Nuli Vechani Vennela - 19 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 19

Featured Books
Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 19

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

ఆ రోజు మల్లికా, మేనకలతో ఆఫీస్ లో తన ఛాంబర్ లో కూచుని మాట్లాడుతూ వుంది సమీర. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోడానికి సెటిల్ అయి ఒక పదినిమిషాల సమయం అయివుంటుంది. అంతలో సమీర సెల్ ఫోన్ మోగింది. ఎవరో అన్నోన్ పెర్సన్ ని సజెస్ట్ చేస్తూంది ట్రూ కాలర్

"హలో" ఫోన్ కాల్ అటెండ్ చేసి అంది సమీర.

"ఈజ్ ఇట్ సమీర, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మమూత్ ఇండస్ట్రీస్?" తను అనుకున్నట్టుగానే ఎవరిదో మగ గొంతు. ఇలాంటి ఫోన్ కాల్స్ సమీరకి కొత్త కాదు.

"ఆఫ్ కోర్స్, ఎస్." చిరాకు పడుతూ అంది.

"నా పేరు మదన్ చౌదరి. నేనొక ప్రైవేట్ డిటెక్టివ్ ని. మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలి."

కూచున్న చైర్లో స్ట్రెయిట్ గా అయిపోయింది సమీర. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ తనని కలుసుకుని మాట్లాడాలనుకోవడమేమిటి? ఆల్రెడీ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ తన గురించి వర్క్ చేస్తూ వున్నారు.

"దేని గురించి?" ఆశ్చర్యంగా అడిగింది.

అవతలనుండి నిట్టూర్చిన శబ్దం వినిపించింది. "నిజానికి నన్ను మీ నాన్నగారు అపాయింట్ చేశారు ఒక విషయం గురించి ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి. ఆ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఆయనకి సబ్మిట్ చేసేసాను కూడా."

"అది దేనికి సంబంధించిన విషయం?" ఇచ్చిన చిన్న గ్యాప్ లో ఆగలేక అడిగేసింది సమీర.

"మీ సేఫ్టీ కి సంభందించినది. మీకు ఎంతమాత్రం ఆలస్యంలేకుండా చెప్పాల్సిన విషయం. తను వెంటనే ఆ విషయం మీతో మాట్లాడతానని చెప్పారు మీ నాన్నగారు. నేను తరువాత పని మీద అబ్రాడ్ కొంతకాలం కిందట తిరిగి వచ్చాను. తిరిగి వచ్చాక మీ నాన్నగారు హార్ట్ ఎటాక్ తో చనిపోయారని తెలిసింది. ఏమైనా అంత ముఖ్యమైన విషయం చనిపోకముందు మీకు చెప్పి వుంటారో లేదో తెలుసుకుందామని ఫోన్ చేసాను."

"లేదు. నాకేం చెప్పలేదు. నాకేం చెప్పకుండానే డాడ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారు." తనకి తెలియకుండానే ఎగ్జైట్మెంట్ తో అరిచేసింది సమీర. "ప్లీజ్, అదేమిటో చెప్పండి."

"మాడం, నేను మీకు దగ్గరలోనే వున్నాను. ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ లో మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ విషయాన్నీ మీ సమక్షంలో చెప్పడమే చాలా మంచిది."

"ఒకే దెన్" ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకుంటూ అంది సమీర. "దయచేసి వేగంగా రండి. మీ గురించి వెయిట్ చేస్తూంటాను."

"ఒకే మాడం." అలా అన్నాక ఆ వ్యక్తి ఫోన్ కాల్ కట్ చేసాడు.  

"గాడ్! నాకేం చెప్పాలో తోచడం లేదు." సెల్ ఫోన్ టేబుల్ మీద పడేసి, కుర్చీలో వెనక్కి వాలి, కళ్ళు మూసుకుంది సమీర.

"ఎం జరిగింది సమీ?" సమీర మొహంలోకి ఆతృతగా చూస్తూ అడిగింది మల్లిక.

"ఎనీథింగ్ ట్రబుల్సం మాడం?" మేనక మొహంలో కూడా అలాంటి ఆత్రుతే వుంది.

