Nuli Vechani Vennela - 11 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 11

Featured Books
Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 11

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"అంకుల్ పోయాక నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావని మాకందరికి తెలుసు. కానీ అంకుల్ లాగే నువ్వూ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. ఆ కారణానికి ఇంత వీక్ అయ్యి, మేడ మీదనుండి దూకే ప్రయత్నం చేస్తావని నేను అనుకోను. అసలు ఏం జరుగుతోంది? మాకు తెలియనివ్వు." సంజయ్ తీవ్రంగా అడిగాడు.

"సమీర ఏమనుకున్నా, ఇప్పుడు అన్నివిషయాలు మీకు తెలియడం మంచిదనే నేను అభిప్రాయం పడుతున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేను వుండగా తనకి ఏ ప్రమాదం జరగనివ్వను." మల్లిక స్వరం ధృడంగా వుంది.

"మనమెవ్వరం సమీరకి ప్రమాదం రానివ్వం. ఆ విషయం నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కానీ అసలు విషయం ఏమిటో ముందు చెప్పు." సంజయ్ చిరాగ్గా అడిగాడు.

ఆ తరువాత సమీర గదిలో, మల్లిక అన్నివిషయాలూ వివరించి చెప్తూవుంటే, భయంకనిపించింది నిర్మల ఇంకా సంజయ్ మొహాల్లో.

&&&

"ఇంత జరుగుతూ వుంటే నీకు ఒక్కసారి కూడా ఈ విషయాలేమీ మాకు చెప్పాలని అనిపించలేదా సమీ?" అంత కోపం సంజయ్ లో ఎప్పుడూ చూడలేదు సమీర.

"నేను డాడ్ డెత్ తో చాలా డిస్టర్బ్ అయి, అలాంటి హల్యూసీనేషన్స్ కి సబ్జెక్ట్ అయ్యాను. అంతకన్నా ఇందులో ఏమీ లేదు." అనీజీ గా అంది సమీర.

"అని ఈ గ్రేట్ సైకాలజిస్ట్ చెప్పింది. అది నమ్మి నువ్వూరుకున్నావు." సంజయ్ మల్లిక మొహంలోకి కోపంగా చూస్తూ అన్నాడు.

"మరి నీ అభిప్రాయంలో ఇంకేమిటి?" మల్లిక కూడా కోప్పడిపోయింది.

"ఒక్క విషయం గ్రహించావా? ఈ రోజు తను మేడ మీదనుండి దూకి చనిపోబోయింది. అలా ఇకపైన కూడా చెయ్యదని గ్యారంటీ ఏమిటి?"

"అది నాకూ చాలా డిస్టర్బింగ్ గానే వుంది. ఎందుకలా చేసిందో ప్రోబ్ చేస్తాను. ఇకపైన అలా చెయ్యకుండా హిప్నోటైజ్ చేసి ప్రోగ్రామ్ చేస్తాను." మల్లిక సాలోచనగా అంది.

"నో మల్లికా. అందువల్ల ప్రయోజనం వుంటుందని అనిపించడం లేదు. కేవలం సమీర ఏవో హల్యూసీనేషన్స్ కి సబ్జెక్ట్ కావడం వల్లే అలా ట్రై చేసి వుంటుందని నాకు అనిపించడం లేదు." సంజయ్ కూడా ఎదో ఆలోచనలో వున్నాడు.

"నువ్వేమిటి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. సమీర వెనకాతల నిజంగానే ఏ దెయ్యమో, భూతమో పడింది. లేకపోతె తనకెవరో చేతబడి చేశారు, అంతేనా?" హేళనగా అడిగింది మల్లిక.

"సమీ నువ్వొక విషయం చెప్పు. నువ్వు నిజంగానే ఒక ఆడ మనిషి నవ్వు, ఏడుపు, అరుపులు వింటూ వస్తున్నావా?" సంజయ్ ఎదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూండగా అంతవరకూ అంతా మౌనంగా వింటూవున్న నిర్మల సడన్గా అడిగింది..

"నేనా విషయం లో అబద్దం ఎందుకు చెప్తాను ఆంటీ? నేను తరచూ ఒకావిడ నవ్వులు, ఏడుపు ఇంకా ఎదో అంటూ వుండడం వింటూ వున్నాను. ఈ రోజు కూడా ఆ ఆడమనిషిని ఫాలో అవుతూనే మీద మీదకి వెళ్ళాను. కాకపోతే మల్లిక చెప్పినట్టుగా అవి నా హల్యూసీనేషన్స్ తప్ప మరేం కాదు." చిరాగ్గా అంది సమీర.

