కైలాష్ , కొండపై నుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని చాలా ఎత్తైన కొండ పైకి ఎక్కుతాడు .మరో పది అడుగులు వేస్తే దూకుతాడు అనగా ఏదో కాలికి తగులుతుంది. అది మెరిసే ఒక రాయి. పక్కనే ఉన్న ఒక కర్ర సహాయంతో ఆ రాయిని భూమి నుంచి బయటికి తీస్తాడు . దాని దుమ్ముని తుడుద్దామని చేతితో అలా అనగానే ,అతని స్పర్శ కారణంగా ఒక ఆత్మ బయటకు వస్తుంది. నిజానికి అది వేరొకరి ఆత్మ .
దాన్ని చూడగానే దయ్యంలాగా అనిపించి భయపడిపోతాడు. కానీ ఎలాగో చావాలి అనుకున్నప్పుడు ఎలా చస్తే ఏంటి లే ? అనుకొని ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు.
“ నేనొక భూతాన్ని! ” అంటూ కొంచెం భయంకరంగా చెబుతోంది .
“ వామ్మో సినిమాల్లో చూపించినట్టు మమ్మల్ని చంపకు తింటావా? ”
“ నాకు అంత సీన్ లేదులే , ఏదో జస్ట్ భయపిద్దాం అనుకున్న....!! ”
“ అవునా ! మరి ఇప్పుడు ఎందుకు వచ్చావ్ ?ఏ పని లేకపోతే ? ”
“ నేను ఎక్కడ వచ్చాను .నువ్వేగా రాపిచ్చావు. అసలు ఎందుకు చావని వచ్చావు? నీ ప్రాబ్లం ఏంటి? ”
“ నేను చావడానికి వచ్చాను అనీ నీకు ఎలా తెలుసు ” అని సందేహంగా అడిగాడు.
“ చావడానికి కాకపోతే, చికెన్ డిన్నర్ చేసుకొని తిందామని ఇంతదూరం ఒక్కడివే వస్తావా? ”
“ అవును .........అంతే లే! నా కష్టాలు నీకేం తెలుసు. నువ్వు హ్యాపీగా చచ్చిపోయావు. ”
“ హీ.......... సరేలే ! ఎలాగో చచ్చిపోదాం అనుకున్నావు కదా! నీ స్టోరీ చెప్పొచ్చు కదా వింటాను. చాలా రోజులైంది బోర్ కొడుతుంది. ”
“ నీకు టైం పాస్ చేయడానికి రాలేదు అబ్బ , నేను సీరియస్ గా చచ్చి పోదాం అని వచ్చాను. ”
“ ప్లీజ్ చెప్పచ్చు కదా ! వీలైతే సొల్యూషన్ చెప్తాను కదా ” అంటూ ప్రాధేయ పడుతూ అడుగుతుంది ఆత్మ .బాగా రిక్వెస్ట్ చేయడంతో కథ చెప్పడానికి సిద్ధమవుతాడు మన కైలాష్ .
“ నా లైఫ్ లో ఎంజాయ్ అనే పదానికి చోటే లేదు .నా జీవితంలో ఆహా .......అనుకునే రోజు కూడా లేదు ” అనీ అల్లు అర్జున్ లాగ చెప్తాడు .
“ మా పేరెంట్స్ అర్థం చేసుకోరు. నాకు సబ్జెక్ట్ అన్నీ మిగిలిపోయాయి. ఫ్రెండ్స్ కూడా నన్ను టైంపాస్ గాడిలాగా చూడటం మొదలుపెట్టారు ” అంటూ తలదించుకుని బాధపడుతూ ఉంటాడు.
“ అవునా పాపం.........మరి లవర్ లేదా ? ”
“ అబ్బో లవర్ అనడం కంటే అది ఒక పెద్ద పిశాచి అనడం బెటర్. ”
“ నువ్వు అలా అనకు.........మా మనోభావాలు దెబ్బతింటాయి ” అంటూ ఒక సీరియస్ లుక్ ఇస్తుంది ఆత్మ.
“ సర్ సర్లే ......దాన్ని పోషించడానికి నేను సరిపోను అని చెప్తున్నా .దాన్ని పోషించాలంటే ఒక బ్యాంక్ కావాలి. ”
“ పాపం...........నువ్వు! నిజమే మనుషులు ఒకరి పైన మరొకరు ఆధారపడతారు. కొన్ని సార్లు పక్కన మాట్లాడడానికి మనిషి లేకపోతే అల్లాడిపోతుంటారు. నువ్వు అన్నట్టు కొన్ని అడుగుల తర్వాత మరికొన్ని అడుగులు జత కావలసిందేగా! ”
“ అవును...........అలా జరిగినప్పుడు ఏం చేయాలి? చావాలి......! నిజానికిది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు . నిరాశతో తీసుకున్న నిర్ణయం. నువ్వే చెప్పు నేను కరెక్టే కదా! ”
“ నువ్వు చెప్పింది కరెక్టే !” అంటూ ఆలోచిస్తూ అలా వెనక్కి తిరిగి నిలబడుంది ఆత్మ .