తనకి ఫోన్ లో ఆ ప్రైవేట్ డిటెక్టీవ్ చెప్పిందంతా వాళ్ళిద్దరికీ చెప్పింది సమీర.

"సో, మా అంకుల్ కూడా శ్రమ ఏమీ తీసుకోనవసరం లేకుండా మీకు విషయం తెలియబోతూవుందన్న మాట." మేనక అంది. "మనం ఒక్క పావుగంట ఓపిక పడితే చాలు."

"ఇది సంతోషించాల్సిన విషయమేగా సమీ. నీ ఎక్సప్రెషన్ చూసి ఎదో కొంప ములిగి వుంటుందనుకున్నాను" మల్లిక అంది.

"నాకు చాలా ఎగ్జైటింగ్ గా వుంది.  ఆ ప్రైవేట్ డిటెక్టీవ్ ఆ విషయం డాడ్ కి చెప్పేశాడట. అది తెలుసుకున్న తరువాతే డాడ్ కంగారు పడడం మొదలుపెట్టి వుంటారు." కాస్త ఆగింది సమీర.

మేనక, మల్లిక మొహామొహాలు చూసుకున్నారు.

"అది నాకు డాడ్ వెంటనే చెప్తాను అన్నారుట. తరువాత ఈ డిటెక్టీవ్ ఫారిన్ వెళ్లి నిన్ననే తిరిగి వచ్చాట్ట. అలా వచ్చాక డాడ్ చనిపోయిన విషయం తెలిసిందిట. నాకు అంత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం నాకు చెప్పేరో లేదో కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేసాడు. నాకు చెప్పలేదని, నాకు చెప్పకుండానే హార్ట్ ఎటాక్ తో చనిపోయారని చెప్పాను."

"అదేమిటో ఫోన్లోనే చెప్పమని నువ్వు అడిగితే పది నిమిషాల్లో ఇక్కడకి వచ్చి నీ సమక్షంలోనే అంతా చెప్తాను అన్నాడు." సమీర చెప్పింది గుర్తు చేసుకుంటూ అంది మల్లిక. "రిలాక్స్ సమీ. మనకి అతి త్వరలో విషయం తెలియబోతూ వుంది. మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటాం. నువ్విందులో కంగారు పడాల్సినదేమీ లేదు."

"ఎస్, మాడం. మీరు ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తే చాలు. మనకి అంతా తెలిసిపోతుంది. మీ ప్రాణాలకి ఏ ముప్పూ లేకుండా చెయ్యొచ్చు. మీరు గాభరా పడకండి." మేనక అంది.

దానికి సమీర ఎదో అనబోతూ వుండగా తన ఫోన్ మళ్ళీ మోగింది. "మళ్ళీ అతనే." ఫోన్ చేతిలోకి తీసుకుని స్క్రీన్ వైపు చూస్తూ అన్నాక, ఆ ఫోన్ కాల్ అటెండ్ చేసింది సమీర. "మీ గురించే వెయిట్ చేస్తూ వున్నాం. మీరింకా రాలేదేమిటి?"

"ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసుకోవచ్చా?" ఈ సారి ఇంకొక గొంతు.

"నా పేరు సమీర. మమూత్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ని." చిరాకు, ఆశ్చర్యం సమపాళ్లలో వున్నాయి సమీరలో. "ఇంతకుముందు ఈ నెంబర్ నుండి నాతొ ఒక ప్రైవేట్ డిటెక్టీవ్ మాట్లాడారు. అతని ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరెవరు?"

"సారీ మాడం. నేనిక్కడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ని. మీతో మాట్లాడిన ఆ వ్యక్తి బైక్ మీద వెళుతుండగా ఎవరో కార్ తో రాష్ గా డ్రైవ్ చేస్తూ గుద్ది వెళ్లిపోయారు. ఇతను స్పాట్ లోనే చనిపోయాడు. ఇతను ఫోన్ లో ఆఖరు సారి మాట్లాడిన వ్యక్తికి కాల్ చేస్తే మీరు లైన్ లోకి వచ్చారు."   

పెద్దగా అరుస్తూ కుర్చీలోనుండి లేచి నిలబడింది సమీర, ఫోన్ తన చేతిలోనుండి జారి కిందపడిపోయిన విషయం పట్టించుకోకుండా. తను కూడా పక్కకి పడిపోబోతూ వుంటే మేనక, మల్లిక వెళ్లి పడిపోకుండా బాలన్స్ చేశారు.

