Those three - 16 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు - 16

Featured Books
Categories
Share

ఆ ముగ్గురు - 16

జనవరి నెల ఉదయం ఏడైనా బాలభానుడి నునులేత కిరణాలు భాగ్యనగరం పై ప్రసరించలేదు . నగరం ఇంకా చలిదుప్ఫటి ముసుగులో జోగుతూనే ఉంది . సిక్స్ లైనర్ హైవే - రద్దీ అంతగా లేదు . ఇంతియాజ్ ఫోర్ వీలర్ మెల్లగా ముందుకు సాగుతోంది. అతడి ఆలోచనల అలజడి కారు వేగాన్ని నియంత్రించ గలిగింది . " ఆపరేషన్ జన్నత్ లక్ష్యం ఏమిటి ? ఈ ప్రశ్న అతడిని ఓ పట్టాన వదలడం లేదు.
ఆ రోజు జనవరి పన్నెండు. నేషనల్ యూత్ డే . వివేకానందుని పుట్టినరోజు . ఇంతియాజ్ కారు ఓ కాలనిలో ప్రవేశించింది . కాలనీ లోని కమ్యూనిటీ ప్లేస్ లో వివేకానందుని జయంతి సభ జరుగుతోంది . షామియానా ముందు వివేకానందుని నిలువెత్తు ఫ్లెక్స్ బ్యానర్ అందరి దృష్టిని అయస్కాంతం లా ఆకర్షిస్తోంది .
కాషాయి లుంగీ లో చేతులు కట్టుకుని నిశితంగా చూస్తున్న
ఆ కళ్ళలోకి దీక్ష గా చూడటం కష్టం. జ్యోతుల్లాంటి ఆ కళ్ళు మన హృదయాలను తరచి చూస్తాయి .
సాధారణంగా రామకృష్ణ మిషన్ సభలకు విద్యావంతులు
రామకృష్ణుని తాత్విక చింతనలో ఆసక్తి వున్నవారు వస్తారు.
స్వాముల సభల్లా సామాన్య జనసందోహం తో సందడిగా ఉండవు . వక్తల భావప్రకటనలో ఉద్వేగం ఉండదు. వారు తమ వాగ్ధార తో సభికులను ఓ ట్రాన్స్ లో తీసుకెళ్ళే ప్రయత్నం చేయరు . ప్రశాంతంగా, హేతుబద్ధంగా మాట్లాడుతూ మనల్ని ఆలోచింపజేస్తారు . ప్రస్తుత సభలో అదే వాతావరణం .
ఇంతియాజ్ కారును దూరంగా ఆపారు . సభా ప్రాంగణం దగ్గరకు వచ్చి నిలుచుని ఉపన్యాసం వింటున్న గుంపులో
కలిసిపోయాడు.
ఆ సభకు సంబంధించి అతడికి నచ్చిన మొదటి అంశం క్రమశిక్షణ . ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అతి సాధారణంగా ఉన్న ఆ సభలో అందరూ ప్రశాంతంగా కూర్చుని వక్త చెప్పే విషయాలు శ్రద్ధగా వింటున్నారు . శీతల వాయువులు తెరలు తెరలుగా వారిపై దాడి చేస్తున్నా పట్టించుకోవడం లేదు . వక్త వయసు మూడు పదులు దాటి ఉంటుంది . చామన ఛాయ వర్ణం, చురూకొన చూపులు . తెలుగు, ఆంగ్లం రెండింటిలోనూ మంచి పట్టుంది . భావ వ్యక్తీకరణ లో కప్పదాట్లు, డొంకతిరుగుళ్ళు లేవు . సూటిగా, స్వచ్ఛంగా అతడి భావాలు అందరి మనసులను తాకుతున్నాయి .
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా స్వామి జయంతి జరుపుకుంటున్నాం. ఆయన్ను తలచుకుటున్నాం. అంతే
వచ్చే జయంతి వరకు గుర్తుకు రాడు .ప్రతి యువకుడు వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అదే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి. " ప్రతి వక్త చెప్పేది ఇంతే. కానీ అందుకు ప్రయత్నం ఏది ? స్వామి ఆదర్శాలు పాటించాలంటే ముందు అవేమిటో తెలుసుకోవాలి కదా ! తెలుసుకోవాలంటే ముందుగా గురువు గారు శ్రీరామ కృష్ణుని జీవిత చరిత్ర ను,. ఆయన బోధనామృతాన్ని, భక్తుల
అనుభవాలను మనసు పెట్టిన చదవాలి . ఆ దిశలో శ్రీరామకృష్ణుని తాత్త్విక చింతన తో పరిచయం ఏర్పడుతుంది. మీకు మీ గమ్యం లో కొంత స్పష్టత వస్తుంది . అప్పుడు స్వామి చరిత్రను , ఆయన సందేశాలను దీక్ష గా అధ్యయనం చేయండి . ఆ సమయంలో మీకు చేరువలో ఉన్న శ్రీరామకృష్ణ గురుదేవుల ధ్యాన మందిరం లో ప్రతి రోజూ కొంత సమయం ధ్యానంలో గడపండి . అప్పుడు తప్పక మీరు ఆశించే' సంకేతం' మీకు తప్పక స్ఫురిస్తుంది. మీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం తప్పక మానవ సేవలో ఉన్న దైవత్వాన్ని , తృప్తి ని , ఆనందాన్ని తెలియజేస్తుంది. మానవ సేవే మాధవ సేవ అన్న గొప్ప సత్యం అనుభవ పూర్వకంగా తెలిసిన క్షణం లో మీరు పొందే ఆనందం ప్రపంచంలో మరే అనుభవానికి, అనుభూతికి సాటిరాదు . వసుధైక కుటుంబం అన్న భావనతో మీ జీవితం ధన్య మవుతుంది. "
