తుంది?"

నిర్మల నుంచి సమాధానం లేదు. నుదుటి మీద ముడతలు ఇంకొంచం ఎక్కువ అయిపోయాయి. ఏం చెయ్యాలన్నట్టుగా స్మరన్ మొహంలోకి చూసింది మేనక.

"అదే ప్రశ్న మరోసారి అడుగు. సమాధానం రాకపోతే ప్రశ్న మార్చు." చిన్న గొంతుతో అన్నాడు స్మరన్.

"ఆంటీ, మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్తారు. చెప్పకుండా ఉండలేరు." అంటూ అదే ప్రశ్నని మళ్ళీ అడిగింది మంద్ర స్వరంతో. "తనకి స్పెక్ట్స్ లేనప్పుడు తెలిసిన వాళ్ళు చూస్తే ఏ అనుమానం వస్తుంది?"

"తన కళ్ళు అచ్చం నిరుపమ కళ్ళల్లాగే ఉంటాయి. నిరుపమ నిరంజన్ కూతురని అనుమానం వస్తుంది. అదే నిజం కూడా."

&

"నేను హిప్నోటైజ్ అయి ఇదంతా చెప్పలేదు. ఇప్పటికయినా ఇందంతా నీకు తెలియాల్సిన అవసరం వుంది. అందుకనే చెప్పాను." బెడ్ మీద లేచి కూచుని రంగనాథ్ మొహంలోకి చూస్తూ అంది నిర్మల. "పదేళ్లయినా మనకి పిల్లల్లేరు. డాక్టర్లు మనలో ఏ లోపం లేదు ఎప్పుడైనా పిల్లలు పుట్టొచ్చని చెప్పినా నాకు నీ ద్వారా పిల్లలు పుడతారని ఆశ చనిపోయింది. అమ్మని కావాలన్న కోరికని చంపుకోలేకపోయాను. ఇందులో నిరంజన్ తప్పేమి లేదు రంగా. తనని నేనే బలవంత పెట్టాను." కాస్త ఆగింది నిర్మల.

మ్రాన్పడి పోయాడు రంగనాథ్. మెదడంతా షాక్ తో నిండి పోయింది. అలాగే నిర్మలవైపు చూస్తూ వుండిపోయాడు.

"నిరంజన్ తో ఒక్కసారి కమిట్ అవగానే నాకు ప్రెగ్నన్సీ వచ్చింది. నేను ఆనందం తట్టుకోలేకపోయాను. నిరుపమ పుట్టాక నా ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. కానీ ఒక్కటే పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. నిరుపమ కళ్ళు అచ్చం నిరంజన్ కళ్ళే. పెద్దయ్యాక ఆ పోలిక మరింత ఎక్కువ అవుతుందని నాకు అనిపించింది. అందుకనే నిరంజన్ ని సేతపోరి దూరంగా వెళ్లిపోయేలా చేశాను." మళ్ళీ ఆగింది నిర్మల.

రంగనాథ్ లో షాక్ తగ్గింది. నిర్మల మాట్లాడుతున్నది బుర్రలోకి వెళుతూంది.

"నిరంజన్ కి ఫామిలీ లైఫ్ ఇష్టం లేదు. కాబట్టి పెళ్లి చేసుకోలేదు. కానీ తన ద్వారా పుట్టిన నిరుపమ మీద మమకారం పెంచుకోకుండా ఉండలేకపోయాడు. రిటైర్ అయ్యాక రంగనాథే ఈ వూరు వచ్చి సెటిల్ అవ్వమనడంతో నిరంజన్ ఆగ లేకపోయాడు. తను ఎప్పుడూ స్పెక్ట్స్ పెట్టుకుంటూనే వున్నా ఎదో రోజు విషయం బయటపడుతుందేమోనని నాకు భయంగా ఉండేది. అంతే కాకుండా నిరుపమ నిరంజన్ తో చాల ఇంటిమేట్ గా ఉండడం ప్రారంభించింది. నాలో భయం మాత్రమే కాకుండా అప్పటికే వున్న గిల్టీనెస్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది."

నిర్మలలో చిన్న తేడా ప్రారంభం అయ్యింది. ఎగశ్వాస తీసుకోవడం ప్రారంభించింది. రంగనాథ్ ఆదుర్దాగా బెడ్ మీద కూచుని తనని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు.