"ఈ రోజు నువ్వు మేడ మీద వెళ్ళడానికి అదే ఆడ మనిషి కారణమా? నువ్వు ఆవిడని ఫాలో అవుతూనే మేడ మీదకి వెళ్ళావా?" సమీర చిరాకుని గమనించనట్టుగా అడిగింది నిర్మల.

"ఎస్ ఆంటీ. తను నన్ను, డాడ్ ని ఏదేదో చేస్తానని, టార్చర్ పెడతానని చెపుతూంది. నన్నేం చేస్తానన్నా తట్టుకోగలను కానీ, డాడ్ ని కూడా టార్చర్ పెడతాననడం తట్టుకో లేకపోయాను. ఆవిడ వెనకే వెళ్ళాను. కానీ ఆ క్రమంలో మేడ మీద నుండి దూకేబోయానని నాకు తెలియదు." మరోసారి భయంతో నిండిపోయింది సమీర మొహం.

 “అంకుల్ని టార్చర్ చేయడం ఏమిటి? ఆయన ఇప్పుడు లేరు కదా ” ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్

“చనిపోయిన తరువాత కూడా అది ఆయన్ని హింస పెడుతున్నానని చెప్పింది. ఇకపైన కూడా అలాగే చేస్తానని చెప్పింది ఆ రాక్షసి” కోపంగా అంది సమీర

సంజయ్ ఏదో అనబోతూ వుండగా అంది మల్లిక. “తనలా ఇమాజిన్ చేసుకుంది. ఇది అంతకన్నా ఏమీ కాదు. నువ్వు వదిలేయ్”

దానికి సంజయ్ కోపంగా ఎదో అనబోతూ వుండగా నిర్మల అంది.               

"నువ్వు ఆ ఆడమనిషి మొహం ఏమన్నా చూసావా? ఎలా వుంటుందో చెప్పగలవా?"

"నో ఆంటీ…………......" కొంచం ఆలోచించిన తరువాత సమీర అంది. "……….......నాకావిడ మొహం గుర్తుకు రావడం లేదు. కేవలం ఆడమనిషి అని మాత్రమే గుర్తు వుంది."

"కలలో విషయాలు ఎప్పుడూ పర్ఫెక్ట్ గా గుర్తువుండవు. అవన్నీ గుర్తు చేసుకోవడానికి నువ్వు ప్రెజర్ పడకు." మల్లిక అంది.

"ఎనీహౌ మామ్, నువ్వా విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నావు?" సంజయ్ అడిగాడు.

సంజయ్ అలా అడగ్గానే సమీర, మల్లిక కూడా ఆసక్తిగా చూసారు నిర్మల వైపు.

"ఈ విషయం చెప్పాలా, వద్దా అని ఆలోచిస్తున్నాను. చెప్తే సమీరని మరింత భయపెట్టినదానిని అవుతానేమోననిపిస్తూంది. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం అని, చెప్పే తీరాలని కూడా అనిపిస్తోంది." ముడతలు పడ్డ మొహంతో సంకోచంగా అంది నిర్మల.

"ప్రతి చిన్న విషయానికి భయపడేంత చిన్నపిల్లని కాదు. నేను పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ అని సంజయ్ చెప్పాడు కదా. అదేమిటో చెప్పండి ఆంటీ?" సమీర అడిగింది. అడిగింది కానీ ఏం వినాల్సివస్తుందోనని ఇంకా భయంతో నిండిపోయింది సమీర హృదయం.

"సమీరకి తోడుగా నేనున్నాను. తనకి ఏ విషయంలోనూ భయం అక్కరలేదు. మీరు చెప్పే విషయం ఏదైనా సొల్యూషన్ కూడా ఇవ్వొచ్చు. అదేమిటో చెప్పండి?" మల్లిక కూడా అడిగింది.

గట్టిగా నిట్టూర్చి తను కూర్చున్న కుర్చీలో ముందుకు వంగింది నిర్మల. బెడ్ ఎడ్జ్ మీద కూచున్న తక్కిన ముగ్గురూ ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకుని, నిర్మల మొహంలోకి చూసారు.

