Nirupama - 1 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | నిరుపమ - 1

Featured Books
Categories
Share

నిరుపమ - 1

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

నిరుపమ

ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వున్న ఎం.ఏ (సైకాలజీ) ఫస్ట్ ఇయర్ స్టూడెంట్

అందమైనది, తెలివైనది మాత్రమే కాకుండా అందరి దృష్టిలో విల్ పవర్ వున్నటువంటిది

తన తల్లిదండ్రులకి ఎంతో అపురూపమైనది

పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టినటువంటిది

ఆర్ధికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వేరే రకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు

ప్రేమలో మోసగింపబడ్డాలు లేవు, అసలు ప్రేమ వ్యవహారాలే లేవు,

ఏ రకమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు తనమీద జరగలేదు

ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయి కనిపించింది.

ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ తెలీదు

కాస్త పరిశోధన మీద తెలిసిందల్లా ఒక్కటే,

తను ఎందుకు సూసైడ్ చేసుకుంటూందో ఎవరికైనా తెలియడం ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు

తన చావు తన తల్లిని పిచ్చిదానిగా చేసేస్తే,

తన తండ్రిని మాత్రం తాను చనిపోయింది అన్నదానికన్నా ఎందుకు చనిపోయింది అని ఎక్కువ బాధపడేలా చేసింది.

తన కూతురు ఎదో చిన్న విషయానికి సూసైడ్ చేసుకునేంత బలహీనురాలు కాదని బలంగా నమ్మాడు ఆమె తండ్రి రంగనాథ్.

ఆ విషయం తెలుసుకుని అది నిరూపించడానికే డిటెక్టివ్ స్మరన్ ని ఎంగేజ్ చేసాడు

తన కూతురికి తానెందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ తెలియడం ఇష్టం లేదని తెలిసినా మొండిగా ఆ విషయం తెలుసుకోవాలనే నిర్ణయించుకున్నాడు.

డిటెక్టివ్ స్మరన్ ఇంకా అతని మేనకోడలు చేసిన పరిశోధన లో బయటపడ్డ ఆ నిజం ఎంత తీవ్రమైందో, అది ఇంకో రెండు ప్రాణాలని బలిగొనే వరకూ తెలియలేదు 

&&&

'నేను ఈ ఫీలింగ్ ని భరించలేను' ఇంకా 'నాకు నా కళ్లని పీకేసుకోవాలని వుంది' ఒకటి గోడమీద, ఇంకొకటి తను చదువుతూన్న పుస్తకంలోనూ తన లోపల సంఘర్షణ భరించలేక  నిరుపమ బాల్ పాయింట్ పెన్ తో రాసినవి తప్ప వేరే ఏ క్లూస్ లేవు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న విషయం తెలియాడానికి. ఆమె తండ్రి రంగనాథ్ కి, ఆమె ఫ్రెండ్ సమీర కి,  డిటెక్టివ్ స్మరన్ కి, ఇంకా స్మరన్ కి డిటెక్షన్ లో హెల్ప్ చేస్తూన్న అతని మేనకోడలు మేనక కి బాగా అర్ధం అయిన విషయం ఏమిటంటే, నిరుపమకి తను ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న విషయం ఎవరికీ ఎంతమాత్రం తెలియడం ఇష్టం లేదు. కానీ ఆమె తండ్రి రంగనాథ్ పట్టుదలమీద ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన డిటెక్టివ్ స్మరన్  ఇంకా అతని మేనకోడలు మేనక  ఆఖర్లో కనిపెట్టిన విషయం ఏమిటి? ఏ సూసైడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)'

&&&

డిస్క్లైమర్

ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం.  ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు

&&&

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

మేడ మీద గదిలో బెడ్ మీద పడుకుని సీలింగ్ ఫ్యాన్ ని చూస్తూన్న నిరుపమలో మళ్ళీ అనీజీ ఫీలింగ్ మొదలైంది. ఎదో భరించ లేనంత గిల్టీ ఫీలింగ్ మళ్ళీ పూర్తిగా కమ్ముకుంది. ఈ సమస్య అంతా ఒక పదిహేను రోజుల కిందట, ఆ రోజు నుంచి మొదలైంది. ఏ తప్పు చేయకుండా తనెందుకంత గిల్టీ గా ఫీలవుతుందో ఎంత ఆలోచించినా బోధపడడం లేదు. కానీ ఈ గిల్టీ ఫీలింగ్ మాత్రం భరించలేనంత ఎక్కువగా వుంది.

తన పేరెంట్స్, నిరంజన్ అంకుల్, క్లోజ్ ఫ్రెండ్ సమీర, ఎవరితోనూ ఎందుకు తన బాధ షేర్ చేసుకో లేకపోతూంది? అందరూ తనని ప్రేమించే వారే, అభిమానించే వారే. కానీ వాళ్ళ ముందు తన నోరు పెగలడం లేదు, మాట బయటకి రావడం లేదు.

ఒకసారి తన వంటి వైపు చూసుకుంది. 'ఛీ పాపపు శరీరం, ఈ శరీరం తో వాళ్ళముందు ఇంక నేను తిరగలేను.' మనసులో అనుకుంది. ఈ పదిహేను రోజులుగా తను నరకం అనుభవిస్తోంది. ఎన్నో సార్లు ఈ శరీరం వదిలేయడం మంచిది అనిపించింది. కానీ ఆ ఆలోచనని బలవంతంగా వాయిదా వేస్తూ వచ్చింది. కానీ ఈ సారి మళ్ళీ అలాగే అనిపిస్తూ వుంది. ఇప్పుడు ఇంక వాయిదా వేయగలను అనిపించడంలేదు.

'ఎస్, నేను చనిపోవాలి. అదొక్కటే నన్ను ఈ గిల్టీ ఫీలింగ్ నుంచి సేవ్ చేస్తుంది.' మనసులో బలంగా అనుకుని బెడ్ మీద నిఠారుగా లేచి కూచుంది. 'కానీ ఎలా, ఎలా చనిపోవాలి?' తీవ్రంగా ఆలోచనలో పడింది.

ఈ పదిహేను రోజుల్లో తనకి చాలాసార్లు బలంగా చనిపోవాలని అనిపించినా, ఎలా చనిపోవాలని సీరియస్ గా ఆలోచించలేదు. కొంతమంది స్లీపింగ్ పిల్స్ తీసుకుని చనిపోతారు, కొంతమంది కత్తితో కోసుకుని చనిపోతారు, కొంతమంది నూతిలో దూకి, ఇంకా కొంతమంది కిరోసిన్ పోసుకుని, కొంతమంది ఉరేసుకుని చనిపోతారు. సూసైడ్ చేసుకోవడానికి కూడా చాలా మార్గాలు వున్నాయి.

స్లీపింగ్ పిల్స్ తో సూసైడ్ ఈజీగానే అనిపిస్తూ వున్నా తమ ఇంట్లో ఎవరికీ స్లీపింగ్ పిల్స్ వాడే అలవాటు లేదు. తక్కిన సూసైడ్ చేసుకునే మార్గాలు అన్నీ ఆలోచించడానికి భయంకరంగా వున్నయి. తను కొంచం ఈజీగా వుండే మార్గం వెతుక్కోవాలి.

