ఆ పెద్ద లోగిలి ముందు వ్యాను ఒక్క కుదుపు తో ఆగింది . అందులోంచి నలుగురు
వ్యక్తులు దిగారు . అందరూ దాదాపు ఒకే వయసు వారు . బాగా చదువుకొని పెద్ద పెద్ద
పదవుల్లో ఉన్న వారిలా హుందాగా, గంభీరంగా ఉన్నారు . వారెవరో, ఎందుకు వచ్చారో అజయ్
కు అర్థం కాలేదు . అయినా అజయ్ వారిని మర్యాదగా ఆహ్వానించి కూర్చోమన్నాడు . తనూ
కూర్చున్నాడు .
“ నా పేరు భరత్ రామ్ . సైకియాట్రిస్ట్ . వీరు నా కొలీగ్స్ . .... దాదాపు
పదిహేను సంవత్సరాల క్రితం విద్యాదరి అనే పదేళ్ళ పాపను కౌన్సిలింగ్ చేశాను.”
వచ్చిన నలు గురి లో ఒకరు పరిచయం చేసుకున్నారు . అజయ్ మొహం లో రంగులు మారాయి .
“ విద్యాధరి ఎవరు?” భరత్ రామ్ ప్రశ్న అర్థం కాలేదు . “ ... నేను ట్రీట్
చేసిన విద్యాధరి, మీ ఊరికి వచ్చిన అజ్ఞాత స్త్రీ ఒకరేనని నా
అనుమానం.ఇద్దరిలో ఒక main common symptom ఉంది .”
“ ఏమిటది “?
“ ఇద్దరూ మంటల్ని చూసి బెదరి పోయారు భయం తో కేకలు పెట్టారు .”
“ మా గ్రామానికి వచ్చిన అజ్ఞాత స్త్రీ వివరాలు మాకెవరికీ తెలియవు . ఆమెను
కనీసం మీరు చూడనైనా చూడలేదు . మరి---ఆమె మంటల్ని చూసి భయం తో కేకలు పెట్టిందని
మీరెలా చెప్పగలరు ?” భరత్ రామ్ అజయ్ ను వింతగా చూశాడు .
“ నేను ఇంత దూరం వచ్చి మిమ్మల్ని ఎందుకు కలిశానో ఇంకా అర్థం కాలేదా ? పూర్వజన్మ లో ఆమె మీ వదిన గారు కదా ? ఆమె
సహగమనం చేస్తున్నప్పుడు చివరి క్షణం లో కేకలు పెట్టారు కదా ? జస్వంత్ ఆర్టికల్ లో చదివాను . అది చదివాక ఆ
అజ్ఞాత స్త్రీ , విద్యాధర ఒకటేనని అనిపించింది .
... మీరు నా సందేహం ఒకటి తీర్చాలి . ...చితిమంటల్లో కాలిపోతూ చివరి క్షణం
లో మీ వదిన గారు కేకలు పెట్టారు కదా ? భయం వల్లనా ? మరేదైన కారణం ఉందా ? మీకు
తెలుసు . ...ఈ సందేహం నా దొక్కడిదే కాదు . ఆర్టికల్ చదివిన ప్రతి పాఠకుడిది
.?......అజయ్ ను సాభిప్రాయం గా చూశాడు . “ అయితే ఏమంటారు “ అజయ్ లో అసహనం.
“ చెప్పానుగా నా సందేహం తీర్చండి ?” అర నిమిషం మౌనంగా ఉన్నాడు అజయ్
“..... మా అన్నగారు పాము కాటుతో అకాల మరణం చెందారు . ఆయన చనిపోవటం తో మా వదిన
గారు కృంగి పోయారు . సహగమనం చేయాలనుకున్నారు .
మా కుటుంబం లో అందరం వద్దని ప్రాధేయ పడ్డాము . ఊరి పెద్దలు చెప్పి చూశారు .