"ఇది చాలా సంవత్సరాల కిందటి విషయం. సమీర మామ్ చనిపోయి ఒక సంవత్సరం అయివుంటుంది. ఆ సమయంలో సమీర డాడ్ దగ్గర ఒక సెక్రటరీ జాయిన్ అయింది. తన పేరు ప్రమీల, ఇంకా తానొక డివోర్సీ. సమీర మామ్ అంత కాకపోయినా తనూ చాలా అందంగానే ఉండేది. తను వర్క్ లో చాలా పర్ఫెక్ట్ అని సమీర డాడ్ నా దగ్గర తరచూ చెప్పేవారు." కాస్త ఆగింది నిర్మల.

"సస్పెన్స్ మైంటైన్ చెయ్యొద్దు. ప్లీజ్ చెప్పండి ఆంటీ?" అసహనంగా అడిగింది సమీర.

తలూపి మళ్ళీ మొదలుపెట్టింది నిర్మల. "ఇప్పుడు అనురాగ్ వుంటున్నఇల్లే ఆవిడకీ ఇచ్చారు. ఒక్కర్తీ అందులో వుంటూండేది. ఒకటి రెండు సందర్భాల్లో మనింటికి కూడా వచ్చింది. నిజానికి నేను తను చాలా సార్లు తను, మీ డాడ్ పెళ్లి చేసుకుంటే బావుండుననుకున్నాను. అదే విషయం నేను మీ డాడ్ కి ఒకసారి సజెస్ట్ చేసాను కూడా."  కొచం ఆగి ఇంకెవరైనా ప్రాంప్ట్ చేసేలోగానే మళ్ళీ మొదలుపెట్టింది నిర్మల.

"కానీ తన మనసులో కేవలం సమీ మామ్ మాత్రమే వుంది. ఇంకెవరినీ తన జీవితంలోకి ఆహ్వానించే ప్రశ్న లేదని తేల్చి చెప్పేసారు తను. ఆ తరువాత ఇంకెప్పుడూ అలాంటి ప్రస్తావన తన దగ్గర నేను తీసుకు రాలేదు. అలా కొంతకాలం గడిచింది." మళ్ళీ ఆగి, మొదలు పెట్టింది నిర్మల.

"ఆఫీస్ లో విషయాలు నాతొ పెద్దగా చర్చించే వారు కాదు మీ డాడ్. నేను కచ్చితంగా చెప్పగలను, మీ డాడ్ కి సంభందించినంతవరకూ ఆ ప్రమీల కేవలం తనకి ఒక సెక్రెటరీ మాత్రమే. తను మీ డాడ్ గురించి ఏమనుకునేదో నాకు తెలియదు. అంతా ప్రశాంతంగానే గడుస్తూందనుకుంటూండగా మమ్మల్ని షాక్ కి గురిచేస్తూ ఒక సంఘటన జరిగింది." మళ్ళీ ఆగింది నిర్మల.

"ప్లీజ్ ఆంటీ. మమ్మల్ని  మీరు ఇలా సస్పెన్స్ తో చంపకుండా వుండడానికి, మేమేం చెయ్యాలి?" ఈసారి మల్లిక కోపంగా అడిగింది.

"తను అదే ఫ్లాట్ లో, హెవీ డోస్ లో స్లీపింగ్ పిల్స్ తీసుకుని, సూసైడ్ చేసుకుని చనిపోయింది." నిర్మల చెప్పింది.

"మై గాడ్! నిజంగానా?" సమీర గొంతు చిన్నగా వణికింది.

"తనకేవో వేరే సమస్యలు వుండి వుంటాయి. అందుకనే అలా సూసైడ్ చేసుకుంది. ఇందులో అంతగా ఆశ్చర్యపడడానికి ఏముంది? ప్రతిరోజూ ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోవడం లేదు?" మల్లిక చిరాగ్గా అంది.

"కానీ అప్పట్లో నేను కొన్ని విషయాలు వినేదాన్ని. తను మీ డాడ్ ని పెళ్లి చేసుకోమని వేధించేదట. ఆ బాధ పడలేక మీ డాడ్ తనని ఆఫీస్ నుండి పంపించేద్దామని కూడా అనుకున్నారట. ఇంకా కొంతమంది అభిప్రాయంలో, తను ఆ డిజప్పోయింట్మెంట్ తట్టుకోలేకే సూసైడ్ చేసుకుంది."