&&&

"మదన్ చౌదరి ఒక చిన్న ప్రైవేట్ డిటెక్టీవ్ కానీ కాపబుల్. మీ డాడ్ కి ఏ రకంగానో బాగా పరిచయం వుండివుంటాడు అందుకనే ఆ విషయం లో ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి తనని అపాయింట్ చేశారు." స్మరన్ అన్నాడు

ఆ సమయంలో సమీర ఛాంబర్ లో డిటెక్టీవ్ స్మరన్, సమీర, మల్లిక, అనురాగ్ ఇంకా మేనక వున్నారు.

"తనని కచ్చితంగా ఎదో వెహికల్ తో గుద్దించి చంపించారు. వాళ్లకెంత మాత్రం ఆ విషయం నీకు తెలియడం ఇష్టం లేదు." మల్లిక అంది.

"నాకు ఆ విషయం గురించి చిన్న హింట్ ఇచ్చినా చాలా బాగుండేది. డాడ్ చేసిన పొరపాటే అతనూ చేసాడు. నా సమక్షం లోనే అంతా చెప్దామనుకుని చెప్పకుండానే చనిపోయాడు." నిట్టూరుస్తూ అంది సమీర.

"వాడిని ఎవడైతే గుద్ది చంపాడో వాడు పోలీసులకి ఈ పాటికి దొరికే ఉంటాడు. వాడి ద్వారా ఎవరు ఆ ప్రైవేట్ డిటెక్టీవ్ ని చంపమని వాడిని ఎంగేజ్ చేశారో మనకి తెలుస్తుంది. మొత్తం గుట్టంతా విడుతుంది." మల్లిక అంది.

"ఒక దొంగిలించిన కారుతో ఆ ప్రైవేట్ డిటెక్టీవ్ ని గుద్ది చంపారు. కొంత దూరం వెళ్ళాక ఆ కారుని వదిలి గుద్ది చంపిన వాడు పారిపోయాడు. కాబట్టి వాడిద్వారా మీకు అపకారం చేద్దామనుకుంటున్నవాళ్ళ గురించి తెలుసుకోవడం అవ్వదు.” స్మరణ్ అన్నాడు. మళ్ళీ ఎవరో ఎదో ఒకటి అనేలోగానే స్మరణ్ అన్నాడు. "మీకు ఇచ్చిన గడువు లోగానే వాళ్లెవరో తెలుసుకుని మీకు చెప్పే పూచి నాది. మీకు ఏ విషయం లోనూ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తాను. కాకపోతే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి." అని ఆగాడు.

"ఏమిటది?" భృకుటి ముడేసింది సమీర.

"ప్రస్తుత పరిస్థితులు చూస్తూ వుంటే, మీ శత్రువులు మీ అడ్డు తొలగించుకోవడానికి ఎంతగా చూస్తున్నారన్నది బోధపడుతూ వుంది. ఒక వ్యక్తిని చంపడానికి కూడా వాళ్ళెక్కడా వెనుకాడ లేదు. నేను అన్ని విషయాలు మీకు తేటతెల్లం చేసి, మీకు ఏ సమస్య లేకుండా చేసేవరకూ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి."

అది వినగానే సమీర మనసు ఇంకా భయం తో నిండిపోయింది. ఏం మాట్లాడాలో కూడా ఏం తోచడం లేదన్నట్టుగా మౌనంగా వుండిపోయింది.

"తను జాగ్రత్తగానే వుంటుంది. తను కూడా నేనెప్పుడూ వుండి తనకి ఏ ప్రమాదం లేకుండా చూసుకుంటాను." తననింకా భయపెట్టొద్దన్నట్టుగా అంది మల్లిక.

"సరే అయితే." చిరునవ్వు నవ్వాడు స్మరన్. "ఇప్పుడు మీరొక విషయానికి అంగీకరించాలి. మీ అసైన్మెంట్ పూర్తి చేయడానికి ఇది చాలా అవసరం."

"అదేమిటో చెప్పండి." అనీజీ గా ఫీలవుతూ అంది సమీర.