ఇంతియాజ్ చాలా దీక్షగా వింటున్నాడు .
" విదేశాల్లో లక్షలు సంపాదిస్తూ ఉన్నత పదవుల్లో ఉన్న యువకులు మాతృదేశాన్ని మరిచిపోలేదు . తమను ఇంతవారిని చేసిన స్వదేశానికి ఏదో ఒక రూపంలో సేవలు అందిస్తున్నారు . విద్య, వ్యవసాయం, గ్రామాభ్యుదయం---
ఇలా ఎన్నో రంగాలలో తమ వంతు బాధ్యత త్రికరణశుద్ధిగా
పాటిస్తూ అసలైన ఆత్మ తృప్తి ని , ఆనందాన్ని పొందగలుగుతున్నారు . కొందరైతే ఆ విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని సొంత ఊరి ఋణం తీర్చుకుంటున్నారు. మన సమాజంలో కూడా చాలా మంది యువకుల్లో ముఖ్యం గా I.I.T సంస్థల్లో చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు సేవా గుణం లోని గొప్పదనం గుర్తిస్తున్నారు. నేడు భారతం యువశక్తి తో పరిపూర్ణంగా ఉంది . ఈ యువతకు దిశానిర్దేశం చేయగలిగితే ఈ దేశం అన్ని విధాలా సుసంపన్నం అవుతుంది . కాని ఉగ్రవాదం ఈ దేశానికి శాపమైంది. ఉన్మాదం ఏ మతానిదైనా ఖండించవలసిందే .
ఇందులో స్వపర బేధాలు పాటించరాదు . కానీ ఒక మతం ఉగ్రవాదులు ఈ దేశాన్ని పాతాళానికి త్రొక్కి వేయ డానికి క్రొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. యువకుల బలహీనతలపై దాడి .
ఇందువల్ల కోట్లు సంపాదించుకోవచ్చు. యువకుల్ని దారి మళ్ళించి ఎందుకూ పనికి రాని వారు గా మార్చవచ్చు . టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్. మత్తు....అది ఏ రూపంలో ఉన్నా మనిషి మనసును శరీరాన్ని శిధిలం చేసి చివరకు మృత్యువు వరకు తీసుకెళుతుంది. మత్తు పదార్థాలలో అన్నింటికన్నా భయంకరమైనది నార్కోటిక్స్. ఒక్కసారి రుచి చూస్తే చాలు మరి జన్మలో వదలలేరు. నూటికి నూరుపాళ్లు ఆ మత్తుకు కట్టు బానిసవుతారు. సమయానికి ఆ డ్రగ్ పడకపోతే వారైనా చస్తారు లేక పోతే చంపుతారు. ఈ దశ చివరిది. "
ఇంతియాజ్ కు ఆపై వినే ఓపిక,కుదురు లేకపోయాయి . అతడి మనసులో ఐరన్ వాల్ తునాతునకలైంది . " ఆపరేషన్ జన్నత్" లక్ష్యం యువకుల్ని నాశనం చేయటం. మారల్ డిగ్రడేషన్ మరియు క్యారెక్టర్ అశాసినేషన్ ఆఫ్ నాన్ ముస్లిం యూత్. మారణహోమం కన్నా భయంకరమైనది. మనిషిని, మనసును చిత్రవధ చేసి చంపుతుంది. సంవత్సరం దాటినా ఈ డ్రగ్స్ రాకెట్ వెలుగు చూడలేదంటే చాలా రహస్యం గా పద్ధతి గా జరుగుతోంది. ఎక్కడా ఏ తప్పుకు అవకాశం ఇవ్వకుండా కొన్ని సర్కిల్స్ లో మాత్రమే డ్రగ్స్ వ్యవహారం జరుపుతున్నారు. వాళ్ళ టార్గెట్ సామాన్యులు కారు. కచ్చితంగా ఉన్నత వర్గం వారే . పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకునే బంగారు పిచ్చుకలు వీరి కస్టమర్స్ . చేతినిండా డబ్బు. ఒంటినిండా అహం , అంతులేని స్వేచ్ఛ. యువకుల్ని సులభంగా ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసను చేస్తాయి . ఈ వ్యాపారం లో అనుకున్నది సులభంగా సాధించవచ్చు . కాసులు రాసుల్లో మూట కట్టుకోవచ్చు . వక్త విముక్తానంద ఊహించింది అక్షరాల నిజం . టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్ .!!!
ఉత్సాహం రెట్టింపు కాగా పరుగు లాంటి నడకతో కారు దగ్గరకు వచ్చాడు . కారు డోరు తెరిచి కూర్చోబోతూ క్షణం ఆగాడు . వివేకానందుని మూర్తిని ప్రసన్నం గా చూశాడు . " ధ్యాంక్యూ స్వామి " ఇంతియాజ్ స్పందన . కారు వేగంగా హెడ్ క్వార్టర్స్ వైపు పరుగులు తీసింది . " వెంటనే విహారిని కలిసి 'ప్లాన్ ఆఫ్ యాక్షన్' రెడీ చేయాలి .
కొనసాగించండి 17