ఆలోచిస్తూ ఉంటే ఉరేసుకుని చనిపోవడం తక్కిన వాటితో పోలిస్తే, స్లీపింగ్ పిల్స్ తరువాత కాస్త ఈజీ గా అనిపిస్తోంది. తన వంటిమీద వోణి వుంది. పైన సీలింగ్ ఫ్యాన్ వుంది. ఈ బెడ్ మీద కుర్చీ వేసుకుంటే సీలింగ్ ఫ్యాన్ అందుతుంది. అప్పుడు ఈ వోణి తో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకోవడం తేలిక. ఆలా ఉరేసుకున్న కొద్ధిసేపట్లోనే తను ఈ భరించలేని గిల్టీ ఫీలింగ్ నుంచి బయట పడగలుగుతుంది. ఇలా చనిపోవడం కూడా కొంచం బాధగానే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇదే అందుబాటులో వున్న మార్గం.

మరీ ఎక్కువగా ఆలోచించడం ఇష్టం లేక బెడ్ దిగి కిందనున్న కుర్చీ తీసి బెడ్ మీద వేసింది. తరువాత సీలింగ్ ఫ్యాన్ ని ఆఫ్ చేసింది. తన వంటిమీద నున్న వోణి తీసేసి, అది చేత్తో పట్టుకుని కుర్చీ మీద లేచి నిలబడి ఇంకా తిరుగుతూ వున్న సీలింగ్ ఫ్యాన్ నే చూస్తూ మళ్ళీ ఆలోచనలో పడింది.

'ఇది మరీ అంతా తను సూసైడ్ చేసుకోవాల్సినంత విషయమా? ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎట్లీస్ట్ తన క్లోజ్ ఫ్రెండ్ సమీరతో. నిజానికి తనకి బతకాలని వుంది, చనిపోవాలని లేదు.’

కానీ సీలింగ్ ఫ్యాన్ పూర్తిగా ఆగిపోయే సమయానికి ఆ ఆలోచనలు ఆగి పోయాయి. మళ్ళీ పాత ఆలోచనలు మొదలయ్యాయి. నో తను ఈ గిల్టీ ఫీలింగ్ ని భరించలేదు. ఎవరికీ చెప్పినా తనలో వున్న ఈ గిల్టీ ఫీలింగ్ ని మాత్రం ఎవరూ తీసేయలేరు. తను చనిపోవడం ఒక్కటి మాత్రమే తనని ఈ గిల్టీ ఫీలింగ్ నుండి రిలీవ్ చేస్తుంది.

సడన్ గా, ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా వోణి తాలూకు ఒక కొసని సీలింగ్ ఫ్యాన్ కి గట్టిగా ముడేసింది. తరువాత తను కుర్చీ తన్నేశాక, తన కాళ్ళకి బెడ్ కి కావలసినంత గ్యాప్ ఉండేలా అంచనా వేస్తూ తక్కిన రెండో కొస తన మెడ చుట్టూ బిగించుకుంది. ఇంపల్సివ్ గా చేస్తూనే వున్న చాలా జాగ్రత్తగానే చేస్తూ వుంది. వురేసుకునే సూసైడ్ అటెంప్ట్స్ కొన్ని ఫైలవుతూ ఉంటాయి. తన అటెంప్ట్ ఆలా ఫెయిలవ్వడానికి వీల్లేదు. అంతా బాగానే ఉందని కంఫర్మ్ అయ్యాక బెడ్ మీదనుంచి కుర్చీని కిందకి తన్నేసింది. శరీరం గాల్లో వేళ్ళాడుతూ ఉంటే తను మెడ చుట్టూ చుట్టుకున్న వోణి కొస బిగుసుకోవడం మొదలు పెట్టింది.

అప్పుడు మళ్ళీ ఆలోచన మొదలైంది నిరుపమలో. తను చనిపోవలసినంత విషయం లేదు. తను ఏ తప్పూ చెయ్యలేదు. ప్రయత్నిస్తే తను ఈ గిల్టీ ఫీలింగ్ నుంచి బయట పడగలదు. తను ఆ విషయాన్నీ ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి. ఇలా చనిపోకూడదు. తను పెద్ద సైకాలాజిస్ట్ కావాలి. ఇలా చనిపోకూడదు.

'ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. నేను తొందర పడ్డాను. నాకు బ్రతకాలనుంది.' గట్టిగ అరుద్దామనుకుంది. కానీ అప్పటికే గొంతు చుట్టూ నిర్దయగా బిగుసుకు పోతూ వున్న వోణికుస ఆ అవకాశం ఇవ్వలేదు. చిన్న శబ్దం కూడా నోట్లోనుండి రాలేదు.

ఇంక ఎలాగూ తను చనిపోక తప్పదన్న విషయం కంఫర్మ్ అయిపోయాక నిరుపమ లో మిగిలిన కోరిక కేవలం ఒక్కటి మాత్రమే.

తనలో అంత గిల్టీ ఫీలింగ్ కి కారణమైన ఆ విషయం, తనని ఇంత సూసైడ్ చేసుకునే వరకు తీసుకు వచ్చిన ఆ విషయం, ఎప్పటికి ఎవరికీ తెలియకూడదు. అది రహస్యంగానే ఉండిపోవాలి.

'దేవుడా ఆ విషయం ఎప్పటికి ఎవరికీ తెలియనివ్వకు. అది రహస్యం గానే ఉండిపోవాలి. ఇదే నా ఆఖరి కోరిక.' ప్రాణం పోయి శరీరం నిర్జీవం అయిపోయే ముందు దేవుణ్ణి బలంగా ప్రార్ధించింది నిరుపమ.                   

&&&

ఆ వ్యక్తికి బహుశా అరవై సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. కానీ సన్నటి శరీరంతో యాభై సంవత్సరాల వయస్సు అన్నట్టుగానే వున్నడు. “స్మరన్ అంటే మీరేనా?” అని అడిగి,  స్మరన్ ముఖంలోకి ఇంకా అలాగే చూస్తూ నిలబడి వున్నాడు.

“మీరు స్మరన్ ప్రైవేట్ డిటెక్టివ్ గురించి వచ్చి ఉంటే అది నేనే.” స్మరన్ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఎందుకో ఆయన్ని చూస్తూ ఉంటే గౌరవం కలుగుతోంది. “దయచేసి కూర్చోండి” అన్నాడు.

ఆ పెద్దాయన తలూపి స్మరన్ కుర్చీకి అపోజిట్ గా వున్న రెండు కుర్చీల్లో కుడివైపు దాంట్లో కూర్చున్నాడు. అయన కూర్చున్నాక స్మరన్ కూడా మళ్ళీ తన కుర్చీలో కూర్చున్నాడు. ఆ కుర్చీలకి మధ్యలో ఒక బల్ల వుంది. ఆ బల్ల మీద ఫ్లవర్ వేజ్, పేపర్ వెయిట్ ఇంకా కొన్ని ఫైల్స్ లాంటివి వున్నయి.

“మీరు ఏమైనా నా సర్వీసెస్ గురించి వచ్చి ఉంటే సందేహం ఏమి లేకుండా నాకు తెలియ పర్చండి. నా దగ్గరికి వచ్చే ముందు బహుశా నేను ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నీ మీరు తెలుసుకునే వుంటారు.” అయన ఏ రకమైన సర్వీస్ గురుంచి వచ్చారో గెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ అన్నాడు స్మరన్.

“డిటెక్షన్ మీ సర్వీసెస్ లో ఒకటి కదా?” ఆ పెద్దాయన అడిగాడు.

“ఇన్ ఫాక్ట్, అదే నా మెయిన్ సర్వీస్” నవ్వాడు స్మరన్ 

ఆ ముసలాయన దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు. “మీరు నా గురించి ఒక డిటెక్షన్ చేయవలసి వుంటింది. అందుకు అవసరమైన ఫీజు నేను చెల్లించుకుంటాను.”