"మీ హల్యూసీనేషన్స్ గురించి విన్నాక మిమ్మల్ని హిప్నోటైజ్ చేసి ప్రోగ్రాం చేశారనిపిస్తూంది. కాబట్టి మిమ్మల్ని డి-హిప్నోటైజ్ చెయ్యాల్సి వుంటుంది. అంతకన్నా ముందు డీప్ హిప్నోసిస్ లో మిమ్మల్ని ఆలా ప్రోగ్రాం చేసిన వాళ్లెవరో తెలుసుకోవాల్సి వుంటుంది." స్మరణ్ అన్నాడు.

"నేనేం చిన్నపిల్లని, అమాయకురాలిని కాదు నన్నెవరన్నా హిప్నోసిస్ లోకి పంపి ప్రోగ్రాం చేసేడానికి" చిరాకుపడుతూ అంది సమీర.

"చాలా తెలివైన వాళ్ళని కూడా హిప్నోసిస్ లోకి పంపి ప్రోగ్రామింగ్ చెయ్యగల సమర్థులు వున్నారు." స్మరణ్ నవ్వాడు. "కానీ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వాల్సిందే. నా కండిషన్స్ అన్నిటిని ఒప్పుకుంటానని మాట ఇచ్చారు మీరు."

"అటువంటిదే అవసరమైతే నా ఫ్రెండ్ ఇంకా సైకాలజిస్ట్ మల్లిక వుంది. మీరేం శ్రమ తీసుకోనవసరం లేదు." చాలా చిరాగ్గా వుంది సమీరకి.

"ఇక్కడ మీ ప్రాబ్లమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నది నేను, మీ ఫ్రెండ్ మల్లిక కాదు. కాబట్టి అది నేనే చెయ్యాలి మీ ఫ్రెండ్ కాదు." ధృడంగా వుంది స్మరణ్ స్వరం.

"నువ్వందుకు ఒప్పుకో సమీ. అందులో నాకు నష్టం ఏమీ కనిపించడం లేదు." సమీర ఎదో అనబోతూండగా అంది మల్లిక. "నేనూ స్మరణ్ గారి గురించి చాలా విన్నాను. తను చాలా కాపబుల్. అవసరం లేకుండా ఏదీ చెప్పరు."

"అయితే ఆ సమయంలో నాతో పాటుగా తనుకూడా ఉంటుంది." సమీర అంది.

"నో. నేను హైప్నోటైజ్ చేసేప్పుడు వేరే ఎవర్నీ అనుమతించను. ఆ సమయంలో మీరు నేను తప్ప ఇంక ఎవ్వరూ వుండరు." స్మరణ్ వాయిస్ అదే ధృడత్వంతో వుంది.

సమీర ఎదో అనబోతూ వుండగా మళ్ళీ మల్లికే అంది. "తనిచ్చిన సమయంలో అసైన్మెంట్ పూర్తి చేస్తానని మాట ఇస్తున్నారు. అందుకు తను చాలా కాన్ఫిడెంట్ గా కూడా వున్నారు. మనం ఆయన చెప్పినదానికి చెప్పినట్టుగా అంగీకరించడమే మంచిది."

"ఒకే, అలాగే." ఇంక చేసేదేం లేదన్నట్టుగా తలూపింది సమీర. "నేను ఎప్పుడు ఎక్కడకి రావాలో చెప్పండి, అప్పుడు అక్కడికి నేను వస్తాను. మీరు నాకు హిప్నోటిజమ్ తో చేసే పని పూర్తి చెయ్యొచ్చు." 

"ఒక రెండు రోజుల్లోనే అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతాయి. అన్నట్లు, నేను మీకో అసైన్మెంట్ ఇచ్చాను, అదెంత వరకూ వచ్చింది?" స్మరణ్ సడన్గా అడిగాడు.

"ఏమిటది?" భృకుటి ముడేసింది సమీర. నిజంగానే సమీర స్మరణ్ ఏం అసైన్మెంట్ ఇచ్చాడో మర్చిపోయింది.

"అదే మీ డాడ్ మీకు ఏ విషయం చెప్తే మీరు అసలు నమ్మలేరో ఆ విషయాల లిస్ట్ ఒకటి తయారు చెయ్యమన్నాను కదా. ఏమైనా చేశారా?"

