Kshantavyulu - 11 in Telugu Moral Stories by Bhimeswara Challa books and stories PDF | క్షంతవ్యులు - 11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

క్షంతవ్యులు - 11

క్షంతవ్యులు – Part 11

చాప్టర్ 27

మరునాడు ఉదయాన్నే కాశీ చేరుకున్నాము. ఇల్లు దొరికేవరకూ ఏదైనా హోటల్లో వుందామన్నాను కాని యశో ఒక ఆంధ్ర ఆశ్రమం వైపు మొగ్గు చూపింది. త్వరలోనే గంగ ఒడ్డున ఒక మూడు గదుల ఇల్లు . కొనుక్కుని అందులోకి మకాంమార్చాము.

‘‘మనకి రెండు గదులు చాలు. ఒకటి వంటకి, మరొకటి పడకకి, మూడోది ఏం చేద్దాం చెప్పండి?’’ అంది యశో పాలు పొంగిస్తూ.

ఆప్రశ్న కి సమాధానము తన కెంత తెలుసో నాకూ అంతే తెలుసు.

ప్రతిరోజు సూర్యోదయవేళ మేమిద్దరం కలిసి గంగాస్నానం చేసే వాళ్ళం. వారానికొసారి సాయంకాలం బోటు మీద గంగపై విహరించేవాళ్లం. అన్నిటి కన్నా నాకు అదే నచ్చింది. అప్పుడప్పుడు ఒక రాత్రికి బోటు అద్దెకు తీసుకుని రాత్రంతా అందులోనే గడిపేవాళ్లం.

అన్నివేళలా మాయిద్దరి జీవన బాట ఒకటైనా, కాశీ విస్వేస్వరుడి కొలువులో మాత్రం మాది వేరే దారి.

యశో ఆ దైవం ఎదుట అరమోడ్పు కన్నులతో తన్మయిస్తే నేను తనను పరవసిస్తూ చూసే వాడిని.

‘‘దేముడి నుంచీ నీవు ఏమి కోరుకుంటావు అమ్మీ,’’ అని అడిగాను ఒకసారి.

‘‘మీ కంటే ముందు నన్ను తనదరి చేర్చుకోమని,’’ అంది పూజ చేసిన పుష్పాల్లో ఒకటి జడలో తురుముకొంటూ.

“ప్రాపంచక విషయాల్లో లేని స్వార్ధం, ఆధ్యాత్మిక బాటలో ఎందుకు యశో?" అన్నాను.

యశో జవాబివ్వలేదు, బహుశా నా ప్రశ్నకు ఆమె సమాధానం వెదుక్కుంటోందేమో.

యశోకి చెప్పకుండా అదే రోజు మధ్యాన్నం నేను ఒక వంగపండు రంగు బనారస్ సిల్క్ చీర

కొనుక్కొచ్చాను.

"నచ్చిందా అమ్మీ?" అన్నాను చీర కొంగు విప్పిచూపిస్తూ.

"చాల బాగుంది, అమ్మవారికని కొన్నారా ఇంతలో ఎంత భక్తి పుట్టుకొచ్చింది మీకు," ఆ చీర తీసుకుని నవ్వుతూ అంది .

"అమ్మవారికి కాదు అమ్మీ, నా దేవత కోసం," అన్నాను.

ఆ చీర పట్టుగుని సంతోషంగా మా మూడో గదిలోకెళ్లి, దానిలో సంతృప్తితో వచ్చి నాకు కనుల పండగ చేసింది.

"ఆశీర్వదించండి," అంది నాకు పాదాభివందనం చేస్తూ.

"ఏమని?" అన్నాను తన తలమీద నా చెయ్యి ఉంచి.

"మీకు తోచినది," అంది తల పైకెత్తి నా కళ్ళలోకి చూస్తూ..

"సదా సుఖీభవ," అన్నాను.

"నా ట్రాప్ లో పడ్డారు," అంది లేచి నవ్వుతూ.

"అదేం మాట అమ్మీ," అన్నాను.