“ఫీజు గురించి తరవాత ఆలోచించవచ్చు. కానీ ముందు నేను చెయ్యవలసిన డిటెక్షన్ గురించి నాకు తెలియపరచండి.” మొదటినుండి ఒకరకమైన విచారం ఆ ముసలాయన మోహంలో స్మరన్ చూస్తూనే వున్నాడు. ఆ అరవై ఏళ్ళ వయసులో ఆ ముసలయ్యాన్ని ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటో స్మరన్ కి అర్థం కావడం లేదు.

“నా పేరు రంగనాథ్. నేను ఒక హైస్కూల్ హెడ్మాస్టర్ని. నేను ఇదే టౌన్ లో నివసిస్తున్నాను.” ఆ పెద్దాయన కాస్సేపు ఆగాడు.

స్మరన్ ఆయన్నే గమనిస్తూ కుర్చీలో జారగిలబడ్డాడు. అడగకపోయినా రంగనాథ్ మొత్తం అంతా చెప్తాడని స్మరన్ కి బోధపడింది.

అప్పుడా పెద్దాయన తన షర్ట్ ప్యాకెట్లో చెయ్యి పెట్టి ఒక కవరు బయటకి తీసాడు. స్మరన్ ఆలా చూస్తూ ఉండగానే అందులోంచి ఒక ఫొటోగ్రాఫ్ బయటికి తీసి స్మరన్ ముందు పెట్టాడు.

“బ్యూటిఫుల్!” ఎప్పుడైతే ఆ ఫోటోని తన చేతుల్లోకి తీసుకుని అబ్సర్వ్ చెయ్యడం మొదలుపెట్టాడో స్మరన్ అనకుండా ఉండలేక పోయాడు. ఆ ఫొటోలో ఉన్నది పంజాబీ డ్రెస్సులో ఉన్న ఒక ఇరవై సంవత్సరాల వయస్సు అమ్మాయి. అప్పటి వరకు స్మరన్ దృష్టిలో తన మేనకోడలు మేనక మాత్రమే ఎంతో అందమైన అమ్మాయి. కానీ ఈ అమ్మాయిని చూసాక తన అభిప్రాయం మార్చుకోక తప్పడం లేదు. “మీ అమ్మాయా?” ఆ ఫోటోని మళ్ళీ టేబుల్ మీద పెట్టి రంగనాథ్ ముఖంలోకి చూసాడు స్మరన్.

“అవును” రంగనాథ్ తలూపాడు. “ “నా ఒక్కగానొక్క అమ్మాయి. పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టింది. తన పేరు నిరుపమ”

“ఏమిటి సమస్య?” ఆ వయస్సులో ఉన్న అమ్మాయిలతో వచ్చే సమస్యలు ఏమిటో స్మరన్ వూహించగలడు. బహుశా ఈ అమ్మాయి ఎవరో తెలియని అబ్బాయితో ప్రేమలో పడి వుంటుంది దాంతో ఈ పెద్దాయన ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటూ ఉండిఉంటాడు 

“ఆరు నెలల క్రితం తాను ఆత్మహత్య చేసుకుంది.”

“ఏమిటి?” ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టుగా అనిపించి కుర్చీలో తెలియకుండానే ముందుకు వంగాడు స్మరన్. “ ఆత్మహత్య చేసుకుందా?” ఆ అమ్మాయిని చూసింది కేవలం కొన్ని నిమిషాల కిందట మాత్రమే. అయినా స్మరన్ మనస్సంతా విచారంతో ఇంకా షాక్ తో నిండి పోయింది. తనిది ఊహించలేదు. పాపం తండ్రి అయిన ఆ పెద్దాయన మనస్సెలా వుండి ఉంటుంది?

“అవును. తను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.” ఆ పెద్దాయన తన మనసులో విచారం అంతా మోహంలో కనిపించకుండా వుండడానికి ప్రయత్నం చేస్తున్నాడని స్మరన్ కి అర్థం అయింది. “ఆరు నెలలు అవుతూంది.”