"అయితే అయి ఉండొచ్చు. అందులో అంకుల్ తప్పేముందసలు? తన మనసంతా సమీ మామ్ తో నిండివున్నప్పుడు వేరే ఎవర్నైనా ఎలా పెళ్లి చేసుకుంటారు? ఈ విషయంలో మనం ఆలోచించడానికి, ఆందోళన పడడానికి ఏముంది?" మల్లిక ఇంకా చిరాగ్గా అంది.

"నాకెందుకో సమీని ఇలా బాధ పెడుతూన్న ఆడమనిషి ఆ ప్రమీలే అయివుండొచ్చు అనిపిస్తూంది. సమీ డాడ్ కి ఆ అభిప్రాయం లేకపోయినా, ఆవిడ తన మీద ఆశెలు పెంచుకుంది. తను తనని పెళ్లిచేసుకోవడం కుదరదని చెప్పేసరికి, డిజప్పోయింట్ అయిపోయి సూసైడ్ చేసుకుంది. తను సమీ డాడ్ మీద కోపం పెంచుకుని ఇలా చేస్తూ ఉండొచ్చు కదా. సమీ ని ఇబ్బంది పెడితేనే కదా, సమీ డాడ్ ఎక్కువగా బాధపడేది." ఆందోళన నిండిపోయిన మొహంతో అంది నిర్మల.

"వన్ థింగ్ ఆంటీ. ఆవిడ ఒక దయ్యంలా మారి సమీరని సాధిస్తోందనడానికి, దయ్యాలు, భూతాలు అనేవి లేవు. సో దట్ కొశ్చిన్ డజ్ నాట్ అరైజ్. పోనీ, ఒకవేళ దయ్యాలు, భూతాలు వున్నాయనే అనుకున్నా ఆవిడ చనిపోయింది ఎప్పుడో ఇరవై సంవత్సరాల కిందట. సడన్గా ఇప్పుడెందుకు సమీని, తన డాడ్ ని సాధిస్తూన్నట్టు?" మల్లిక తీవ్రంగా అడిగింది.

"నేనా ప్రశ్నకి సమాధానం చెప్పలేనమ్మా. అంత లాజిక్ తో నేనాలోచించలేను. కానీ ఒక్క ఆవిడకి తప్ప ఇంకెవరికి సమీ మీద, తన తండ్రి మీద పగబట్టాల్సిన అవసరం వుంది? సమీ ప్రొటెక్షన్ విషయానికి వచ్చేసరికి ఏ విషయం ఉపేక్షించడం మంచిది కాదు, అది చివరికి నువ్వు నమ్మలేని దయ్యాలు, భూతాలూ అయినా సరే." నిర్మల అంది.

"నో ఆంటీ. మీరెన్ని చెప్పినా నేనలాంటి దయ్యాలు, భూతాలు లాంటి పారానార్మల్ విషయాల్ని మాత్రం నమ్మలేను. ఇంకా సమీ ప్రొటెక్షన్ విషయం అంటారా......" సడన్గా సమీర మొహంలోకి చూస్తూ దృఢస్వరంతో అంది మల్లిక"...........నేను నీడలా తనవెంట వుంటూ తనకి ఏ ప్రమాదం రానివ్వను."

"నువ్వలా నన్ను కాపాడే ప్రయత్నం చేస్తావని నాకు తెలుసు. కానీ ఆంటీ చెప్పినా దాని గురించి కూడా ఆలోచించాలని నాకు అనిపిస్తోంది. అవతల ఆఫీస్ లో నీరజ అలా అంది. ఇక్కడ ఆంటీ ఇలాంటి విషయం చెప్పారు. నాకు ఇలాంటి అనుభవాలన్నీ కలుగుతూ వున్నాయి. స్పిరిట్స్ వున్నాయేమోననే నాకూ అనిపిస్తోంది." సమీర అంది.