"అంటే ఇంక నన్నెప్పుడు కష్టపెట్టరనేగా మీ ఆశీర్వాద అంతరార్దం," అంది.

"నిన్నుసుఖపెట్టలేక పోతున్నానన్న భాధ నన్నెప్పుడూ వేధిస్తూంది అమ్మీ," అన్నాను.

"ఉపశమనానికి మీకెప్పుడూ నా చీర చెంగు ఉందిగా," అని యశో ఆ చీర కొంగుని నామెడకు చుట్టింది.

"అయితే, ఎడ్లబండిలో నీది బూటకపు నిద్రన్నమాట," అన్నాను దాన్ని బిగించుకోబోతూ.

తన చీర కొంగు లాక్కుని నవ్వుకుంటూ యశో వంటిట్లోకి వెళ్ళిపోయింది.

కొంత కాలానికి యశో బలవంతం మీద తీర్ధయాత్రలకు బయలుదేరాము.

మామొదటి మజిలీ ప్రయాగరాజ్ లో ఆదిలోనే హంన్సపాదన్నట్లయింది.

ఆనాడు త్రివేణిలో స్నానానికి బయలుదేరాము. గంగా, యమున కలుసుకునే సంగమ స్థానం ఒడ్డుకి కొంచెం దూరంలోవుంది. అక్కడకు వెళ్లాం. అక్కడ కొన్ని కొన్ని చోట్ల ఎర్రటి జండాలు ఎగురుతున్న పడవలున్నాయి. అవి బాగా లోతైన స్థలాలు. అక్కడ ఎవరూ స్నానం చేయకూడదు. నాకు కొంచెం ఈత వచ్చును. దానిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేసేను, దానిలో చిక్కుకున్నాను. ఇంకేముంది కాళ్లకు నేల అందటం లేదు. చిన్న సుడిగుండముకూడా వున్నట్టుంది. అందులో గిర్రున తిరుగుతున్నాను. యశో అది చూసి గట్టిగా పిలిచింది. ‘బాదల్ బాబూ ఇంక బయటకు రండి’. ఆమె కేక వినబడింది, కాని బదులు పలక లేక పోయాను. చేతులు ఊపడం మొదలుపెట్టాను. యశో పరిస్థితి గ్రహించి గస్తీ పోలీసుల దృష్టి నాకర్షించడం చూశాను. తర్వాత స్పృహ‌ తప్పింది.

మళ్లీ మెలకువ వచ్చేసరికి ఆస్పత్రిలో వున్నాను. శరీరంలో ఎంతో నీరసంగా వుంది. కాస్త తలనొప్పికూడా వుంది. నా మంచం దగ్గర కుర్చీలో యశో కూర్చుని, కిటికీలోంచి బయటకు పరధ్యానంగా చూస్తోంది. తెల్లటి బుగ్గల మీద కన్నీటి చారలు స్పష్టంగా కనబడుతున్నాయి..

‘‘అమ్మీ.’’ అని నెమ్మదిగా పిలిచాను.

యశో ఉలిక్కిపడి నా వైపు తిరిగింది. మరుక్షణంలో తన ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడవటం మొదలు పెట్టింది. లేవడానికి ప్రయత్నించాను. దానితో తలనొప్పి మరీ ఎక్కువయింది. ‘అబ్బా’ అని తిరిగి పడుకున్నాను.

‘‘లేవకండి; మీకు ఇంకా స్వస్థత చిక్కలేదు,” అంది.

‘‘అసలు జరిగిందేదో చెప్పు యశో’’ అన్నాను నీరసంగా.

‘‘నన్ను ఎంత భయపెట్టారు మీరు? మీ గురించి నేను ఎంత యాతన పడ్డాను. తలచుకుంటే గుండె అవిసిపోతూంది. అనుక్షణం మిమ్మల్ని నేను ఎక్కడ చూడగలను చెప్పండి. ఈనాడు మిమ్మల్ని భగవంతుడు రక్షించకపోతే నా గతి ఏమగును?’’ అంది చీరచెంగుతో కళ్లు తుడుచుకుంటూ.

