The shadow is true - 33 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 33

Featured Books
Categories
Share

నీడ నిజం - 33

రాహుల్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి విద్యాధర కళ్ళు అత్తగారి కోసం అన్వేషిస్తున్నాయి . అక్కడ దిగిన గంట లోనే నాలుగు సార్లు రాహుల్ కు గుర్తు చేసింది . రాహుల్ నిస్సహాయం గా భరత్ రామ్ ను చూశాడు . అతడి బాధ ఆయనకు అర్థమైంది .

“ విద్యా ! మీ అత్తగారిది పెద్ద వయసు కదా ? విశ్రాంతి గా పడుకొని ఉంది . రేపు ఉదయం స్థిమితం గా చూడవచ్చు . నువ్వు ఈ రాత్రి రెస్ట్ తీసికో ‘”

అత్తా- కోడళ్ళ సమావేశం చాలా కీలకమైంది . విచిత్రమైన పరిస్తితుల్లో చాలాకాలం తర్వాత కలుస్తున్నారు . కలిసిన క్షణం లో వారిద్దరి భావోద్వేగం ఊహకందని స్థాయి లో ఉంటుంది . అందుకు పెద్దావిడను సిద్ధం చేయాలి . ఆవిడ రాత్రి పూట ఓ పెద్ద గ్లాసు నిండా పాలు తాగుతుంది . మరేమీ తీసుకోదు . అదే ఆమె జీర్ణశక్తికి ఎక్కువ .

“ ఏరా పాలు నువ్వు తీసుకోచ్చావ్ ? నీ కూతురేది ? అప్పుడే నిద్ర పోయిందా ?”

ఏం నీ ముని మనవరాలే తీసుకురావాలా ? నేను తెస్తే తాగవా ?”

“ పడుకోబోయే ముందు దాన్ని ఒక్కసారి చూడాలి . . ఎంతైనా అది నా చిట్టి కోమల కదా ?”

“ నీ కోడలి మాట ఎత్తితే నే ఎగిరి పడతావ్. చిట్టి కోమలని , నా కూతురని ముద్దు చేస్తావ్ . అయినా మా అమ్మ మీద ఎందుకంత కోపం ?”

“కోపం కాదురా బాధ లేనిపోని భయాలతో నిండు ప్రాణం బలి తీసుకుంది .. .”

“ మీ నాన్న అకాల మరణం తనను బాగా కృంగ దీసింది . తనకు రక్షణ, భవిష్యత్తు లేదనుకుంది . ఎంత చెప్పినా వినకుండా మంటలకు ఆహుతి అయింది .చివరి మాట ముగిస్తూ కళ్ళు తుడుచుకుంది .”

“ మా అమ్మ మళ్ళీ పుడితే ?” .... పెద్దావిడ జాలిగా నవ్వింది .

“ మళ్ళీ పుట్టినట్లు కల గన్నావా ?”

“ కల కాదు నాన్నమ్మా ! నిజం ! “ ఆమె అర్థం కానట్లు చూసింది .

“ మీ అమ్మ మళ్ళీ పుట్టడమేమిటి రా ?”

ఆమె లో కలవరం. గొంతు లో సన్నగా వణుకు .

“ అవును. నాన్నమ్మా ! మళ్ళీ పుట్టింది ...”

అలా ప్రారంభించి వివరాలన్నీ క్లుప్తం గా చెప్పాడు .

“ ఆమె నిన్ను చూడడానికి రేపు వస్తుంది . ఈ జన్మ లో కూడా ఆమె కు నేను రాహుల్ బాబు నే . .. నిన్ను కలవాలట . చేసిన తప్పుకు క్షమించమని అడగాలట

నన్ను చూసి కదిలిపోయింది . ఆ క్షణం లో ఆమె లో అమ్మ కనిపించింది . వయసు , మారిన రూపం , జన్మ ---- ఏవీ ఆమెను ఆపలేకపోయాయి “.