"అవును రంగా. నిరుపమ నీ కూతురు కాదు అక్రమ సంతానం అన్న గిల్టీనెస్ నాలో ఎప్పుడూ వుంది. ఆ నిరంజన్ ఇక్కడికే వచ్చే సెటిల్ అవ్వడం తో ఆ గిల్టీ ఫీలింగ్ తో పాటుగా, ఎప్పటికైనా నీకు, నిరుపమకి నిజం తెలిసిపోతుందేమోని భయం కూడా పెరిగింది. ఆఖరికి అనుకున్నంత పని అయింది. నేను నిరంజన్ ఆ రోజు చాలా సేపు వంటిట్లో అర్గ్యూ చేసుకున్నాం. మా మాటల ద్వారా నిరూపమకి తను నీ కూతురు కాదు, నిరంజన్ కూతురునని తెలిసిపోయింది. అంతే కాకుండా నిరంజన్ కళ్ళు అచ్చం తన కళ్ళల్లాగే వుంటాయని, ఆ పోలిక బయటపడకూడదనే ఎప్పుడూ బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకుంటాడని కూడా అర్ధం అయిపోయింది. " నిర్మలలో ఎగశ్వాస ఇంకా పెరిగింది. "నిన్ను మోసం చేసాను. నిరుపమ చావుకి కారణం అయ్యాను. నన్ను క్షమించు రంగా." అంది.

'ఐ వాంట్ టు ప్లక్ మై అయిస్ అవుట్' అని బుక్ లో నిరుపమ ఎందుకు రాసిందో ఒక్కసారిగా అర్ధం అయిపోయింది మేనక ఇంకా సమీర కి.

"నువ్వు నన్ను మోసం చెయ్యలేదు. నువ్వు నన్ను మోసం చేసావనికాని, తప్పు చేసావని కానీ నేను ఎంతమాత్రం అనుకోవడం లేదు." నిర్మలని గట్టిగా గుండెలకి హత్తుకుంటూ అన్నాడు రంగనాథ్. "స్త్రీలలో మాతృత్వ వాంఛ ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు. నేను నిన్ను తల్లిని చేయలేనని తెలిసాక నువ్వలా చేసావు. ఇందులో నీ పొరపాటు ఏమి లేదు."

"రంగా...నువ్వు....నువ్వు చాలా మంచి వాడివి....." నిర్మల కళ్ళు మూతబడిపోతున్నాయి

"నిరుపమ....తనెందుకు ఎదో తప్పు చేసినట్టుగా బాధపడింది? అసలు తండ్రినే కాలేని నాకు కూతురుగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎంత పిచ్చిపని చేసింది?" కళ్ళవెంట కారుతున్న నీటిని తుడుచుకునే ప్రయత్నం చెయ్యడం లేదు రంగనాథ్.

"ఇందులో నిరంజన్ తప్పేమి లేదు రంగా. నేను బలవంతపెడితేనే....." కష్టం మీద మాట్లాడుతోంది నిర్మల.

"నిరంజన్ అప్పటికి ఇప్పటికి నాకు మంచి స్నేహితుడే. అతని మీద కోపం కావాలన్నా తెచ్చుకోలేను. అయ్యో, ఈ విషయం నాకు ఎప్పుడో తెలిస్తే ఎంత బాగుండేది? నిరుపమ ఆత్మహత్య చేసుకోకుండా చూసుకునే వాడిని." భోరున ఏడుస్తూ అన్నాడు రంగనాథ్.

"నన్ను క్షమించు రంగా. ఏ తప్పు చెయ్యకుండానే నిన్నింత బాధ పెట్టిన నాకింక బ్రతికే అధికారం లేదు. నాకు సెలవు ఇప్పించు. వెళ్ళొస్తాను."

అప్పటికిగాని అక్కడవున్న వాళ్లంతా నిర్మలలో భారీగా చోటు చేసుకుంటూన్నమార్పు గమనించలేదు.

"ఏం జరిగింది? ఎందుకిలా అయిపోతున్నావు?" నిర్మల మొహంలోకి చూస్తూ అడిగాడు రంగనాథ్.

"భోజనం అయ్యాక, ......... పడుకోబోయేముందు .........ఎలుకల మందు తీసుకున్నాను రంగా............... కొంచం ఆలస్యంగానే అయినా ..............అది తన పని తను చేస్తూంది." బెడ్ మీదకి పూర్తిగా వాలిపోయింది నిర్మల.     

&

"ఈ పాటికి వాళ్ళకి నిజం తెలిసిపోయి ఉంటుంది." కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నిరంజన్. తనని రంగనాథ్ విషయం అంత చెప్పి రమ్మని పిలవగానే తాను నిర్మలకి అంతా ఫోన్ చేసి చెప్పేసాడు.