“నన్ను రక్షించింది నువ్వు అమ్మీ. భగవంతుడు కాదు. నాకు ఆ దేవుడి అవసరం లేదు. ఒక విధంగా ఆ స్థానాన్ని నీవే ఆక్రమిస్తున్నావు. ఈ మాటు నా ప్రాణం కూడా నీదై పోయింది. ఇక నా వద్ద మిగిలింది ఏమీలేదు,” అన్నాను.

‘‘నేను మిగిలాను బాదల్ బాబూ. ఏమి పోయినా నా సర్వస్వమూ మీదే. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయనని నాకు మాటివ్వండి. జీవితంలో ఎప్పుడూ ఈ రోజు భయపడినంతగా నేను భయపడలేదు. అచేతనమైన మీ శరీరాన్ని చూస్తుంటే గుండెలలసిపోయాయి. ఏడుస్తూ ఈ ఆస్పత్రికి తీసుకువచ్చాను,’’ అంది యశో పక్కమీదకు వచ్చి కూర్చుని.

‘‘ఈ నాటి నుంచీ నేను నీ మాట జవదాటను అమ్మీ,’’ అన్నాను తన చేతిని నాచేతిలోకి ప్రమాణ పరంగా తీసుగుని.

జరిగిన సంగతి తర్వాత తెలిసింది. పోలీసులు నన్ను బయటికి తీసేటప్పటికి బాగా నీరు తాగి వున్నాను. అలాంటి స్థితిలో యశో పరిస్థితి ఎంత హృద‌య విదాకరంగా వుండి వుంటుంది. ఎంత క్షోభపడి వుంటుంది. ఒంటరి స్త్రీ, నిస్సహాయురాలు నూతన ప్రదేశం, పడవలో సృహ‌లేని నా శరీరాన్ని దగ్గరపెట్టుకుని, ఆమె ఎంత దుఃఖించి వుంటుంది.

ఏడుస్తూ పోలీసులనర్ధించిందిట, ‘‘ఈయనని ఆస్పత్రికి తీసుకువెళ్లండి, మీ మేలు ఎన్నటికి మరచిపోను’’.

వాళ్లు పడవలోనే ప్రధమ చికిత్స చేసి ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

తడిబట్టలతో ఆస్పత్రికి చేరేక తను విలపిస్తూవచ్చి డాక్టరుతో అందిట, ‘‘డాక్టర్ గారూ నాకు పతిభిక్ష పెట్టండి. ఈయనని రక్షించండి.’’

‘‘ఏమిఫర్వాలేదమ్మా త్వరలోనే నయమవుతుంది,’’ అన్నారుట ఆ డాక్టరు.

ఆస్పత్రిలో నాలుగు రోజులున్నాను. యశో నన్ను కంటికి రెప్పలా కాచుకుంది. తర్వాత ఇంకా వారం రోజులు కదలకుండా పడుకోవాల్సి వచ్చింది. తరువాత ఉత్తరాది క్షేత్రాలన్నీ తిరగడం ప్రారంభించాము - హరిద్వార్, రుషికేష్, బృందావ‌నం, కురుక్షేత్రం, నాసిక్.

యశోనన్ను ఎక్కడా నదిలో ఈదనిచ్చేది కాదు. తనతోపాటు ఒడ్డునే నిలబడి స్నానం చేయమనేది. అప్పుడప్పుడు ఆ పనికూడా తానే చేసేది. ఎక్కడైన జనసమూహంలో నా చెయ్యి గట్టిగా పట్టకునేది. ఆ విధంగా నన్ను ఎన్నో ఊర్లు తిప్పింది. ప్రతి చిన్న పనీ ఆమే చేసేది. ఏమైనా నేను చేయబోతే ‘‘మీరు ఊరుకోండి, మీరేమీ చేయనక్కర్లేదు, కాస్త మిమ్మల్ని మీరు చూసుకుంటే చాలు,’’ అనేది.