ఆమె వినలేదు . సహగమనం చేయాలనే పట్టుబట్టారు . సహగమనానికి సిద్ధపడ్డవారు భయం, భీతి అని వెనకడుగు
వేయరు . ...కేకలు పెట్టరు . ఆమె కేకలకు కారణం భయం కాదు . మా అన్న కొడుకు రాహుల్---రాహుల్ పుట్టగానే
తల్లిని పోగొట్టుకున్నాడు . ఆ పసివాడి సంరక్షణ కోసమే మా అన్నగారు ఆమెను వివాహం
చేసుకున్నారు . కానీ—తన బాధలో ఆమె బాధ్యతే మరిచి పోయారు . చితి పై మంటల్లో కూర్చొని
మంటల్లో కాలిపోతున్న ప్పుడు రాహుల్”అమ్మా” అని గట్టిగా కేక పెట్టాడు . వాడిని
చూడగానే ఆమెకు తప్పు తెలిసి వచ్చింది . వాడికి దూరమవుతున్నాను , అన్న బాధ తో నే
ఆమె కేకలు పెట్టారు .
“ మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది . కాని--- ఆర్టికల్ లో ఆమె కేకల వెనక ఏదో
మిస్టరీ ఉందని జస్వంత్ రాశారు . మీ ఊరి వాళ్లకు కూడా అదే అభిప్రాయం ఉందట. “
“ అని అతడికి మా ఊరివాళ్ళు చెప్పారా ? ఇంటర్వ్యూ పేరు తో నన్ను రచ్చ కీడ్చాడు
. తన పాపులారిటీ కోసం , పత్రిక ‘” సర్క్యులేషన్ పెంచటం కోసం ఉన్నవి, లేనివి రాసి నన్ను ఇలా
ఇబ్బంది పెడుతున్నాడు . రోజూ మీలాంటి వారి సందేహాలు తీర్చలేక చచ్చిపోతున్నాను .
...మీరు బాధ్యతగల డాక్టర్ అన్న గౌరవం తో ఇంతసేపు నేను మాట్లాడాను . ఇంతకూ మించి నేను
చెప్పవలసినది ఏమీ లేదు . సెలవ్ “ పూర్తిగా అసహనం కోల్పోయిన అజయ్ ఒక్క ఉదుటున
విసురుగా లేవబోయాడు .
“ అజయ్ గారు ! కోపం
తెచ్చుకోకండి . క్షణం ఆగండి . .... జస్వంత్ లా
మరొకరి లా మాకు ఎలాంటి ఉద్దేశ్యాలు లేవు . మేమంతా ఓ టీం ఆఫ్ డాక్టర్స్ . ఢిల్లీ లో ఓ పెద్ద సంస్థ లో పని
చేస్తున్నాము . విద్యాదరి చాల టిపికల్ కేస్ . ఆమె పూర్వజన్మ లో మీ వదిన గారు
అయుంటే మీరు చెప్పే విషయాలు ఈ కేసుకు చాలా ముఖ్యం . ఇలాంటి కేసులు ముందు ముందు
వస్తే విద్యాదరి కేస్ హిస్టరీ మాకు గుడ్ రిఫరెన్స్ లా పనికొస్తుంది . ఏదైనా విద్యాధరిని తప్పక కలవాలి .....ఆమెను
చూడాలని, ఆమె చెప్పే వివరాలు వినాలని ఎందరో
ఆత్రుత గా చూస్తున్నారు . మరి ఆమె
అజ్ఞాతం లో ఉండవలసిన అవసరం ఏమిటో అర్థం
కావటం లేదు .”
“ ఆమె ఎవరో ఈ లోకానికి తెలిస్తే నా లాగే బాధపడాలి . నా అవస్థ చూస్తున్నారు గా ? ఈ తలనొప్పి తప్పించుకోవటానికే ఆమె అజ్ఞాతం లో
ఉన్నారేమో “?
“ ఆమె మీ వదిన గారి ప్రతి రూపం కదా ? ఆమెను ఒకసారి
కలిసి మాట్లాడాలనిపించటం లేదా ? “
“ ఆమెను కలవాలో, లేదో అన్నది నా వ్యక్తిగత విషయం . ...”
