తన పరిస్థితికి కరువుతీరా ఏడవాలనిపించింది . బాధను పంచుకునే నేస్తం అలీ దూరమయ్యాడు . రహీమ్ తన వింగ్ లీడర్ రోబో లాంటి వాడు . బిజినెస్ తప్ప మరో విషయం మాట్లాడడు . అతడికి ఇచ్చిన శిక్షణ అలాంటిది . అన్వర్ ఇంటి వరకు వెళ్ళే సాహసం చేయలేదు . తల్లితండ్రుల మొహం చూసే ధైర్యం లేదు . పైగా తన మీద గట్టి నిఘా ఉంది . ఇంటికి వెళ్ళి , తన ఉనికి డిపార్ట్మెంట్ కు తెలిసి తను పట్టుపడితే , తల్లిదండ్రులకు సమాజం లో స్థానం ఉండదు . తనకు జీవితమే ఉండదు . అందుకే ఆ ప్రయత్నం చేయరాదనుకున్నాడు . ఆ రోజు పెద్దగా పని లేదు . సాయంత్రం వరకు అడ్డదిడ్డంగా ఊరంతా తిరిగి అర్థరాత్రి ఇల్లు చేరుకున్నాడు . విశ్వనాధ శాస్త్రి ఇంట్లో శాస్త్రి, సునీత , అమల దిగాలుపడి కూర్చుని ఉన్నారు . ఇల్లు నిశ్శబ్దంగా ఉంది .
అన్వర్ ను చూడగానే అమల ఒక్క పరుగులో అతడి దగ్గరకు వచ్చింది . అన్నయ్యా " అంటూ బావురుమంది . అన్వర్ కంగారు పడి పోయాడు . " ఏమైందమ్మా ?"
" తమ్ముడు అమ్మ తిట్టిందని ఉదయం అనగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు . ఇంతవరకు రాలేదు ." కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది .
" పెద్దగా ఏమీ అనలేదు అనంత్ ! ఎందుకు రా ప్రతిదానికి అక్కను ఏడిపిస్తావు అని గట్టిగా అంది. అంతే మాట మాట పెరిగింది . వాడు పిచ్చి కోపం లో మాట తూలాడు .
ఈవిడ చేయి చేసుకుంది . వాడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు . ఇంతవరకు రాలేదు . విశ్వనాధం జరిగినది మూడుముక్కల్లో చెప్పాడు, కొడుకు కనిపించక పోవడం తో డీలా పడిపోయాడు . ఆనాటి తన పరిస్థితి కళ్ళ ముందు మెదిలింది అన్వర్ కు . సునీతను చూశాడు , రాజు, రెహమాన్ , సుఖదేవ్ ల అర్థాంగి త్రయం ఆమెను ఓదార్చే విఫల ప్రయత్నం చేస్తున్నారు .
సునీత శోకదేవతలా ఉంది . ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఇంకి పోయాయి . ఆమెను కదిలించాలంటే అన్వర్ కు భయంగా ఉంది . అన్వర్ ను చూడగానే ఒక్క ఉదుటు న దగ్గరకు వచ్చింది . మాటల్లేవు . వట్టి బేలచూపులే . విశ్వనాథం వాళ్లీ ద్దరి దగ్గరకు వచ్చాడు . " రాజు , రెహమాన్ జీ , సుఖదేవ్ జీ వాడిని వెదికే పని లో ఉన్నారు . మా టీచర్లు కూడా . నేనే కాలు చేయి ఆడక మీ అక్కయ్యాను ఓదారుస్తూ కూర్చున్నాను. అయినా ఈ మహానగరం లో ఎక్కడని వెదకటం ?" శాస్త్రి గారి కళ్ళల్లో మరో మారు నీళ్ళు సుళ్ళు తిరిగాయి . తుడుచుకున్నాడు . అన్వర్ కు తన తల్లిదండ్రులు మరోసారి గుర్తుకొచ్చారు . తను కనిపించకుండా పోయినప్పుడు ఇలాగే నరకం చూసి ఉంటారు . సునీత లో ఆనాటి ఆమ్మీజాన్ స్పష్టం గా కనిపిస్తోంది .
" ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మీ అక్కయ్యకు నీ మీదే నమ్మకం. నే కోసమే చూస్తోంది . నీకోసం చాలాసార్లు ఫోన్ చేశాం . స్విచ్ ఆఫ్ అని వచ్చింది " విశ్వనాధ శాస్త్రి అర్థం కానట్లు చూశాడు . నుదురు కొట్టుకున్నాడు అన్వర్. ఊరంతా బలాదూర్ గా తిరుగుతూ డిస్టర్బ్ కాకూడదని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు తను .
