The shadow is true - 13 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 13

Featured Books
Categories
Share

నీడ నిజం - 13

 
13వ ఎపిసోడ్

ఈ వివరణ తో పన్నాలాల్ కు మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది . ప్రజల నమ్మకం, భక్తి ఓ రక్షణ కవచం లా అనుకొని అనుకున్నది సులభం గా సాధించవచ్చు . ఈ ప్రయత్నం లో తనకు అజయ్ సహకారం ఉంటె చాలు .

పనివారిని అడిగితే అజయ్ మేడమీద ఉన్నాడని తెలిసింది . తన మంత్రాన్గానికి అదే అనువైన చోటు అని అనుకుంటూ మెడ మెట్లు ఎక్కాడు పన్నాలాల్

స్వామి వేషం లో ఉన్న పన్నాలాల్ ను అజయ్ మొదట గుర్తించలేదు . గుర్తించిన తర్వాత అతడి అసాధారణ వేషం చూసి ఆశ్చర్య పోయాడు .

పెద్ద ఉపోద్ఘాతం లేకుండా ,నాన్చకుండా, సూటిగా అసలు విషయం వివరించాడు .

“అజయ్ బాబు ! నేను చెప్పేది ప్రశాంతం గా వినండి . మీరిప్పుడు పుట్టెడు దుఖం లో ఉన్నారు . ఈ స్థితి లో మిమ్మల్ని మానసికం గా కలవర పెట్టడం మహా పాపమే . కానీ, నా దృష్టి లో ఇంతకన్నా మంచి అవకాశం లభించదు , మనం చేసే పనిని ఆఖరికి ఆ భగవంతుడు కూడా చిన్న సాక్ష్యం తో నైనా నిరూపించలేడు .

ప్రజల నమ్మకం, భక్తీ మనకు రక్షణ కవచం .కాకపొతే---- నా ప్రయత్నం లో మీ పూర్తిసహకారం కావాలి . మీరు ప్రశాంతం గా వింటానంటే చెబుతాను . “ అజయ్ ముఖకవళికలు గమనిస్తూ చాలా జాగ్రత్తగా మాట్లాడాడు పన్నాలాల్ .

అజయ్ మౌనం గా తలూపాడు . “ మా గురువు గారు నాకో అపూర్వమైన విద్య నేర్పారు . ఒరిస్సాలో దేవతలకు నరబలులు ఇచ్చేవారు . ఈ విద్య సాయంతో తో తమ పని సులభం గా పూర్తీ చేసుకునే వారట. ఇది ఇప్పటి మాట కాదు . చరిత్ర పుటల్లో మరుగు పడిన సత్యం . ( దాదాపు నాలుగు దశాబ్దాలపై మాట . తమిళనాడు లోని ‘ కృష్ణస్వామి అసోసియేట్స్ ‘ అనే యాడ్ ఏజెన్సీ ఓ సుదీర్ఘ డాక్యుమెంటరీ ఫిలిం నిర్మించింది . ‘ indus valley to Indira Gandhi ‘ అన్న పేరు తో విడుదలైన అ చిత్రం లో పై సంఘటన వివరణాత్మకంగా గా చూపబడింది . )... నా వినయం, ఏకాగ్రత చూసి ముచ్చట పడి మా గురువు గారు నాకు ఆ విద్య నేర్పారు ... శబ్దం, ఆ శబ్దం తో పుట్టే అక్షరం చాల శక్తివంతమైనది . ప్రతి అక్షరానికి ఒక శబ్దం మూలం . ప్రతి మంత్రం లో అక్షరాలకు ఒక క్రమం ఉంటుంది . ఆ క్రమం వల్ల మంత్రానికి శక్తి వస్తుంది . ఆ శక్తి మన దేహం పై , మనసు పై ఎంతో ప్రభావం చూపుతుంది . అలాంటి అతి శక్తివంతమైన మంత్రం ఒకటి మెల్లగా, మంద్రస్థాయి లో మాటి మాటికీ పలుకుతూ ,కోమలా దేవి పై ప్రయోగించానంటే ఆమె నా మాటకే కట్టుబడి ఉంటుంది . నేను చెప్పిందే చేస్తుంది . ఈ ప్రయోగానికి తిరుగు లేదు . ఆమెను మీ అన్నగారి తో సహగమనానికి ఒప్పిస్తాను . మీ అన్నగారి చితి పై ఏ గొడవ చేయకుండా కూర్చునేలా పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను . చితి మంటల్లో ఆమె కాలి బూడిదవుతుంది . ఇక మనకు సమస్యే ఉండదు “. పన్నాలాల్ మాటలు ఆ నిశీధిలో వికృతం గా – కరాళ మృత్యువు నవ్వులా కరకరమన్నాయి .

అజయ్ పన్నాలాల్ ను నిశితం గా చూశాడు . అతడి కళ్ళకు పన్నాలాల్ మనిషి నెత్తురు జుర్రుకునే పిశాచిలా కనిపించాడు . ఆ చీకటి లో కూడా అతడి వికృతమైన ముఖ కవళికలు అజయ్ కు స్పష్టం గా కనిపించాయి .” నే ఆలోచన చాలా ప్రమాదకరమైంది పన్నాలాల్ ! మన ప్రయత్నం లో ఏ మాత్రం పొరపాటు జరిగినా నువ్వు , నేను ప్రాణాలతో మిగలం. అంటే కాదు --- మచ్చలేని మా రాజవంశం కీర్తి ప్రతిష్టలు , తరతరాల మా సంప్రదాయం అన్నగారి చితి మంటల్లో మాడి మసైపోతాయి . అమ్మ దృష్టిలో నేనో రాక్షసుడిగా మిగిలిపోతాను . విజయ్ నన్నుపురుగు కన్నా హీనంగా చూస్తాడు . వద్దు ! ఈ ఆలోచన అసలుకే మోసం తెస్తుంది . అన్నగారు పుణ్యాత్ముడు . ఆయన అంత్యక్రియలు ప్రశాంతంగా, పవిత్రం గా జరగనీ .”

అజయ్ మాటలతో పన్నాలాల్ కు నీరసం ముంచుకొచ్చింది . ‘ అన్నగారి మరణం తో అజయ్ బాబు చల్లబడిపోయాడు . అందుకే ఇంత ప్రశాంతం గా ఆలోచిస్తున్నాడు . ఎలాగైనా ఈ ఉన్మాదిని తనకు అనుకూలం గా మార్చుకోవాలి .

“ అన్నగారి మరణం తో కోమలాదేవి పై మీ పగ , ప్రతీకారం చల్లరాయా అజయ్ బాబు ? లేక నా సామర్థ్యం మీద నమ్మకం లేక అభ్యంతరం చెబుతున్నారా ?”

నీ సామర్థ్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది . నీ పట్టుదల , పనితనం నేను మొదటి రోజే గమనించాను . నిజం చెప్పాలంటే అన్నయ్య మరణం తో కోమల పై నా పగ వెయ్యింతలైంది. కేవలం ఇది సమయం కాదనే ఆలోచిస్తున్నాను ...అంతే”

అజయ్ పగిలే అగ్నిపర్వతం ల ఉన్నాడు . కళ్ళు బాధతో , కోపం తో , నిద్ర లేమితో అగ్ని గళాల్లా ఉన్నాయి . అతడి పరిస్థితి గమనించిన పన్నాలాల్ కు ఇంతకన్నా మంచి సమయం మళ్ళీ కలిసి రావటం కష్టమనిపించింది.

“ మీరిక ఆలోచించకండి . నా మీద నమ్మకం తో అడుగు ముందు కెయ్యండి. అన్నగారి మరణం తో మామయ్యగారు , విజయ్ బాబు పూర్తిగా కృంగిపోయారు . ముందు ముందు మనం చేసే ప్రయత్నం లో వారి సహకారం ఉండక పోవచ్చు . కోమలా దేవి విషయం లో వారి వైఖరి మారేందుకు చాల అవకాశం ఉంది . ఇప్పుడైతే ఎవరి ధ్యాస లో వారున్నారు . కనుక మన సాహసాన్ని పసి గట్టారు . అసలు ఆవగింజంతైనా అనుమానం రాకుండా చాల జాగ్రత్తగా పావులు కదుపుతాను . మీ కళ్ళ ముందే కోమలాదేవి బూడిద కావటం ఓ నాటకం లా గమనించండి .

పన్నాలాల్ తీరు చూస్తుంటే స్వయంగా క్షుద్రశక్తే హామీ ఇస్తున్నట్లు అనిపించింది అజయ్ కు. అతడు ఆలోచన లో పడి పోయాడు . పన్నాలాల్ కు ఈ మాత్రం వ్యవధి , అవకాశం చాలు అల్లుకుపోవటానికి .

“ మనకు సమయం చాల తక్కువ అజయ్ బాబు! ఇక ఆలోచించకండి అవుననండి. విజయం మీదే !” పన్నాలాల్ తొందర చేశాడు . మౌనం గా తలూపాడు అజయ్ సింహ . పన్నాలాల్ ఉత్సాహం గా అజయ్ సింహ్ ఏం చేయాలో చెప్పాడు . అజయ్ శ్రద్ధగా విన్నాడు. పన్నాలాల్ మెట్లు దిగి వెళ్లి పోయాడు .అతడు ఆనాటి తంతు పూర్తీ చేయాలి . క్షుద్రశక్తిని పన్నాలాల్ ఆవాహనం చేయవలసిన రోజు., కోమలాదేవి సహగమనం చేసే రోజు ఒకటే కావటం అతడి అదృష్టం . అజయ్ ఒంటరి గా మిగిలి పోయాడు .

“ నేను నీ చేతి లో కీలుబొమ్మ అనుకున్నావా పన్నాలాల్ ? ఇది ప్రమాదకరమైన పని అని తెలిసినా నీ సామర్థ్యం మీద నమ్మకం తో ఒప్పుకున్నాను . నువ్వీ పని మూడో కంటికి తెలియకుండా చేయగలవు. కానీ, నీకు తెలియని రహస్యం , నువ్వు కలలో కూడా ఊహించనిది కోమలా దేవి మరణం తర్వాత నీ మరణం నా చేతి లో రాసి పెట్టి ఉంది . నీ చావుతో కోమల పతనం శాశ్వతం గా సమాధి అవుతుంది . నేను లోకం దృష్టి లో నిరపరాధి గానే మిగిలిపోతాను . కాకపోతే ...ఒక్కటే బాధ --- కోమల సహగమనం పేరు తో అందరి దృష్టి లో దేవతగా నిలిచిపోతుంది .

త ప్పదు . ఒకటి కావాలనుకున్నప్పుడు . మరొకటి ఒదులుకోక తప్పదు. . ..” ఇలా సాగాయి అజయ్ ఆలోచనలు . ఒకరిని మించి మరొకరు . పన్నాలాల్, అజయ్ నెత్తురు తాగే తోడేళ్ళలా .. మృగప్రాయంగా మారిపోయారు

ఊరు మరింత మాటు మణిగింది. అంతటా శ్మశాన నిశ్శబ్దమే.

కొందరు శవ జాగరణ చేస్తూ అప్రమత్తం గా ఉన్నారు. గుడి పూజారి ఒకరు గీతా శ్లోకాలు పఠిస్తూ అర్థం వివరిస్తున్నారు. వయసు పండిన వారు ,జాగరణ చేస్తున్నవారు శ్మశాన వైరాగ్యం తో ఆలకిస్తున్నారు.

ఎక్కడో కుక్కలు అతి దీనం గా ఏడుస్తున్నాయి . “ జరిగిన ఘోరం చాలకనా మళ్ళీ ఏడుపులు మొదలు పెట్టాయి . “ ఎవరో కసిగా అన్నారు . ఆ మాటకు గీతా పఠనం చేస్తున్న పూజారి తలెత్తి చూశాడు .

గదిలో విక్రం తల్లి కలత నిద్ర లో కొడుకు ను పలవరిస్తోంది .పరామర్శిస్తోంది .బుజ్జగిస్తోంది. అదో విచిత్రమైన మానసిక స్థితి !

కోమల బొమ్మలా గోడకు జారగిలబడి ఉంది . రాహుల్ ఆమె ఒళ్ళో వాడిన‌‌‌ తీగెలా పడి ఉన్నాడు .

కాలం మరి కాస్త ముందుకు జరిగింది .గీతా పఠనం ముగిసింది . శవ జాగరణ చేస్తున్న వారు , వయసు ఉడిగిన పెద్ద వారు జోగుతున్నారు . అంత పెద్ద లోగిలి లో నిశ్శబ్దపు నిరంకుశ పాలన నిరాటంకంగా సాగిపోతోంది . సాధారణ నిశ్శబ్దం కాదు—భీతావహమై గుండెల్లో గుబులు పుట్టించే నిశ్శబ్దం .!

విక్రం తల్లి ఒళ్ళు తెలియని స్థితిలో నిద్రావస్థ లో ఉంది . కోమలా దేవి స్థితి లో మార్పు లేదు --- అలాగే జీవశ్చవం లా !

అజయ్ మెల్లగా అడుగులు వేసుకుంటూ కోమల ఉన్న గది ముందు నిలుచున్నాడు . లోపలి తొంగి చూశాడు . క్షణం ఆగి ,స్వరం కూడా తగ్గించి,”వదినా “ అన్నాడు .

కోమల ఉలిక్కిపడి అజయ్ ను నమ్మలేనట్లు చూసింది . అతడి నోటి నుండి ఈ పరిస్టితి లో ఈ సంబోధనా !

“మీరు శ్రమ అనుకోకుండా క్షణం ఇలా వస్తారా ?’ అజయ్ గొంతు లో మెత్తదనం .

కోమల మరేమీ ఆలోచించ లేదు . రాహుల్ బాబును మెల్లగా కింద పడుకోబెట్టి, తలగడ సరిచేసి అజయ్ ను అనుసరించింది .

అతడు అన్ని గదులు దాటుకొని కాస్త ఎడంగా ఉన్న గదిలోకి దారి తీశాడు . వెలుగు నీడలు దోబూచులాడుతున్న ఆ విశాలమైన లోగిలి లో వారి కదలికలు ఎవరూ గమనించలేదు .

 

*******************************************

కొనసాగించండి 14 లో