"తనే లేకపోయాక ఇంక ఆ విషయం ఎందుకు దాచాలి? రంగాకి ఇప్పటికైనా నిజం తెలియాల్సిన అవసరం వుంది." నిర్మల అంది.

అదే నిరంజన్ కీ అనిపించింది. ఇలాంటి ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా తను ఈ వూరు వచ్చి సెటిల్ అయ్యాడు. నిరుపమ మృత్యువుకి కారణం అయ్యాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ అంత మానసిక క్షోభ అనుభవించడానికి కూడా తనే కారణం.

'ఇండివిడ్యువల్ సోల్ మీద నాకు నమ్మకం లేదు. కానీ నువ్వక్కడైనా వుండి ఉంటే నన్ను క్షమించు తల్లీ. నీ పుట్టుకకి, చావుకి రెండింటికి నేనే కారణం అయ్యాను.'

తరువాత బలవంతంగా ఊపిరి తీసుకోవడం మానేసాడు నిరంజన్ తన ప్రాణం పొయ్యేవరకు కూడా.
ఎపిలాగ్

"నాకు బుక్ లో నిరుపమ రాసిన 'ఐ వాంట్ టు ప్లక్ మై అయిస్ అవుట్' చదవగానే, అవుట్ అఫ్ ఫాషన్ అయినా బ్లాక్ స్పెక్ట్స్ ఎప్పుడూ పెట్టుకునే నిరంజన్ గుర్తుకు వచ్చాడు. ఆ రెండిటికి కచ్చితంగా కనెక్షన్ వుండి ఉంటుందనిపించింది. తరువాత అంతకన్నా ముందే తను గోడ మీద వ్రాసిన 'ఈ ఫీలింగ్ ని నేను భరించలేక పోతున్నాను' ని ఎనలైజ్ చెయ్యడానికి ప్రయత్నించాను. తప్పుచేసింది నిరంజన్, నిర్మల అయినా ఆ తప్పుకి ప్రతిరూపం అయిన నిరుపమ గిల్టీ గా ఫీలవ్వడం చాలా నాచురల్. అదే తను ఆలా ఎక్ష్ప్రెస్స్ చేసింది. అందులోనూ మీరు తననెంతో ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో మిమ్మల్ని మోసంచేస్తున్నానన్న భావన తనలో ఎక్కువైపోయింది. తరువాత తను నిరంజన్ గారి దగ్గరికి పూర్తిగా వెళ్లడం మానెయ్యడం, తన తండ్రి మొహంలోకి చూడలేకపోవడం నాకు ఆ విషయాన్నే స్పష్టం చేసాయి. వీటన్నింటికన్నా ముందు రంగనాథ్ ఇంకా నిర్మలకి పదేళ్ళపాటు పిల్లలు లేకపోవడం నా మనసులో మెదిలింది. వీటన్నిటిని లింక్ చేసి చూస్తే నా థియరీ స్ట్రాంగ్ అయింది. అంతే కాకుండా నిర్మల, నిరంజన్ భార్యాభర్తలు కావలసినంత క్లోజ్. ఒకవేళ తనకి రంగనాథ్ గారి వల్ల పిల్లలు పుట్టే అవకాశమే లేకపోతే, నిర్మల నిరంజన్ తో కమిట్ అవ్వడానికి చాలా అవకాశం ఉందని నాకు అనిపించింది. ఎలాగో నిరుపమకి తను రంగనాథ్ కూతురు కాదు, నిరంజన్ కూతురునని తెలిసిపోయింది, అదే తట్టుకో లేకపోయింది. "

ఆ సమయంలో రంగనాథ్ ఇంట్లో రంగనాథ్, స్మరన్, సమీర, మేనక ఇంకా ప్రతిమ వున్నారు. అది నిర్మల చనిపోయిన తరువాత పదిహేనవ రోజు. రంగనాథ్ ప్రతిమ ని కూడా ప్రత్యేకంగా రమ్మనమని చెప్పడంతో ఆ సమయానికి ఆవిడ కూడా అక్కడికి వచ్చింది.  తక్కిన నలుగురూ అట్టెంటివ్ గా వింటూ ఉంటే స్మరన్ చెప్తూ వున్నడు.

"సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన తనకి సడన్ గా, ఇంపల్సివ్ గా వచ్చింది. ఆ రోజు మేడ మీదకి వెళ్లేప్పుడు కూడా తను చనిపోవాలన్న ఆలోచనతో లేదు. కానీ ఒక్కసారిగా ఆ గిల్టీ ఫీలింగ్ తనని ముప్పిరిగొంది. ఇంక భరించడం తనవల్ల కాలేదు. ఆ శరీరాన్ని విడిచిపెట్టేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేసింది. ఐ యాం వెరీ సారీ. ఇది మిమ్మల్ని చాలా బాధ పెడుతుందని నాకు తెలుసు. కానీ తన ఫీలింగుని, తన స్ట్రగుల్ని తను ఎవరితోనైనా షేర్ చేసుకునివుంటే అంతపని జరిగివుండేది కాదు. తనలా ఇంపల్సివ్ గా సూసైడ్ చేసుకునేది కాదు."

కుర్చీలో వెనక్కి వాలి బాధగా కళ్ళు మూసుకున్నాడు రంగనాథ్.

"తన కళ్ళు అచ్చం నిరంజన్ అంకుల్ కళ్ళల్లాగే ఉండడం తను భరించలేక పోయింది. 'ఐ వాంట్ టు ప్లక్ మై అయిస్ అవుట్' అని బుక్ లో ఎందుకు రాసిందో ఇప్పుడు నాకు అర్ధం అయింది." సమీర అంది.

"మీరు చెప్పింది నిజం. నేను మా అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండా వుండవలిసింది. అందువల్ల నేను నా భార్యని ఇంకా ప్రాణ ప్రదమైన నా మిత్రుడిని కూడా కోల్పోవలసి వచ్చింది." కళ్ళు తెరిచి స్మరన్ మొహంలోకి విచారంగా చూస్తూ అన్నాడు రంగనాథ్.

"అంకుల్, మీకు నిర్మల ఆంటీ మీద కానీ, నిరంజన్ అంకుల్ మీద కానీ అసలు కోపం లేదా?" మేనక అడిగింది.

"కోపం దేనికమ్మా, కోపం దేనికసలు? అమ్మకావాలని ఏ స్త్రీ కయినా ఎంతగానో ఉంటుంది. నావల్ల అది సాధ్యపడదని తెలిసాకే తనలా చేసింది. ఇంక నిరంజన్. నిర్మల తనని బలవంత పెట్టింది కాబట్టే తన మాతృత్వానికి కారణం అయ్యాడు. నిజానికి ఆ ఇద్దరూ నిరుపమ అన్న ఒక మంచి అమ్మాయి పుట్టుకకి కారణం అయ్యారు." కాస్త ఆగాడు రంగనాథ్.

తక్కిన ముగ్గురూ రంగనాథ్ చెప్పేది శ్రద్ధగా వింటూ వున్నారు.

"నిరుపమ ఎప్పుడూ నా కూతురే. తన మీద నాకెప్పుడూ కోపం వచ్చి ఉండేది కాదు. తను నా వల్ల పుట్టలేదన్న బాధ నాకు పొరపాటున కూడా కలిగి ఉండేది కాదు. అన్ని నాతొ షేర్ చేసుకునే తను, ఒక్కసారి ఈ విషయం కూడా షేర్ చేసుకుని ఉంటే ఎంత బావుండేది?" కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మరోసారి మూసుకుంటూ అన్నాడు రంగనాథ్. "తనలో సూసైడ్ ఆలోచనే రాకుండా నేను ఆపేవాడిని."

"మీరు నిజంగా గ్రేట్ అంకుల్." రంగనాథ్ మొహంలోకే చూస్తూ అంది మేనక.

"తనలో అంత మధనం జరుగుతూ వున్నా, అది బయటకి తెలియకుండా నిరుపమ ఆఖరికి అంతకి ఒడిగట్టడం నిజంగా చాలా దురదృష్టకరం. నేను చేసిన అసైన్మెంట్ లన్ని ఆనందంతో చేశాను. ఫీజ్ ఆనందంగా తీసుకోగలిగాను. కానీ ఈ అసైన్మెంట్ మాత్రం నేను కచ్చితంగా సక్సెస్ కాగలనని అనిపించినా ఆనందంతో చెయ్యలేకపోయాను. మీ దగ్గర నాకు ఫీజు తీసుకోబుద్ది కావడంలేదు. దయచేసి మీరు మామూలు మనిషి కాగలిగితే చాలు." స్మరన్ అన్నాడు.

"డబ్బు ఇప్పుడు నాకు సమస్య కాదు మిస్టర్ స్మరన్. అవసరానికి మించి చాలా వుంది. అదంతా ఏమి చెయ్యాలో కూడా తెలియడంలేదు. నిరంజన్ కూడా తన ఆస్థి మొత్తం నిరుపమ పేరు మీద వ్రాసేసాడు. నిరుపమ లేకపోవడం వల్ల అదంతా కూడా నాకే వచ్చింది.” 