హీరో మాటలకి ఆత్మ కూడా కొంచెం ఆలోచనలో పడి , ఇప్పుడు ఆత్మ చెప్పడం మొదలు పెడుతుంది .
“ నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నీ ప్రాబ్లమ్స్ కి రెండు దారులు ఉన్నాయి .
మొదటిది అసలు నిన్ను వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి ? వాళ్ళు అర్థం చేసుకోవాలంటే నీ అవసరం ఉందో లేదో ఆలోచించు. నీకు కావాల్సిన అర్హతలు ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకో. అవసరం లేకుండా ఎవరు రారు కదా ! ఎంత నీ వాళ్ళ అయినా నిన్ను అర్థం చేసుకోవాలని రూల్ లేదు .నీ అవసరం వాళ్లకి లేదనుకుందాం నీ కర్మ ఇంతే అనుకుందాం .
ఇపుడు రెండోది నీకు వాళ్ల అవసరం ఉందా? ఒకసారి అవతల వారికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి బాధపడిపోతూ ఉంటాం. నీకు చదువు రాదు అనుకో నీకు నచ్చిన పని చేసుకో, ఏ పని చేసినా బతకడం కోసమే కదా! నువ్వు ఎప్పుడూ నెగిటివ్గా ఎందుకు ఉంటావు. నిన్ను అర్థం చేసుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నావు .నేను ఎవరికీ అర్థం కావట్లేదు అని అనుకుంటే సరిపోతుంది కదా! అప్పుడు ప్రాబ్లం నీలో ఉందని అర్థం అవుతుంది .అప్పుడు కూడా మారడానికి మళ్లీ ఇంకా రెండు దారులు ఉన్నాయి నువ్వు ఏం ఫీల్ కాకు...!!!
నీ వైపు నుంచి కాకుండా వాళ్ళ వైపు నుంచి ఆలోచించు .నువ్వు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు అనుకో, సరిగా ఉండటం లేదని నువ్వే అనుకో. ఇంకా అప్పుడు ప్రాబ్లం ఏముంటుంది ? నీ ఆత్మ హత్యని కొన్ని రోజులు పోస్ట్ ఫోన్ చెయ్ బాబు .......సరే . పక్క వాళ్ళ నుంచి గౌరవం అడుగుతున్నావు. నీకు నువ్వే ఎంత గౌరవము ఇచ్చూకుంటున్నావో ఆలోచించుకో ! ” ఆత్మ తను చెప్పాలనుకున్నది చెప్పేస్తుంది.
“ నువ్వు ఏదో చచ్చే ముందు మోటివేషన్ ఇచ్చే దయ్యంలా ఉన్నావు ” అని ఆ మెరిసే రాయిని అక్కడే పెట్టేసి , ఆత్మ మాటలకి గౌరవం ఇస్తూ ఇంటికి వెళ్తాడు.
____________________________________________
సరిగ్గా ఆరు నెలల తర్వాత అతను తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి వస్తాడు. ఆ మెరిసే రాయిని వెతికి బయటికి తీస్తాడు నవ్వుతున్న ముఖంతో ..........ఆ రాయి దుమ్ముని ధూళిపితే ఆత్మ మళ్లీ బయటికి వస్తుంది. నెమ్మదిగా అతని పక్కన కూర్చొని " ఏంటి చాలా ఆనందముగా ఉన్నావు" అంటూ ఆత్మ అడుగుతుంది.
“ అవును. నీ మాట వినడం వల్ల నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను .”
మౌనముగా అతడు చెప్పే మాటలు వింటూ ఉంటుంది ఆత్మ.
“ ఇన్ని రోజులు ఏదో టెన్షన్ వలనో లేక ఒంటరితనం వలనో కానీ మొబైల్ పట్టుకుని వాడిని .నా ఫోన్లో పనికిరాని ఫేస్ బుక్,వాట్సాప్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో టైం గడిపేవాడిని. ప్రాణం లేని సెల్లుతో గడుపుతున్న కానీ ప్రాణంతో ఉన్న వాళ్లతో గడిపలేకపోయాను. కొన్ని రోజులు ఫోన్ వాడటం తగ్గించేశాను. టైం చాలా మిగిలిపోయింది. ఆ టైం పాస్ కోసం కొత్తగా ఏదైనా చేయడం నేర్చుకున్నాను. ”
“ అబ్బో చాలా విషయం ఉందిగా నీ దగ్గర ” అంటూ ఆత్మ నవ్వుతూంది.
“ ఏదో మీ దయ.......”
“ సర్లే గాని తర్వాత ఏం చేసావో చెప్పు.......”
“ డైరీ రాయడం ప్రారంభించాను. దానివల్ల నా బలాలు బలహీనతలు తెలిశాయి. రాత్రి లేట్ గా నిద్ర పోయేవాడిని. దానివల్ల మరుసటి రోజు అలసత్వం ,చిరాకు, కోపం మొదలయ్యేది .ఆ ప్రభావం ఆ రోజంతా ఉండేది .ఇప్పుడు దాన్ని మార్చుకున్నాను. జ్ఞానం పెరిగేకొద్దీ అవమానాలు, అనుమానాలు అన్ని తగ్గాయి. ఇంగ్లీష్ మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం .అది కూడా నేర్చుకున్నాను. మా ఫ్రెండ్స్ బలాలు ,బలహీనతలు మార్చడంలో హేల్ప్ చేశాను. అందరూ ఇప్పుడు నాతోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు .
మొదట్లో భయపడ్డారు నాలో ఈ సడన్ చేంజ్ కి . నాకు దెయ్యం పట్టింది అనుకున్నారు అందరూ. ....కానీ వాళ్లకు తెలియదు కదా ! ఒక దయ్యమే నన్ను ఇంత మంచోడిగా మార్చిందని .
నన్ను ఎవరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిసింది. ఇప్పుడు నాకు నా ఫీలింగ్స్ విలువ తెలిసింది .మనిషి జీవితంలో ఏది వృధా కాకూడదు .డబ్బు, సమయం ,ఆహారం, మాటలు, కన్నీళ్లు, ప్రేమ వీటిని అవసరం ఉన్నప్పుడు ఉపయోగించడం వల్ల నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. మార్పు అనేది బయటినుంచి రాదు మన నుంచే మొదలవ్వాలని నాకిప్పుడే అర్థమైంది .
నిజానికి నాకు కృతజ్ఞతకీ కూడా కన్నీళ్లు వస్తాయానీ ఇప్పుడే తెలిసింది ” అని కన్నీళ్లు తూడుచుకుంటాడు.
“ నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ” అంటూ ఏదో సాధించినట్లుగా ఆత్మ ముఖంలో కనపడుతుంది.
“ సరేలే గాని చెప్పు జీవితం గురించి ఇన్ని తెలిసిన నువ్వు , ఎలా చనిపోయావు ?” అంటూ ఏదో అనుమానంగా అడిగాడు అతడు.
ఆత్మ తన కథని చెప్పడం మొదలు పెడుతుంది.
“ నిజానికి గతంలో నేను నీలాగే ఆలోచించి ఈ కొండపై నుంచి దూకి చచ్చిపోయాను. తర్వాత చచ్చి సాధించేది ఏమీ లేదని అర్థమైంది .ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఆకలి అవుతుంది కానీ తినలేము......నిద్ర వస్తుంది కానీ పడుకో లేను. ........కోరికలున్నాయి కానీ అనుభవించలేను............ఏడవాలని ఉంది కానీ కన్నీళ్లు రావడం లేదు .ఇలా ఉండటం చాలా కష్టంగా ఉంది. నా బాధ అంతా ఇంతా కాదు. అందుకే నిజమైన మహర్షి ఇటువైపుగా వస్తే ఆయన కాళ్ళ వేళ్ళ పడ్డాను. అలా పడితే నాకు ఒక సొల్యూషన్ చెప్పాడు.ఆత్మహత్య మహాపాపం దానికి విముక్తి కేవలం ఇంకొకరిని బ్రతికించడమే. నీ కారణంగా ఏ వ్యక్తి అయితే ప్రాణదానం, జ్ఞానదానం, కృతజ్ఞత అనేవి కలుగుతాయో అప్పుడు నీకు విముక్తి " అంటూ ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు . నీ కారణంగా నాకు అవి లభించాయి .నీకే నేను కృతజ్ఞతలు చెప్పాలి అంటూ ఆత్మ సంతోషంగా గాలిలో ఐక్యమైపోతుంది.
“ ప్రతి ఫెయిల్యూర్ కి సూసైడ్ మాత్రమే సొల్యూషన్ కాదు . ఫెయిల్యూర్ అనేది నువ్వు నిర్ణయించేది కానీ , నిన్ను నిర్ణయించేది కాదు. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది. ఇలాంటి మంచి అందరూ గ్రహించాలని ఇక సెలవు! ”
// సమాప్తము //