"నో సర్, మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పే వరకూ ఆ విషయమే గుర్తులేదు." నవ్వింది సమీర.

"అయితే ఇప్పటినుండి ప్రయత్నించండి." స్మరణ్ అన్నాడు

"మీరు తనని ఎందుకు అలాంటి లిస్ట్ ప్రిపేర్ చెయ్యమంటున్నారో తెలుసుకోవచ్చా?" మల్లిక అడిగింది.

"నా ఇన్వెస్టిగేషన్ పూర్తయి నేను రిజల్ట్ డిక్లేర్ చేసే రోజున ఎందుకు ఆలా చెయ్యమన్నానో చెప్తాను." స్మరణ్ నవ్వాడు.

"ఆల్రైట్. అయితే మనమందరం ఆ రోజు కోసం ఓపిగ్గా ఎదురు చూద్దాం. ఎంతో దూరంలో అయితే లేదుకదా." అనురాగ్ అన్నాడు.

"మరి నేను వెళ్లి వస్తాను. నేను చెప్పింది గుర్తు ఉంచుకోండి."

"సర్............" స్మరణ్ ఎంట్రన్స్ దాటి బయటకి వెళ్ళిపోబోతూన్న సమయంలో అనురాగ్ కుర్చీలోనుండి లేచినిలబడి అన్నాడు.

"చెప్పండి" వెనక్కి తిరిగి అనురాగ్ మొహంలోకి చూస్తూ అడిగాడు స్మరన్.

"వాళ్ళెవరైనా కానీ వాళ్ళగురించిన వివరాలు సమీరకి తెలియకూడదని ఒక డిటెక్టీవ్ ప్రాణాలు తీసేసారు. మీరూ అది సమీరకి తెలియచెప్పాలనే ప్రయత్నిస్తూ వున్నారు. వాళ్ళు మీకూ కచ్చితంగా అపాయం తలపెట్టాలని చూస్తారు. కొంచెం జాగ్రత్తగా వుండండి."

"యు ఆర్ అబ్సోల్యూటెలీ రైట్ మిస్టర్ అనురాగ్. కానీ నేను నా జాగ్రత్తలో వుంటాను. మీరు అనవసరంగా కంగారు పడకండి." అలా అన్న తరువాత స్మరణ్ అక్కడనుండి వెళ్ళిపోయాడు.

"కానీ వాళ్లెవరు అన్నది ఎంత తల బద్దలు కొట్టుకుంటున్నా తెలియడం లేదు." మల్లిక అంది.

హుస్సురని నిట్టూర్చి, కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సమీర.

"జస్ట్ ట్రస్ట్ మై అంకుల్. తనిచ్చిన టైం పీరియడ్ లో కచ్చితంగా ఈ అసైన్మెంట్ పూర్తి చేస్తారు. వాళ్లెవరో కనుక్కోవడమే కాదు, సమీర మాడం ప్రాణాలకి కూడా ఏ ప్రమాదం లేకుండా చూస్తారు." దృఢస్వరం తో అంది మేనక.

కళ్ళు తెరిచి, మేనక మొహంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వింది సమీర. ఎందుకో ఆమె మాటలమీద పూర్తి నమ్మకం కలిగింది.

&&&

"ఏమిటీ ఎదో వర్క్ లో పడినట్లున్నావు?" సోఫా లో కూచుని నోట్ బుక్ లో ఎదో రాయడానికి ట్రై చేస్తూవున్న సమీర పక్కన కూచుని అడిగింది మల్లిక.                        

"ఆ డిటెక్టీవ్ నేను మా డాడ్ చెప్పినా నమ్మలేని విషయాలు ఏముంటాయో అలోచించి రాయమన్నాడు కదా ఆ ప్రయత్నంలోనే వున్నాను." సమీర అంది.

"ఎమన్నా రాశావా?" నోట్ బుక్ లోకి చూస్తూ అడిగింది మల్లిక.

"చూస్తున్నావుగా బ్లాంక్ పేజ్, ఒక్కటి కూడా రాయలేకపోయాను ఇంకా." చిరాగ్గా అంది సమీర. "నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేస్తే బావుంటుంది."