ఒక్కొక్క చోట పది పదిహేను రోజులు వుండిపోయేవాళ్లం. చేసిన యాత్రలు చాలు ఇంటికి పోదాం అని నేను, వెళ్లి చేసేదేముంది చెప్పండి అని యశో, ఇదే వరస మాది ఆ రోజుల్లో.

ఆవిధంగా తిరిగి తిరిగి కాశీ చేరుకున్నామోలేదో, దక్షిణాది క్షేత్రాలు చూడటానికి బయల్దేరుదామంది. నేను అంత తొందరగా వద్దన్నాను. తిరిగి తిరిగి ఎంతో అలసిపోయాను. రైలు ప్రయాణ మంటేనే విసుగెత్తి పోయింది. అయినా యశో పంతం మీద వెళ్లక తప్పలేదు. జ్ఞానం వచ్చిన తర్వాత తెలుగునాడు ఎప్పుడూ చూడలేదట. మాతృభూమి చూడాలని కోరికగా వుందంది. మళ్లీ రైలెక్కాము. తిరుగుడికి అంతేముంది?

చాప్టర్ 28

జీవితంలో నాకొక ఆశయం లేదు. యశో వద్ద నాకు కావాల్సిన ఆదరం, అనురాగం, రక్షణా లభించాయి. నా భారమంతా ఆమే మోస్తోంది. వీటన్నింటినీ నేనెందుకు కాలదన్నాలి? ఎదురీత చేతకాన్నప్పుడు ప్రవాహంలోపడి కొట్టుకుపోవుటే ఉచితం. అదే చేశాను. అనేక పుణ్యక్షేత్రాలు తిరగాము. అప్పుడు మేము తిరుపతి నుంచి అన్నవరం వెళ్తున్నాము. దారిలో రాజమండ్రి స్టేషన్ తగులుతుంది.

“మీ ఊరు తీసుగెళ్ళి మన ఇల్లు చూపించండి. పగటి పూట ఇబ్బందనుకుంటే రాత్రి వేళయినా సరే,’’ అంది యశో.

నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చినప్పటి నుంచీ పొలంతో పాటు ఇంటి వ్యవహారం కూడా బాబయ్యే చూస్తున్నాడు. ఇల్లు ఎవరికో అద్దెకిచ్చానని ఒకసారి రాశాడు. దానిమీద వచ్చిన అద్దె, భూముల మీద వచ్చిన శిస్తు కలిపి అప్పుడప్పుడు పంపిస్తూ వుండేవాడు. నేను ఏదో దేశ సంచారం చేస్తున్నానని ఆయన అభిప్రాయం. నాతోటి ఒక స్త్రీ కూడా వుందని తెలిస్తే ఆయన ముఖం మీద ఉమ్మివేస్తాడు. ఇక ఆయన ద్వితీయ కళత్రం లలితాదేవి సంగతి చెప్పక్కర్లేదు. పురాతన స్త్రీ మాత్రమే కాదామె. అంతకంటే అందకత్తె మా కుటుంబంలో ఎక్కడా లేదని ఆమె గర్వం. యశోని చూసిందంటే ఆమె ఈర్ష్యతో మండి పడుతుంది. అదీకాక యశోని ఏమని పరిచయం చేస్తాను? నేను మాట దాటేస్తే మాత్రం ఎవరూరు కుంటారు, తనెవరని అడగారూ? నేనేమి చెప్పగలను? అందరూ నన్ను వేలెట్టి చూపిస్తారు అదీకాక ఆమె నెవరయినా అవమానపరిస్తే? తాను బాధపడడం మాట అటుంచి అది నేనెల్లా సహించగలను? ఏతావాతా తన్ని అప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళడం శుద్ధ అవివేకం.

కానీ ఆమె కోరిక సమంజసమైంది. తన ఇల్లు తనకు చూపించమంటూంది. స్వర్గస్తులయిన నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆమెకు ఎలానూ లభించదు, ఇక వారి ఇల్లైనా చూపించలేనా? ఆమె కోరికను ఎలా నిరాకరించగలను? దారిలో రాజమండ్రి ఎలాగా తగులుతుంది. సరే రాత్రి మమల్ని ఎవరూ చూడరు కదా. ఒకసారి చూపించుదామని నిశ్చయించాను.