అక్కడ సడన్గా నిశబ్దం అలుముకుంది. ఎవరికీ ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు.

"ఈ సమయంలో నా మనసుకి కాస్త ప్రశాంతత నిచ్చే విషయం ఒకటే. ఎందుకనో తెలియదు. మేనకని మా ఇంట్లో అచ్చం నిరుపమ లాగే ఫీలయ్యాను. నిరుపమ ఇకలేదు అన్న బాధనుంచి కొంత రిలీఫ్ ని ఇచ్చింది మేనక. ఐ యాం స్యూర్. నిర్మల కూడా అలాగే ఫీలవుతూ వచ్చింది." ఆ నిశబ్దాన్ని బేధిస్తూ అన్నాక కాస్త ఆగాడు రంగనాథ్.

తక్కిన అందరూ మొహామొహాలు చూసుకున్నారు. కానీ ఏమి మాట్లాడ లేదు. నిజానికి ఏమి మాట్లాడాలో తెలియలేదు.

"ఇకపై కూడా మేనక నాకు అలాగే కూతుర్లాగే వుండగలదా? ప్రతిమ గారికి తన మీద వున్న హక్కులేమి నేను తీసుకోను. కానీ తను మా ఇంట్లోకి వచ్చాక ఇప్పటివరకూ వున్నట్టుగా ఉండగలిగితే చాలు. నేను ప్రతిమ గారిని ఇప్పుడు ఇక్కడకి రమ్మనడానికి కూడా వేరే కారణం ఏమీ లేదు. ఈ విషయం చెప్పడానికి తప్ప."

"తప్పకుండ అలాగే అంకుల్. నేను మీకు మాటిచ్చాను కూడా కదా. ఆ మాట నేనేదో పొల్లుమాటలా ఇవ్వలేదు. కచ్చితంగా పాటించడానికి ఇచ్చాను. నేను నిరుపమలా మీతో వుండడం కాదు. నిరుపమగానే మీతో వుంటాను. ఇందులో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు." దృఢస్వరంతో అంది మేనక.

"ఒక్కసారి అమ్మ అభిప్రాయం కూడా అడుగమ్మా." రంగనాథ్ చిన్నస్వరం తో అన్నాడు

"నాకూ ఇందులో ఎటువంటి అభ్యంతరంలేదు. ఇంత బాధపడుతూన్నమీ మనసుకి మా మేనక మీ కూతురుగా వుండడం వల్ల మీకు సంతోషం కలుగుతుందంటే అంతకన్నా నాకు ఇంకేమి కావాలి?" ప్రతిమ అంది.

"నా మనసుకి ఇప్పుడు చాలా సంతోషంగా వుంది." మనసులో ఆనందం అంతా మోహంలో ఎక్ష్ప్రెస్స్ అవుతూ ఉంటే రంగనాథ్ అన్నాడు.

సమీర తన కూర్చున్న కుర్చీలోనుంచి లేచి మేనక వున్న కుర్చీ వెనక్కి వచ్చి తన రెండు చేతులు మేనక భుజాల మీద వేసింది. "నువ్వు నిరుపమ గా రంగనాథ్ అంకుల్ తో ఎలా వుంటావో నాతోనూ నిరుపమ గా అలాగే వుండాలి. నిన్ను కలసిన తరువాత నేను నిరుపమ లేదన్న ఫీలింగ్ నుంచి చాలా వరకు బయట పడ్డాను. మళ్ళీ అలాంటి క్లోజ్ ఫ్రెండ్ దొరుకుతుందా అనుకున్నాను. కానీ నువ్వు దొరికావు."

మేనక లేచి సమీర భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంది. "నిరుపమ స్థానాన్ని నేనెప్పటికీ పూర్తిగా భర్తీ చేయలేనని నాకూ తెలుసు. కానీ కొంతలో కొంతైనా నువ్వూ, రంగనాథ్ అంకుల్ నా వల్ల రిలీఫ్ పొందగలిగితే అది నిరుపమకి కూడా చాలా సంతోషం కలిగించే విషయం” అంది.

ఆ తరువాత సమీర, మేనక వాళ్ళ వాళ్ళ కుర్చీల్లో కూర్చున్నాక వాళ్లంతా మరికొంత సేపు మాట్లాడుకున్నారు.

శుభం

 ఇక్కడితో ఈ నవల అయిపోయింది.  నా నవల పూర్తిగా చదివినందుకు కృతజ్ఞతలు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.