The Life in Telugu Moral Stories by Yamini books and stories PDF | జీవితం

The Author
Featured Books
Categories
Share

జీవితం

రవి, నిజానికి చాలా మంచి అబ్బాయి. ప్రతీ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవుతూ ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతున్నాడు. రవి ఒక్కడే సంతానం అయినందున తల్లి చాలా గారాబంగా చూసుకునేది. రవి తండ్రి ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. ఒకసారి రవి వాళ్ల స్నేహితుల మాటలు విని, వాళ్లతో కలిసి క్లాస్ లోని ఒక అమ్మాయిని ఏడిపించాడు. ఆ విషయం తెలిసిన క్లాస్ టీచర్.., అమ్మాయిని ఏడిపించిన వాళ్లందరిని పిలిచి తల్లి తండ్రులను తీసుకురమ్మని చెప్పింది. రవికి తన వల్ల తప్పు జరిగింది అని అర్థమైంది. భయంతో ఇంటికి వెళ్లి ఏడుస్తూ జరిగిన విషయం వాళ్ల అమ్మకి చెప్పాడు. ఎంతో గారాబంగా పెంచుకున్న కొడుకు అంతలా ఏడవడం చూడలేని తల్లి , అసలు నువ్వు చేసింది తప్పే కాదు. నేను వచ్చి మాట్లాడతా మీ టీచర్ తో అని రవి చేసిన తప్పుని సమర్ధించింది.

మరునాడు..పిల్లలు వారి పేరెంట్స్ ని తీస్కొని స్కూల్ కి వెళ్లారు. రవి తల్లి తప్ప మిగతా అందరు క్లాస్ టీచర్ కి మరియు ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి ఇంకోసారి ఇలాంటి తప్పు మళ్లి చేయమని చెప్పి వచ్చేసారు. కానీ.., రవి వాళ్ల అమ్మ అసలు రవి చేసింది తప్పే కాదని, స్కూల్ అన్న తరువాత ఆ మాత్రం రాగ్గింగ్ ఉంటుందని, తిరిగి టీచర్ ని అందరి ముందు అవమానించి వెళ్లిపోయింది. ఆరోజు నుండి రవి తను ఎలాంటి తప్పు చేసినా..వాళ్ల అమ్మ టీచర్స్ నుండి కాపాడుతుందని అనుకుని, అందరితో గొడవ పెట్టుకోవడం అమ్మాయిలని ఏడిపించడం వంటివి చేస్తూ వచ్చాడు. ఇదంతా క్లాస్ టీచర్ కి తెలిసినా..,రవి వాళ్ల అమ్మ గురుంచి గుర్తొచ్చి రవిని ఏమి అనకుండా ఉండేది. చివరకు రవి ఆగడాలు మితి మీరడంతో క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ సహాయంతో రవిని స్కూల్ నుండి పంపించేసింది. చెడ్డ పేరుతో స్కూల్ నుండి బయటకి రావడం కారణంగా వేరే స్కూల్ వాళ్లంతా ఈ సంవత్సరం మా స్కూల్ లో జాయిన్ చేసుకోలేము. కావాలంటే తరువాతి సంవత్సరం ట్రై చేయండి అన్నారు.

అలా రవి ఎడవ తరగతి పూర్తవకుండానే చదువు మద్యలో ఆగిపోయింది. కాలీగా ఉన్న రవి చెడు స్నేహాలు ఎక్కువయి బయట గొడవలు చేయడం, కొట్లాడుకోవడం, ఆ గొడవలను ఇంటి వరకు తీసుకురావడం చేసేవాడు. రవి ఎంత పెద్ద తప్పు చేసినా, వాళ్ల అమ్మ రవి తప్పుని సమర్ధించి ఎదుటి వారిని తిట్టేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక రవి పెద్ద గూండాగా మారిపోయాడు. తప్పు చేయడం.. జైలు కి వెళ్లడం.. వాళ్లమ్మ డబ్బులు కట్టి విడిపించి తీసుకురావడం ఇదొక వ్యసనంలా మారింది రవికి. తానేం చేసిన తన తల్లి ఉందనే ధైర్యంతో తప్పు మీద తప్పు చేస్తూ వెళ్ళిపోయాడు. ఒకసారి ఒక పెద్ద దొంగల ముఠా రవిని, వాళ్ళతో కలిసి పనిచేయమని అడిగారు. అందుకు రవికి తగినంత డబ్బు ఇస్తామని చెప్పారు. డబ్బుకి ఆశపడ్డ రవి వెంటనే ఒప్పుకున్నాడు.

నెల రోజుల తరువాత అందరు కలిసి దొంగతనం చేయడానికి బాగా డబ్బున్న ఇల్లు మరియు ఇంట్లో ఎవరు లేనిది చూసుకొని వెళ్లారు. రవి అక్కడ ఉన్న వాచ్ మెన్ ని తల పైన గట్టిగా కొట్టాడు, అందరు కలిసి ఇంట్లోకి ప్రవేశించారు. డబ్బు నగలు తీసుకుని వచ్చేసారు. రవికి తన వాటా కింద చాలా డబ్బు దొరికింది. ఆ డబ్బుతో తన తల్లికి నగలు చేయించాడు. అది చూసిన రవి తల్లి, ఏ పని చేయని కొడుక్కి ఇంత డబ్బు ఎలా వచ్చింది..? అని ఒక్క మాట కూడా అడగకుండా..,రవి తెచ్చిన నగలు చూసి మురిసిపోయింది. మూడు రోజుల వరకు దొంగతనం చేసింది వీరే, అని ఎవరు కనిపెట్టలేరని సంతోషంగా ఉన్నాడు రవి. కానీ.., దొంగతనం జరిగిన ఇంటి ఓనర్ తిరిగి రావడం మరియు అక్కడ వాచ్ మెన్ చనిపోయి ఉండడం చూసి వెంటనే పోలీస్ లకి ఫోన్ చేసాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ లు చుట్టూ అంత పరిశీలించారు.