"మై గాడ్! సమీ, ఏవైపోతున్నావు నువ్వు? నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ లేడీ అని ఒక మూడు లక్షల కోట్ల టర్నోవర్ వున్న కంపెనీ కి మేనేజింగ్ డైరెక్టర్ వి అని మర్చిపోయావా? ఒక సామాన్యమైన ఆడపిల్లలా దయ్యాలు, భూతాలు ని నమ్ముతావా? త్వరలోనే నిన్ను హిప్నోటైజ్ చేసి, నీ అబ్నొర్మల్ బిహేవియర్ కి కారణం తెలుసుకుని, నిన్ను హండ్రెడ్ పెర్సెంట్ క్యూర్ చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఇలా పారానార్మల్ ని నమ్మడం లాంటి వీక్నెస్ కి చోటు ఇవ్వకు." సమీర రెండుభుజాలు తన చేతులతో పట్టుకుని, తన మొహంలోకి చూస్తూ అంది మల్లిక.

"పారానార్మల్ నమ్మేవాళ్ళంతా చదువులేనివాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఒకవేళ ఆవిడ స్పిరిట్ నిజంగానే వుండి, దానివల్ల సమీరకి అపకారం జరిగితే నువ్వు ఏం చేస్తావు?" సంజయ్ కోపంగా అడిగాడు.

"నేనుండగా సమీరకి ఎటువంటి అపకారం జరగదు. దయ్యాలు, భూతాలు అన్నవి అసలు లేనేలేవు కాబట్టి, ఆవిడ స్పిరిట్ గా వుండి, సమీరకి ఎదో చేసే ప్రశ్న అసలు రానేరాదు." సమీరని విడిచిపెట్టి, సంజయ్ మొహంలోకి చూస్తూ అంది మల్లిక.

"అసలు దెయ్యాలు, భూతాలు లేనే లేవని నువ్వెలా ప్రూవ్ చేస్తావ్?" కోపంగా అడిగాడు సంజయ్

"ప్లీజ్ మీరిద్దరూ ఇలా అర్గ్యూ చేసుకోవద్దు. ప్రస్తుతానికి ఈ విషయం వదిలేయండి. తరువాత ఆలోచిద్దాం." చిరాగ్గా అని అక్కడనుండి వెళ్లి పోయింది సమీర.

&&&

  మల్లిక చెప్పిన దాని మీద కన్నా, తన ఆంట్ ఇంకా కజిన్ చెప్పిన దాని మీదే ఎక్కువ నమ్మకం కలుగుతూ వుంది సమీరకి. ఆఫీస్ లో నీరజ కూడా అలా మాట్లాడి ఉండకపోతే, తనకి ఈ విషయం లో ఈ నమ్మకం వచ్చివుండేది కాదు. తనూ ఏ రోజూ దయ్యాల్ని, భూతాల్ని నమ్మలేదు. కానీ జరిగేవన్నీచూస్తూ ఉంటే, నమ్మక తప్పదనిపిస్తూంది.

"ఇప్పుడు కూడా నీ లేట్ హస్బెండ్ నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ వుంటారా?" ఆ రోజు నీరజ తన దగ్గర వర్క్ డీటెయిల్స్ తీసుకుని వెళ్ళిపోబోతూన్న సమయంలో సమీర అడిగింది.

"ఎస్ మాడం. కానీ నేను తనకి చాలా గట్టిగా చెప్పేసాను. నేను ఆఫీస్ లో ఉండగా నన్ను కలిసి మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దని. సో, ఇంకెప్పుడూ తను నేను ఆఫీస్ లో ఉండగా నాతొ మాట్లాడే ప్రయత్నం చెయ్యరు." చిన్న గొంతుతో అంది నీరజ.

"అసలు ఎవరో స్త్రీ నాకు అపకారం చెయ్యబోతూవుందని తనకెలా తెలిసింది?"

"నాకు తెలియదు మేడం. నేనా విషయం గురించి అడగలేదు." అదే చిన్న గొంతుతో అంది నీరజ.

"నేను కావాలనుకుంటే నాతొ మీ లేట్ హస్బెండ్ మాట్లాడతారా? నేనాయన తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను."

"ఇప్పటివరకూ చనిపోయాక నా హస్బెండ్ కేవలం నాతొ మాత్రమే మాట్లాడారు. చివరికి తన కూతురు తో కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. మీతో మాట్లాడగలరో లేదో నేను చెప్పలేను. కావాలంటే ఏమైనా ప్రశ్నలు మీ తరపున నేను ఆయన్ని అడిగి సమాధానాలు మీకు చెప్పగలను."