సాంతం కుతూహలం గా, ఆత్రుత గా విన్న రాహుల్ నాన్నమ్మ తృప్తి గా నిట్టూర్చింది .

“ ... ఇన్నాళ్ళ నీ బాధ , ఆరాటం , వృధా కాలేదు . మీ అమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది . .బహుశా ఈ అద్భుతం చూడటానికే ఇంత కాలం బ్రతికున్నానేమో ! ఇక నీ గురించి నాకు దిగులు లేదు . సంతోషం గా , ధైర్యం గా నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్లిపోవచ్చు . “

మనవడిని సంబరం గా చూసింది .

“ నువ్వెక్కడి కెళతావ్ ? కోడలితో నాలుగు రోజులు కలిసి మెలసి ఉండవా ?”

ఆమె నవ్వింది . దాదాపు పాతికేళ్ళ తర్వాత ఆమె మొహం లో ఉత్సాహం చూడగలిగాడు . ముడుతలు ముడుచుకు పోయిన మొహం లో వెలుగు రేకలు .

వాయిస్ ఆఫ్ ఉమెన్ ‘ కార్యదర్శి దీప్తికులకర్ని విద్యాధరికి రాసిన బహిరంగ లేఖను పాత పేపర్లు

రెండు సార్లు చదువుకున్నాడు . కులకర్ణి కి ఆమె వివరాలు కావాలి . ఆ వివరాలు తనకు తెలుసు గనుక ఆమెకు అందించ గలడు .తగినంత రాబట్టు కోగలదు . ప్రైవేటు డిటెక్టివ్ గిరిధర్ లాల్ కులకర్ణి ల్యాండ్ లైన్ కు ట్రై చేశాడు . వెంటనే లైను దొరికింది .

చెప్పవలసిన విషయాలు సూటిగా, క్లుప్తం గా చెప్పాడు . అతడు చెప్పింది కులకర్ణి ఓపిగ్గా విన్నది . అరనిమిషం మౌనం తర్వాత అతడిని వెంటనే ఢిల్లీ కి రమ్మంది .

గిరిధర్ లాల్ అరుదైన అవకాశాలు వస్తే మడి కట్టుకొని కూర్చోడు . నో ప్రొఫెషనల్ ఎథిక్స్ .

జస్వంత్, భరత్ రామ్ ,

కులకర్ణి----అజయ్ లక్ష్యం గా ఆనాటి రహస్యం వెలికి తీయడానికి వడివడిగా నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు దూసుకు వెళుతున్నారు .

ఇదంతా ఒక ఎత్తైతే –అజయ్ వ్యవహారం లో రాజకీయ జోక్యం అనూహ్య పరిణామం . రాష్ట్రం లో అధికార పార్టీకి , అజయ్ సింహ వర్గానికి అసలు పొసగదు .

ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు . .

అజయ్ సింహ ఆ పరగణా లోనే మకుటం లేని మహారాజు . వారసత్వం గా వచ్చిన రాచరికపు దర్పం , , విక్రం సింహ పేరు, ప్రతిష్టలు , దాతృత్వం, దయాగుణం అజయ్ సింహ్ తమ్ముడిగా అందిపుచ్చు కున్నాడు . అందరూ అతడికి బ్రహ్మ రథం పడుతుంటే స్థానిక నాయక గణానికి ఒంటికి కారం రాసుకున్నట్లుగా వుండేది . ఇన్నాళ్ళకు కుడితిలో పడ్డ బల్లి లా వారికి దొరికాడు . సహగమనం సాంఘిక దురాచారం అన్న ఒకే ఒక్క ఆయుధం తో వారు అజయ్ పై ప్రత్యక్ష పోరాటం ప్రారంభించారు . అధికార పార్టీ లోని పై వర్గాలు ఈ అవకాశాన్ని పూర్తిస్థాయి లో వినియోగించుకున్నాయి . సమావేశాలతో , ప్రదర్శనలతో అతడి కీర్తిని , పలుకుబడిని దెబ్బ దీశాయి .

*****************************

కొనసాగించండి 34లో