Love Life and Vitamin M - 2 in Telugu Short Stories by Nagesh Beereddy books and stories PDF | Love, Life and Vitamin M - 2

Featured Books
Categories
Share

Love, Life and Vitamin M - 2


రెండో కథ : నమ్మకం

ఒక చెరువు అలుగు పోస్తున్నది.

దాని దగ్గర ఒక అమ్మాయి, అబ్బాయి ఆడుకుంటున్నారు.

అబ్బాయికి ఇసుకలో చాలా రంగు రాళ్ళు దొరికాయి.

అమ్మాయికి మాత్రం ఒక్కటీ దొరకలేదు. కానీ, ఆమె దగ్గర ఇంటి నుంచి తెచ్చుకున్న రవ్వ లడ్డూలు చాలా ఉన్నాయి.

అబ్బాయికి ఆశ కలిగింది.

"నేను నీకు ఈ రంగు రాళ్ళన్నీ ఇస్తాను. నువ్వు నాకు నీ లడ్డూలన్నీ ఇచ్చేస్తావా?" అని అమ్మాయిని అడిగాడు అబ్బాయి. 

అందుకు అమ్మాయి ఒప్పుకుంది. 

అబ్బాయి ఒక రాయి దాచుకుని మిగిలిన రాళ్లన్నీ ఇచ్చేశాడు.

అమ్మాయి మాత్రం మొత్తం లడ్డూలు ఇచ్చేసింది.

ఆ రోజు రాత్రి.. అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోయింది.

ఆమెది నమ్మకం. పూర్తి విశ్వాసం.

అబ్బాయికి మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టలేదు. 

ఎందుకంటే, తను ఒక రాయి దాచుకున్నట్లే.. ఆ అమ్మాయి కూడా ఒక లడ్డూ దాచుకుని ఉంటుందేమోనని అతని అనుమానం.

ఇలాగే మనం ఎవరిని ఎంత వరకు నమ్ముతున్నామో మనకే సరైన అవగాహన లేకుండా బతికేస్తుంటాం. అనవసరమైన అనుమానాలతో మంచి మంచి బంధాలను పాడు చేసుకుంటుంటాం.

అందుకే మనం ఎవరినైనా నమ్మితే పూర్తి విశ్వాసంతో నమ్మాలి.

అనుమానం, సందేహం ఉంటే ప్రారంభంలోనే తెంచుకోవాలి. తేల్చుకోవాలి. 

అది ఏ బంధమైనా సరే. 

విశ్వాసం, నమ్మకం ఉంటేనే ఆ మైత్రితో మేలు కలుగుతుంది.. 

ప్రేమకు నమ్మకం పునాది.

అనుమానం సమాధి. 


మూడో కథ : (అప) నమ్మకం

ఒక జంతు ప్రదర్శన శాలలో పెద్ద ఏనుగు కట్టేసి ఉంది. 

ముందు కాలుకి చిన్న తాడు వేసి బంధించారు దానిని. 

ఒక నడి వయస్కుడు దాన్ని గమనించాడు.

"అరే.. ఇంత పెద్ద ఏనుగును అంత చిన్న తాడుతో ఎలా బంధించారు?" అని అనుమానం వచ్చింది అతనికి.

"ఏనుగు బలంగా లాగితే ఆ తాడు తెగిపోతుంది. కానీ, అది అలా చేయడం లేదేంటి?" అనే సందేహం కూడా కలిగింది అతనికి.

ఆ ప్రదర్శన శాలకు సంబంధించిన ఓ వ్యక్తిని పిలిచి "ఏనుగు తెంపుకొని పోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు" అని అడిగాడు.

అందుకు ఆ వ్యక్తి "ఆ ఏనుగును ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచీ అలాంటి తాడుతోనే కట్టేశాం. అప్పుడు అది తెంపేసేందుకు ప్రయత్నించేది. కానీ, తాడు తెగేది కాదు. ఇక ఈ తాడుని తెంపలేనని దానికి అర్థమై పోయింది. ఏనుగుతో పాటు ఆ నమ్మకం కూడా అలా పెరిగి పోయింది. ఇప్పుడు అది తెంపగలిగి ఉన్నా కూడా, ఆ (అప)నమ్మకం అలా ఉండిపోవడం వల్ల తెంపదు. అది ఎప్పటికీ అలా ప్రయత్నించదు" అని వివరించాడు.

అది విని ఆ నడి వయస్కుడు ఆశ్చర్యపోయాడు.

ఏనుగు పరిస్థితి చూసి జాలి పడ్డాడు. కొన్ని పనికిరాని బంధాలను తెంపుకో గలిగి ఉండి కూడా పరిస్థితుల మధ్య ఇరుక్కు పోయిన ఏనుగులో తనని తాను చూసుకున్నాడు.

ఆ ఏనుగులాగే మనలో కూడా చాలామంది "మనం చెయ్యలేం" అనే (అప) నమ్మకంలో బతికేస్తుంటారు. చాలా మంది ఎప్పుడో ఏదో చెయ్యాలని ప్రయత్నించి, ఓడిపోయి ఉంటారు. అది అప్పుడు సాధ్యం కాలేదని వదిలేసి, ఇక ఇప్పుడు ప్రయత్నించడం మానేసి ఇంకో ఏదో పనిలో ఇరుక్కుపోయి బతికేస్తుంటారు..

తమ కలల్ని, ప్రయత్నాల్ని పక్కన పెట్టేసి ఇలా ఈ ఏనుగులా.. 

-

నాలుగో కథ : అదృష్టం

ఒక పూల పొద ఉంది.

దాని పక్కనే ఒక ముళ్ళ పొద కూడా ఉంది.

సహజంగా తేనె టీగలు దేని మీద వాలతాయో మన అందరికీ తెలుసు.

అలాగే, ముళ్ల పొదను ముట్టుకుంటే ఏమవుతుందో కూడా తెలుసు.

అవి మొక్కలు కాబట్టి మొత్తుకోవు.

అదే మనమైతే..?

పూల పొద అదృష్టం చేసుకుందని, ముళ్ళ పొదకు దురదృష్టం పట్టిందని అనుకుంటాం.

పూలు ఆకర్షిస్తాయి.

ముళ్ళు గుచ్చుకుంటాయి.

ఈ విషయం వాటికి తెలియక పోవచ్చు.

కానీ, వీటివల్ల, వీటి చుట్టూ జరిగేవి ఎప్పుడు ఎలా జరగాలో, అప్పుడు అలాగే జరుగుతాయి. జరుగుతున్నాయి కూడా..

అలాగే, మన జీవితంలో ఏది జరగాలన్నా అది మనవల్లే  జరగాలి. జరగాల్సిందే.

ఒక కుండలో ఒక బంగారు నాణెం ఉంది. 

ఇంకో కుండలో రెండు ఉన్నాయి. 

ఆ రెండు కుండల్లో ఏదో ఒక దాన్ని మిమ్మల్ని ఎంచుకోమ్మన్నారు.

మీరు మొదటిది ఎంచుకున్నారు.

ఇంకొకరు రెండోది ఎంచుకున్నారు.

ఇప్పుడు ఎవరు అదృష్టవంతులో, ఎవరు దురదృష్టవంతులో మీకు అర్థమయ్యే ఉంటుంది.

కానీ, అలా చేసుకున్నది ఎవరు? 

ముట్టుకున్నది, పట్టుకున్నది మీరే కదా?!

అంతేగానీ, రంగు రాళ్ళ వల్లనో, ఇంకోదాని వల్లనో మనకు అదృష్టం రాదు. అలా వచ్చేదే అయితే.. రాళ్ళు అమ్ముకునేవాడు.. ఎప్పుడో కోటీశ్వరుడై ఉండాలి కదా?

మరి కావడం లేదే??

అందుకే..

అదృష్టం అంటే..

నైవ దృష్టమిత:పూర్వం తదదృష్టమితీర్యతే.. - అని ఓ పురాణ వాక్యం ఉంది.

దీన్ని బట్టి.. దృష్టి అంటే మనం చూడగలిగింది. 

అదృష్టం అంటే మనం చూడలేనిది.

కొన్ని కాకతాళీయంగా జరుగుతాయి.

కొన్ని యాదృచ్చికాలు.

ఏది ఎలా జరిగినా.. మీలో ఏం జరుగుతుందో.. మీ చుట్టూ ఏం జరుగుతుందో.. మీ అదుపులో పెట్టాల్సింది.. అవకాశాల్ని పట్టాల్సింది మాత్రం మీరే.

అదే అదృష్టం అంటే.