అల్లాగ ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు రాజమండ్రి స్టేషనులో సామాను వదిలి, మేమిద్దరం రిక్షాలో ఇన్నీసుపేట చేరాము. ఇల్లు కొంచెం దూరంలో ఉందనగా రిక్షా దిగి అక్కడికి నడచి వెళ్ళాము. వీధి తలుపు వేసివున్నా ఇంట్లో దీపాలున్నాయి. ఇంటి అరుగు దగ్గర ఆగి మాఇంటికి నేనే గైడ్ అయ్యాను.

‘ఇదే నా పుట్టినిల్లు. ఆ యడమవైపు గదిలోనే రోహిణీ నక్షత్రంలో పుట్టానని మా అమ్మ చెప్పేది. నా బాల్య స్మృతులతో నిండివుందీ ఇల్లు,” చెప్పేను యశోతో.

"నే లోపల అడుగు పెడితే అవుతుందిగా నామెట్టినిల్లు, " అంది యశో తనలో తానుగా.

యశోని ఇంటి వరకు తీసుకకెళ్లేను గాని గృహప్రవేశం ఎలా సాధ్యం? అదే అన్నాను తనతో.

నా ఇంట్లోకెళ్ళి అద్దెకున్న వారితో కూడా నేనెవరినో చెప్పుకునే ధైర్యం నాకులేదు. నేను చేసిన దోషమేమిటి? తల్లిదండ్రులు జీవించివుంటే ఎంతో సంతోషించేవారు. యశోని చూస్తే మా అమ్మ హృద‌యం కరిగి యుండేది. ‘చక్కటి రూపమమ్మా నీది. బంగారపు బొమ్మలావున్నావు. మా తోటికోడలు పొగరు అణుస్తావు నువ్వు. పద ఇప్పుడే ఆమెకు చూపిస్తా’ అనేదేమో. యశో చాలాసేపు ఇంటివైపు చూస్తూ నించుంది. ఆమె మదిలో సాగుతున్న ఆలోచనలేమిటి?

“ఈ ఇంటికి యజమానురాలినయినా రాత్రి వేళ దొంగలా బయట నిలపడి లోపటికి దూరడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇంతకంటే దౌర్భాగ్యంవేరొకటుంటుందా?” ’’అంది యశో దీర్ఘంగా నిట్టూర్చి.

"అమ్మీ తెలుసుకో, నీ ఆవేదనలోని ఆప్యాయతే నా ఆయువు," అన్నాను ఆమె భజం మీద చేయి ఉంచి.

“అది తెలుసుకానీ, మన ఇంట్లోకి దారి తీయండి,” అంది యశో భావగర్భి తంగా.

‘‘అది ఎలా సాధ్యం,’’ అన్నాను.

‘‘బాటసారులమని చెప్పి మంచి నీళ్లు అడుగుదాం,’’ అంది హుషారుగా.

‘‘నీ కేమయినా మతి పోయిందా అమ్మీ, రాత్రి వేళ మంచినీళ్లేమిటి?’’ అన్నాను.

‘‘రాత్రి దాహమేయదా ఏమిటి, కాదనకండి ఏ ట్రయల్ కాస్ట్స్ నథింగ్,’’ అంది నా చెయ్యి పట్టుకు లాక్కెళుతూ.

‘‘ఎవరు?’’ తలుపు తట్టగా ఒక ముసలాయన వేసిన ప్రశ్న.

"మీ పక్కింటివారి బంధువుల మండి, ఇప్పుడే ట్రైన్ దిగి వచ్చాము, తీరాచూస్తే తలుపు తాళమేసివుంది," అన్నాను ఈలోపున నేను ఆవిషయం గమనించి.

"అలాగా, లోపలకు రండి, అనుకోకుండా పొద్దున్నే వాళ్ళు కాకినాడ వెళ్ళేరు," అన్నాడాయన.

యశో ప్రశంశా నేత్రాల మెరుపు నా మదినెన్నడు వీడలేదనడం అతిశయయోక్తం కాదు.