సీసీ కెమెరాస్ అన్ని పగిలిపోయిన కారణంగా ఇంట్లోకి ఎవరు వచ్చి దొంగతనం చేసారో వారికి అర్ధం కాలేదు. చివరగా వాచ్ మెన్ మొబైల్ ని చూసారు. వాచ్ మెన్ తన తెలివితో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ దొంగతనాన్ని చాటుగా వీడియో తీసాడు. చివరగా తన ఓనర్ కి ”సర్ మీరు ఎలాంటి పని లేని నాకు ఉద్యోగం ఇచ్చి నా కుటుంబాన్ని ఆదుకున్నారు. నేను చాలా ప్రయత్నించాను దొంగతనం జరగకుండా చూడటానికి … కానీ, దొంగలు నన్ను కొట్టి లేవకుండా చేసారు. నాకు వచ్చిన ఆలోచనతో వారి వీడియో తీస్తున్నాను. ఒకవేళ నేను చనిపోతే దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోండి “అని రికార్డు చేసి చనిపోయాడు. అది చూసిన పోలీసులు మరియు ఆ ఓనర్ కళ్లు చెమ్మగిల్లాయి. వీడియో చూసిన ఓనర్ అందులో ఉన్న ఒక వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. అతను రవి…తన క్లాసుమేట్. తాను దొంగతనం చేయడమేంటి…? అనుకున్నాడు. వెంటనే పోలీసులతో, ఇతని ఇల్లు నాకు తెలుసు అని దగ్గరుండి మరీ రవి ఇంటికి తీసుకెళ్లాడు.

రవిని చూడగానే .. తాను చిన్ననాటి క్లాసుమేట్ అని చెప్పాడు. మనందరం కలిసి అమ్మాయిలని ఏడిపించాము. కానీ, తర్వాత నా తల్లి తండ్రులు చెప్పిన మాటలు విని ఏది మంచో..! ఏది చెడో..! తెలుసుకుని ఆ రోజు టీచర్ కి మరియు ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పాను. అప్పటి నుండి ఎలాంటి తప్పులు చేయకుండా మంచిగా చదువుకుని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాను. కానీ, నువ్వు మరియు మీ అమ్మ కలిసి తప్పు ఒప్పుకోకుండా తిరిగి టీచర్ ని అవమానించారు. మంచి, చెడు తెలియకుండా దొంగల తయారయి చివరకు హంతకుడివయ్యావు.. నాకెంతో నమ్మకంగా పనిచేసే నా ఇంటి వాచ్ మెన్ ని పొట్టనపెట్టుకున్నారు. నీవల్ల తన ఫామిలీ రోడ్డున పడ్డారు. నిన్నేం చేసిన తప్పులేదు అని చెప్పి పోలీసులకి పట్టించాడు.

రవి చేసిన తప్పులన్నిటికి సరైన ఆధారాలు ఉన్నందువలన రవికి ఉరిశిక్ష విధించారు. సరిగ్గా ఒక్క సంవత్సరం తర్వాత రవి చివరి కోరిక మేరకు తన తల్లిని పిలిపించారు. రవి చివరగా… ” అమ్మా..! నేను ఈ రోజు ఇలా చనిపోతున్నానంటే దానికి కారణం నువ్వే. తప్పు చేసిన నన్ను, ఇది తప్పు అని శిక్షించకుండా నన్ను సమర్ధించావు. తప్పు చేసి జైలుకు వెళ్లిన ప్రతీసారి డబ్బు కట్టి మరీ విడిపించావు.

ఆ రోజు స్కూల్ లో నేను చేసిన తప్పుకి నా చెంప పగులగొట్టి, ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పి ఉంటే.., నేను కూడా నా ఫ్రెండ్ లాగే గొప్పవాడిని అయ్యుండేవాడిని. నీ ప్రేమ నన్ను మంచిదారిలో నడిపించలేదమ్మా .. చెడ్డ దారి ఎంచుకోవడానికి సహకరించింది” అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని తుది శ్వాస విడిచాడు. రవి తల్లి, తాను అతి గారాభం చేసి కొడుకుని శిక్షించని కారణంగా.. చివరకు, చేసిన తప్పులకి శిక్షపడి ఉరికంబం ఎక్కి ప్రాణాలు వదిలాడని గుండెలు పగిలేలా ఏడ్చి తాను కనుమూసింది.

"నీతి | Moral : ” పిల్లల తప్పుని శిక్షించాల్సింది పోయి, ఆ తప్పును సమర్థిస్తున్నారు ఈ కాలంలోని చాలా మంది తల్లి తండ్రులు. దాని వల్ల చెడిపోయేది మీ పిల్లలే. ఒక వయస్సు వచ్చేసరికి పిల్లలకి మంచి ఏదో..?! చెడు ఏదో..?! తెలియ చేయాల్సిన కనీస బాధ్యత తల్లి తండ్రులది.తద్వారా, వారికి సామాజిక విలువలు తెలిసి క్రమశిక్షణతో ఉంటూ జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతారు."