Those three - 36 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు - 36

Featured Books
Categories
Share

ఆ ముగ్గురు - 36

విహారి వెళ్ళిన అరగంట తరువాత ఆదిత్య సుఖదేవ్ ను కలిశాడు. సుఖదేవ్ ప్రశ్నార్థకంగా చూశాడు.
" నా పేరు ఆదిత్య" చేతులు జోడించాడు. క్లుప్తంగా అన్వర్ పరిస్థితి వివరించాడు. సర్దార్జీ కంగారు పడిపోయాడు.
" ఎంత ప్రమాదం జరిగింది. ? మరి....ఈ విషయం వెంటనే ఎందుకు నాకు చెప్పలేదు.? ఇప్పుడెలా ఉన్నాడు ? "
" మీరు కంగారు పడకండి. అతడు కోలుకుంటున్నాడు. తనే
మీకు చెప్ప వద్దన్నాడు. ఇలా కంగారు పడతారనే అతడి భయం."
" వాడి మొహం. వాడు మా ఆత్మ బంధువు. వాడికింత కష్టమొస్తే ఊరుకుంటామా ? ంం ఆదుకోవటం మా బాధ్యత కాదా ? ఇంతేనా వాడు మమ్మల్ని అర్థం చేసుకున్నది ? " సర్దార్జీ మాటల్లో బాధ , కోపం కలిసిపోయాయి.

" క్షణం ఉండండి. మా వాళ్ళందరికీ చెప్పి వస్తాను. అందరం ఒకేసారి హాస్పిటల్ కు వెళ్దాం " సర్దార్జీ లేవబోయాడు.
" ఇప్పుడే వద్దు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ తర్వాత అందరికీ చెప్పండి ".

అర్థం కానట్లు చూశాడు సర్దార్జీ .
" ప్లీజ్ ! స్పేర్ ఫైవ్ మినిట్స్ ".

" ఓకే . చెప్పండి."
" ఇక్కడ కాదు. బయటకు వెళ్దాం. ఏదైనా పార్క్ కు....."
మారు మాట్లాడకుండా బయలుదేరాడు సర్దార్ జీ. సాయంకాలం నాలుగు. పార్క్ లో రద్దీ పెరగలేదు. ఇద్దరూ ఎవరూ లేని చోట ఓ మూల కూర్చున్నారు.
" అనంత్ రామ్ మీకు ఎంత కాలంగా తెలుసు ?"
" దాదాపు ఏడాది నుండి. మా పెంట్ హౌస్ లోనే ఉంటాడు.
చాలా మంచి వ్యక్తి. పరోపకారి పాపన్న. మా అందరితో
బాగా కలిసి పోయాడు.

అంతగా మీ మనసులు గెలుచుకున్న వ్యక్తి ఒక ఉగ్రవాది అంటే నమ్ముతారా ?"
నెత్తి మీద పిడుగు పడ్డట్లు అదిరి పడ్డాడు సర్దార్జీ.
" మీరంటున్నది నిజమేనా ? అనంత్ ఉగ్రవాదా ?" తొలి తిరిగి పోయింది.
" అసలు పేరు అన్వర్. పీ.ఓ.కే మిలిటెంట్ క్యాంప్ ట్రైనీ.
సిటీ లో అతి గుట్టు గా సాగిపోతున్న ఒక డ్రగ్ రాకెట్ లో కీలక వ్యక్తి. " వివరాలు టూకీగా వివరించాడు ఆదిత్య.
సుఖదేవ్ రాయిలా చలనం లేకుండా ఉండి పోయాడు.
" అనంత్ రామ్ లా ఎంత బాగా నటించాడు ?"
" అనుభవం ఉన్న మీకే అనుమానం రాలేదు."
ఒక్క ఉదుటున లేచాడు సర్దార్జీ.
" అయితే ఆలస్యం ఎందుకు ? ఏ.సీ.పీ ఇంతియాజ్ కు అతడిని అప్పగించండి. "
" వెంటనే ఆ పని చేయలేను. అన్వర్ చెల్లెలు మెహర్ నా కొలీగ్. మంచి ఫ్రెండ్. అన్వర్ పారిపోయిన క్షణం నుండి వాళ్ళమ్మ అతడి కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకు తోంది. అన్వర్ ను తెస్తానని ఆమెకు మాట ఇచ్చాను. "
" అలాంటి సెంటిమెంట్ అన్వర్ విషయంలో చూపటం చాలా తప్పు. ఉగ్రవాదిలో మార్పు వస్తుందని భ్రమ పడకండి. వెంటనే ఇంతియాజ్ కు ఫోన్ చేయండి."
" అతడు ఉగ్రవాదే కాదనను . కానీ ఆక్సిడెంట్ తర్వాత మృత్యువు అంచు వరకు వెళ్ళి బయటపడ్డాక అతడి లో మార్పు వచ్చింది. నేను తన ప్రాణం కాపాడావు అన్న కృతజ్ఞత అతని ప్రతి మాటలో వినిపించింది.
పైగా అతడు ఆమాయకుల ప్రాణాలు తీసే మతోన్మాది కాదు.
పరిస్థితులే అతడిని మిలిటెంట్ ని చేశాయి. ఏ మాత్రం
అవకాశం వచ్చినా అతడు తప్పక మారుతాడు. ఆ అవకాశం మనమే ఎందుకు ఇవ్వకూడదు ? "
" ఆదిత్య చివరి ప్రశ్న సర్దార్జీ ని ఆలోచనలో పడవేసింది.
" మీరన్నది నిజమే. అతడు మతోన్మాది కాడు. పరిస్థితుల వల్లే మిలిటెంట్ గా మారాడు. సమతా సదన్ లో మాతో కలిసి ఉన్నప్పుడు మామూలు మనలాంటి మనిషి లాగానే
ప్రవర్తించాడు. మా ఎమోషన్స్, బాధలు, సెంటిమెంట్స్ మనస్ఫూర్తిగా పంచుకున్నాడు. శాస్త్రి గారి అమ్మాయి అమలను చూస్తే తన చెల్లెలు గుర్తొస్తుంది అన్నాడు. ఆ బాధలో నిజాయితీ ఉందని నాకిప్పుడు అనిపిస్తోంది "
కారు చీకట్లో ఓ వెలుగు రేక.

" మీకు ముందే చెప్పాను. అతడికి స్పృహ వచ్చిన తర్వాత ముందుగా మిమ్మల్నే గుర్తు చేసుకున్నాడు. మీకు జరిగినదంతా చెబుతానంటే వద్దన్నాడు. మీరు పెద్దవారు కంగారు పడతారని అతడి భయం . అంటే మీపై అతడికి
గౌరవముంది. మీ పెద్దరికం మీ పెద్ద మనసు మీద గౌరవం ఉంది. మీరు నాపై నమ్మకం ఉంచి కాస్త
అతడిలో తప్పక మార్పు తేగలను. తల్లీ కొడుకులను కలపగలిగితే చాలు. మనం విజయం సాధించినట్లే. " ఆదిత్య లో ఆతృత.
సర్దార్జీ ఆదిత్య ను ప్రసన్నం గా చూశాడు.
" మీ ఆరాటం , కమిట్మెంట్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీకే మాత్రం సంబంధం లేని , ప్రయోజనం లేని విషయం లో తపన పడుతున్నారు. మీలాంటి వారికి
తప్పక సహాయం చేయాలి. నా వంతు బాధ్యతగా నేనేం చేయాలో చెప్పండి. సర్దార్జీ లో ఉత్సాహం ఉరకలు వేసింది.
అతడి పాజిటివ్ రెస్పాన్స్ కు ఆదిత్య తృప్తి గా నిట్టూర్చాడు.
అప్పుడు సమయం సాయంకాలం అయిదు.

*************************************************
కొనసాగించండి 37 లో