“ ఓకే . మీ వ్యక్తిగత విషయాల్లో మేమూ జోక్యం చేసుకోం . ... మీరు నిన్నటి పేపర్
చూశారా . “
“ లేదు . ఏం ?”
“ వాయిస్ అఫ్ విమెన్” అని
ఢిల్లీలో ఒక స్వచ్చంద సేవా సంస్థ ఉంది .
ఆడవారి హక్కుల కోసం పోరాడుతుంది . ఆ సంస్థ కార్యదర్శి దీప్తి కులకర్ణి---చాలా dynamic . ఆమె మాలాగే జస్వంత్
ఆర్టికల్ కు రెస్పాండ్ అయింది . ‘సతి’ పేరు తో కోమలకు అన్యాయం
జరిగిందని ఆమె అనుమానం . ‘సతి’ నేరం, సాంఘిక దురాచారం కనుక కోమలాదేవి
మిస్టరీ వెలుగు లోకి తేవాలని ఆమె పట్టుదల . అందుకు అజ్ఞాత స్త్రీ సజీవ సాక్షి .
ఆమె పేరు తో ఒక open letter పత్రిక లో ప్రకటించింది . విద్యాధరిని
వెలుగు లోకి రమ్మని , ఎవరికీ భయపడ వద్దని , ఆనాడు జరిగిన సంఘటనలు , సతి
వివరాలు చెప్పి తనకు సహకరించమని open letter లో ప్రోత్సహించింది . “
“ ఆ ఉత్తరానికి స్పందనగా ఆమె వెలుగు లోకి వస్తే కోమలా దేవి కేసును మళ్ళీ open చేస్తారు . విద్యాధరి చెప్పిన వివరాలతో కులకర్ణి కోర్టు లో ‘పిల్’ ( public interest లిటిగేషన్ ) వేస్తుంది . మాకు చెప్పినా, చెప్పక పోయినా ఆనాడు
ఏం జరిగిందో కోర్టుకు మీరు చెప్పాలి .”
మీ కుటుంబ సభ్యులందరూ అందుకు బాధ్యులవుతారు . “ నలుగురిలో ఒకరన్నారు. అజయ్ అ వ్యక్తిని మింగేసేలా చూశాడు .
“ దీప్తి కులకర్ణి కోర్టు మెట్లు ఎక్కితే చాలు . ఆ అజ్ఞాత యువతికి చట్టం రక్షణ
కల్పిస్తుంది . ఆమెకు ప్రజల సానుభూతి ఉంది . చట్టం, సమాజం రక్షణ తో ఆమె వెలుగు లోకి వస్తుంది . నిర్భయం గా ఆనాడు ఏం జరిగిందో కోర్టు లో
చెబుతుంది .” మరొకరు వివరించారు .
అజయ్ లో ఆవేశం పొంగింది . స్వరం పెరిగింది .
“ మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు .ఇది బెదిరింపా ?
హెచ్చరికా ? సూచనా ? అసలు మీ ఉద్దేశ్యమేమిటి ?”
“మిమ్మల్ని బెదిరించవలసిన అవసరం మాకు లేదు . ఇలా జరగవచ్చన్న సూచన చేస్తున్నాం
. సహగమనం పేరు తో ఏ అవాంఛనీయ సంఘటనలు
జరగనప్పుడు మీరెందుకు భయ పడాలి . ?”
´ఆ అవసరమే లేదు . కోర్టు లోనే కాదు , మరెక్కడైనా ఆమె చెప్పినా ప్రమాదం
లేదు---నష్టం లేదు . “ మేకపోతు గాంభీర్యం తో ముగించాడు అజయ్ . మనసులో మాత్రం
విద్యాధరిని వీలైనంత త్వరలో కలవాలని ఆరాటపడి పోయాడు . అతడినలా తొందర చేసే
ఉద్దేశ్యం తో నే భరత్ రామ్ అజయ్ ను కలిశాడు . త్వరగా విద్యాధరి సమస్యలోంచి బయట
పడాలి .
******************************
కొనసాగించండి 33లో