"నో నీరజా. నేనే ఆయనతో మాట్లాడి తెలుసుకోవాలి. అలా నేను డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడగలగడం అవుతుందో లేదో తెలుసుకో. ఒకవేళ అలా కుదరకపోతే నువ్వు చెప్పిన పధ్ధతి గురించి ఆలోచిద్దాం."

"అలాగే మేడం. మళ్ళీ అయన నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన్ని ఈ విషయం అడిగి, అయన ఏమన్నదీ మీతో చెప్తాను."

"థాంక్ యు నీరజా." కృతజ్ఞతగా చూస్తూ అంది సమీర.

"మీరు నాకు థాంక్స్ చెప్పకండి మేడం. మీరు నాకు ఇలా జాబ్ ఇచ్చి పోషిస్తున్నందుకు, మీకు ఈ మాత్రం సహాయం చేయగలగడం నా అదృష్టం. అది నా బాధ్యత కూడా."

"ఆల్రైట్. ఎనీహౌ వన్ మోర్థింగ్." కాషన్ గా చూస్తూ అంది సమీర. "ఈ విషయం మనిద్దరి మధ్య మాత్రమే ఉండాలి. ఇంకెవ్వరికీ తెలియనివ్వకు."

"అలాగే మేడం." అలా అన్న తరువాత అక్కడనుండి వెళ్ళిపోయింది నీరజ.   

&&&

ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి, కాఫీ సిప్ చేస్తూ, హాల్ లో సోఫాలో కూచుని పేపర్ చూస్తూ వుంది సమీర. కాస్సేపట్లో పనంతా ముగించుకుని ఆఫీస్ కి బయలుదేరాలి.

"ఈ రోజు నీ ఆఫీస్ కి నీతోపాటుగా నేను కూడా వస్తాను." సోఫాలో సమీర పక్కనే కూలబడి అంది మల్లిక.

"మై ప్లెజర్" నవ్వింది సమీర. "తప్పకుండా అలాగే చెయ్యి."

మల్లిక ఇంకా ఎదో అనబోతూ ఉండగా సమీర సెల్ ఫోన్ మోగింది. ఎదో అన్నోన్ నెంబర్, అబ్రాడ్ నుండి. అబ్రాడ్ కాల్స్ సమీరకి చాలా సహజం. ట్రూ కాలర్ ఎదో సజెస్ట్ చేస్తూంది కానీ ఆ పేరు తనకి పరిచితంగా లేదు.

"హలో" ఫోన్ కాల్ అటెండ్ అయి అంది సమీర.

"ఈజ్ ఇట్ సమీర, మేనేజింగ్ డైరెక్టర్ అఫ్ మమూత్ ఇండస్ట్రీస్?" ఎవరిదో మగ గొంతు. ఫారిన్ పెర్సన్. తనకెప్పుడూ ఇంతకుముందు విన్న గుర్తు లేదు.

"ఎస్ అఫ్కోర్స్, టెల్ మీ వాట్?" చిరాగ్గా అంది సమీర. మానింగే అలాంటి ఫోన్ కాల్ తనకి నచ్చలేదు, ఇరిటేటింగా వుంది.

"ఐ థింక్ యు అర్ ది గర్ల్ ఫ్రెండ్ అఫ్ నిరంజన్ ఇన్ అమెరికా"

"ఎస్" భృకుటి ముడి పడిపోయింది సమీరకి. ఎవరో అన్నోన్ పెర్సన్ అమెరికా నుండి ఫోన్ చేసి, తన బాయ్ ఫ్రెండ్ నిరంజన్ గురించి ఎందుకు అడుగుతున్నట్టు?

"ఐ యాం సారీ టు సే దిస్. ఎస్టర్ డే నైట్ హి డైడ్ విత్ హార్ట్ ఎటాక్. ఐ యాం సెండింగ్ ఏ వీడియో క్లిప్ టు యు. సి దట్." అలా అన్న తరువాత ఆ ఫోన్ కాల్ కట్ చేసాడు ఆ పెర్సన్.

"మై గాడ్! ఏమిటిది? నాకెలా అర్ధం చేసుకోవాలో బోధపడడం లేదు." ఫోన్ ని తన ముందువున్న టేబుల్ మీద పెట్టి, మల్లిక మొహంలోకి చూసింది సమీర.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)