“ఎందుకు, ఎందుకని అంత పని చేసింది?” మరొకసారి ఆ ఫొటోగ్రాఫ్ ని తన చేతుల్లోకి తీసుకుని చూడడం మొదలుపెట్టాడు స్మరన్. బహుశా తను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళికి ఈ పెద్దాయన ఒప్పుకుని ఉండడు. లేదా ఇంకేదైనా సమస్య అయివుంటుందా, తన ప్రమేయం లేకుండానే స్మరన్ మనస్సు రకరకాలుగా ఆలోచిస్తూ వుంది.

“ఆ విషయం తెలుసుకుంటారనే నేను మీ దగ్గరికి వచ్చింది.” రంగనాథ్ మరొకసారి దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు

“నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీకు తెలియదా?” ఆశ్చర్యంగా చూస్తూ స్మరన్ కూడా మరోసారి కుర్చీలో వెనక్కి జరగిలబడ్డాడు.

“కొంచం కూడా తెలియదు. నాకు గాని నా భార్యకి గాని తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయం ఏ మాత్రం తెలియదు. తను మాకు ఎంతమాత్రం తెలియనివ్వలేదు. సరిగ్గా ఆరునెలల కిందట తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కి తను కట్టుకున్న వోణి తోనే ఉరేసుకుని కనిపించింది.” రంగనాథ్ కళ్ళు తెరిచి స్మరన్ కళ్ళలోకి చూసాడు. “తనకి ఏ సమస్యలు లేవు. అన్ని రకాలుగానూ వాకబు చేసి చూసాం. తనని ఎవరు ఏ రకంగానూ ఇబ్బంది పెట్ట లేదు. తను అందరితోటి సరదాగా వుండే పిల్ల.”

“ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా?”

“ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఒకవేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు వున్నా, నేను తన గురించి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలను. తను తప్ప మా కుటుంబానికి వేరే బాధ్యతలు ఏమి లేవు. హైస్కూల్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యాను. స్వంత ఇల్లు మాత్రమే కాకుండా నాకు పొలాలు, వేరే ఆస్తులు కూడా వున్నయి.”

“ఎంత దురదృష్టకరమైన విషయం! ఇంత అందమైన అమ్మాయి ఏ సమస్యలు లేకపోయినా ఆత్మహత్య చేసుకుంది.” స్మరన్ దీర్ఘంగా నిట్టూర్చాడు.

“మా అంత దురదృష్టవంతులు ఎవరూ వుండరు. మా అమ్మాయి చనిపోయిన తరువాత మా ఆవిడ  పిచ్చిది ఆయిపోయింది.” రంగనాథ్ నిస్సహాయంగా తలూపాడు. “ తను ఎవరిని ప్రేమించివున్నా,  ఎవరిని పెళ్లి చెసుకుంటానన్నా లేదా ఇంకా ఏమి చేస్తానన్నాకూడా నేను కానీ నా భార్య కానీ అభ్యంతరం చెప్పేవాళ్ళం కాదు. ఆ విషయం తనకి కూడా బాగా తెలుసు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషం ఎక్కడా  అంతుపట్టడం లేదు. తను ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం కన్నా కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తూంది.” 

“మీ బాధ నాకు అర్ధం అవుతూంది. కానీ …..” కాసేపాగాక మళ్ళీ అన్నాడు స్మరన్ “మీరు ఖచ్హితంగా చెప్పగలరా మీ అమ్మాయి ఆత్మహత్యే చేసుకుందని.”

“ఆ విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. తను రాత్రి పడుకున్నాక తన గదిలోకి ఎవరూ వెళ్ళలేదు. అసలు మా ఇంట్లోకే ఆ రాత్రి ఎవరూ పై వాళ్ళు రాలేదు.తను ఖచ్హితంగా ఆత్మహత్యే  చేసుకుంది.” రంగనాథ్ స్మరన్ మొహంలోకే చూస్తూ వున్నాడు.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)