"నో, అది నీకిచ్చిన ఎక్సరసైజ్. నువ్వే చేయాలి." మల్లిక అంది. "జస్ట్ ట్రై చెయ్యి, అసలేమన్నారాయగలవో లేదో."

"ఒకే" కళ్ళు మూసుకుని ఆలోచనలో పడింది సమీర. "నాకు అందం అంటే పిచ్చి. నాకు చాలా మంది అందమైన ఆడవాళ్ళతోటి సంబంధాలు వున్నాయి."

"ఓహ్, గాడ్! నువ్వు లెస్బియన్ వా? నేను కనిపెట్టనే లేకపోయాను." మోహంలో ఆశ్చర్యాన్ని అభినయిస్తూ అంది మల్లిక.

"అలాని మా డాడ్ నాతో చెప్తే నేను నమ్మను కదా." చిరాగ్గా అంది సమీర.

"అది నిజమే. ఆ సెంటెన్స్ రాయి."

ఆ సెంటెన్స్ నోట్ బుక్ లో రాయడం పూర్తయ్యాక మల్లిక మొహంలోకి మళ్ళీ చూసింది సమీర. "నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు. నువ్వంటే నాకు అభిమానమే లేదు."

"అలాని మీ డాడ్ అన్నా కూడా నువ్వు నమ్మవు. ఈ సెంటెన్స్ కూడా నువ్వు రాయొచ్చు."

ఆ సెంటెన్స్ కూడా నోట్బుక్ లో రాసాక మళ్ళీ మల్లిక మొహంలోకి చూసింది సమీర. "నీ మామ్ నన్నెప్పుడూ ప్రేమించలేదు. కేవలం డబ్బు కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంది." ఎదో బాధతో నిండి పోయింది సమీర ఆ మాట అంటూవున్నప్పుడు.

"కలలో కూడా ఇది నువ్వు నమ్మవు సమీరా."

ఈ సారి మల్లిక చెప్పకుండానే ఆ సెంటెన్స్ నోట్ బుక్ లో రాసింది సమీర. మరో సెంటెన్స్ కూడా రాసాక మల్లిక మొహంలోకి చూసి అంది.

"ఆ ప్రమీలకి నాకు శారీరక సంబంధం వుంది. లోకానికి భయపడే నేను తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. నా వల్లే తను ఆత్మహత్య చేసుకుంది."

"రైట్. ఇది నువ్వేకాదు ఎవరూ నమ్మరు."

"నీ మమ్మీ కి నాకన్నా ముందు ఒక లవ్ ఎఫైర్ ఉండేది. అది దాచిపెట్టి నన్ను పెళ్లిచేసుకుంది." అది అంటూ వున్నప్పుడు సమీర గొంతు వణికి కళ్ళవెంట నీళ్లు కారడం మొదలుపెట్టాయి..

సమీర చేతిలోని పుస్తకాన్ని లాక్కుని పక్కన పడేసింది మల్లిక. "చేసిన ఎక్సరసైజ్ చాలు, ఇంకా ఆపు. ఇన్వెస్టిగేషన్ చేసి విషయాన్ని కనిపెట్టడానికే కదా ఆ డిటెక్టీవ్ ని అపాయింట్ చేసింది. నిన్ను బాధపెట్టే ఇలాంటి ఆలోచనలు నువ్వు చెయ్యవలసిన అవసరం లేదు." కోపంగా అంది.

"ఎం జరుగుతోంది? ఎందుకు మల్లిక మాడం కోపంగా వున్నారు?" అప్పుడు అక్కడికి వచ్చిన మేనక అడిగింది.

"మీ అంకుల్ చెప్పిన ఎక్సరసైజ్ నా ఫ్రెండ్ ని కళ్లనీళ్లు పెట్టుకునేలా చేసింది." జరిగిన విషయం చెప్పింది మల్లిక ఇంకా కోపంగానే.

"ఒకే మాడం. మీకు ఇబ్బందిగా ఉంటే మీరు ఆ ఎక్సరసైజ్ చెయ్యకండి." సమీర మొహంలోకి చూస్తూ అంది మేనక.

గట్టిగా నిట్టూర్చి, సోఫాలోనుండి లేచి అక్కడనుండి వెళ్ళిపోయింది సమీర

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)