క్షణం ఆలస్యం చేయలేదు . వెంటనే రహీమ్ కు ఫోన్ చేశాడు .
" వివరాలు మనం కలిసినప్పుడు చెబుతాను. నాకు అర్జెంట్ గా ఒక బైక్ కావాలి . ట్యాంక్ ఫుల్ చేసి పంపించు . పది నిమిషాల్లో మన సెంటర్ కు వస్తాను ."
" అక్కా ! నందూ తోనే తిరిగొ స్తాను ." సుడిగాలిలా వెళ్ళిపోయాడు .
తెల తెలవారుతుండగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ మెట్టు మీద జోగుతున్న నందకుమార్ ను చూశాడు . షాపులన్నీ మూసి ఉన్నాయి . ఆ కాంప్లెక్స్ కారిడార్ లో నిశ్శబ్దం తాండవిస్తోంది . బండి శబ్దం తో ఉలిక్కిపడి లేచాడు నందు . అన్వర్ ను చూడగానే సుడిగాలిలా వచ్చి వాటేసుకున్నాడు . తెరలుతెరలుగా తన్నుకొస్తున్న ఏడుపు .``శబ్దం బయటకు రావటం లేదు . వెక్కిళ్లు తప్ప. కాసేపు ఓదార్పుగా వీపు నిమురుతూ ఉండిపోయాడు .
"పద" కదిలాడు అన్వర్.
' అమ్మ" భయంతో. సందేహం తో ఆగాడు నందు .
" అమ్మంటే అంత భయమా ? మరి చెప్పకుండా పారిపోయావు .? అమ్మ అక్కడ గుండె పగిలేలా ఏడుస్తోంది . వేషాలు వద్దు . బండెక్కు " కొంచెం కటువుగానే అన్నాడు. పిల్లిలా అడుగులో అడుగులేసుకుంటూ వచ్చి అన్వర్ వీపుకు అటుక్కు పోయాడు . బండి బాణం లా ముందుకు దూసుకెళుతుంది ,
అరగంట లో సమతా సదన్ చేరుకున్నరు . వరండా లో వాలుకుర్చీ లో సుఖదేవ్ జీ జోగుతున్నాడు . సగం మడ చిన బెడ్ షీట్ మీద . నిద్ర సుఖమేరుగాడు అన్నట్లు రెహమాన్ గుర్రు పెడుతున్నాడు . రాజు గోడకు జారగిలపడి కునుకుపాట్లు పడుతున్నాడు . శాస్త్రి వాటా ముఖద్వారం కొంచెం తెరిచే ఉంది . లోపల హాల్లో ఉన్నవారి పరిస్తితి బయట వారికి మల్లే ఉంది . మగతకు, మె లుకువకు మధ్య త్రిశంకు స్వర్గం లో ఉన్నారు . ఏడ్చి, ఏడ్చి అలసిన సునీత ఒళ్ళు తెలీని స్థితి లో ఉంది .
ఈ ఉద్విగ్న పరిస్తితి లో నిద్ర ఆమెకు ఒక వరం.
దగ్గరకు వెళ్ళి మెల్లగా ' అక్కా' అన్నాడు అన్వర్ . ఆ చిరు సవ్వడికే ఉలిక్కిపడి లేచింది సునీత .
" నందు" గుమ్మం దగ్గర బిత్తర చూపులు చూస్తున్న నందును చూపాడు అన్వర్ .
అంతే .. ఒక్కసారిగా వాతావరణం లో మార్పు వచ్చింది . సునీత నందును వాటేసుకోవటం, వాడు వలవల ఏడవటం , అందరూ తేలికైన మనసులతో వారిద్దరి చుట్టూ చేరటం , అన్వర్ పై అందరి ప్రశంశల జల్లు .. అన్నీ అతి సహజం గా వరుస క్రమం లో జరిగిపోయాయి .
ఈ మొత్తం సన్నివేశాల అనుభూతుల్ని ఆనాటి తన పరిస్తితికి అన్వయించుకున్నాడు అన్వర్ .
తల తిరిగి పోయింది .ఎంత ప్రేమను, అనుభూతిని పోగొట్టుకున్నాడు తను .
ఎంత బాధను గుండె బరువును తన వాళ్ళకు మిగిల్చాడు .
ఇన్నాళ్ళు వెనకడుగు వేయిస్తున్న సందేహాలు గాలికేగిరె దూదిపింజెల్లా తేలిపోయాయి . ఇంటికి తిరిగి వెళ్లాలన్న కోరిక అన్వర్ మనసులో హిమాలయం లా పెరగసాగింది