“సురేఖా, ఒకమారు ఇల్లారా, మీ శాంతా వాళ్ళింటికి ఎవరో వచ్చారు," అరిచాడాయన.

"తాతా, ఉదయమేగా వాళ్ళు ఊరెళ్లింది, పాపం వీళ్ళకు తెలియదేమో," అంటూ వచ్చింది పదహారేళ్ల సురేఖ.

"మిమ్మల్నివేళ కాని వేళ వచ్చి ఇబందిపెట్టడం సబాబు కాదని తెలుసు మాకు - ఈయన మా ఆయన బాదల్ బాబు , నేనాయని భార్య యశోరాజ్యం – కాని.. " అంది యశో సురేఖ దగ్గరకు వెళ్లి.

"భలే విచిత్రంగా మాట్లాడుతావు అక్కా, అయినా నా స్నేహితురాలి బంధువులు మా బంధువులేగా,"

అంది సురేఖ.

"బలే భేషుగ్గా చెప్పేవే మానవరాలా, వీళ్లకు వాళ్ళొచ్చేవరకు ఇక్కడే బస ఏర్పాటు చెయ్యి," అన్నాడాయన.

"నా ఊహకి, సహృదయుల నివాసమే నిజమైన దేవాలయం, అందులో నువ్వు నన్నుఅక్క అన్నావు కనుక నిన్ను ఎల్లప్పుడూ చెల్లిగానే భావిస్తాను," అంది యశో సురేఖ చేయిని తనచేతిలో తీసుకుని.

“బాబు గారూ, మీ సహృదయత కి మా ధన్యవాదాలు, ఈ రాత్రి తల దాచుకోడానికి చోటిస్తే చాలు, మేము తెల్లారకట్టే అన్నవరం అన్నవరం వెళ్లే ట్రైన్ పట్టుగొవాలి. అందుచేతే సామానంతా క్లోక్ రూమ్లో పడే సోచ్చ్చాము." అన్నాను.

“'సరే, దంపతులారా, క్షేమంగా వెళ్లి లాభంగా రండి. మీ పడక ఏర్పాట్లు అవీ మా సురేఖ చూస్తుంది. నేవెళ్లి పడు కుంటాను తొందరగా లేవాలికదా," అన్నారాయన.

"ఒక వేళ మాకు మెలుకువ రాక పోతే మమ్మల్ని లేపండి బాబుగారు," అంది యశో.

"అల్లాగే నమ్మా కోడలా," అని ఆయన తన గదిలోకి నిస్ష్క్రమించేరు.

‘‘కూర్చోండి, మీకు ఏవైనా పళ్ళు తీసుగొస్తాను," అని, వద్దన్నావినకుండా సురేఖ లోపలికి వెళ్ళింది.

గోడమీద పెద్ద ఫ్రేమ్లో వున్న మధ్యవయస్సు దంపతుల ఫోటోచూసి, యశో నాకేసి భావపూరితంగా

చూస్తే, నేను తన చెయ్యి పట్టుగుని నాతల్లితండ్రుల ఆశీర్వాదాలకు వారి దగ్గరకు తీసుకెళ్ళేను.

యశో ఆసక్తికరంగా వారిరువురి కేసీ చూసి, వారికి వంగి నమస్కరించిం అంది, "మీవన్నీ అత్తగారి పోలికలు."

"అయితే అదృష్ట మంటారుగా, అందుకే నువు దొరికావు," అన్నాను.

"ఏమిటి చూస్తున్నారు, ఈ యిల్లు ఆ స్వర్గీయ దంపతులది. మంచివారని అంటుంటారు," అంది సురేఖ ట్రైలో ఆపిల్ ముక్కలు వారికి అందిస్తూ.

“మంచివారి ఇంట్లో మంచివారు అద్దెకుంటున్నారు, ఎంత సంతోషింపదగ్గ విషయం,” అంది యశో.

‘‘ఇప్పుడు ఈ ఇంటి యజమాని వారి ఏకైక పుత్రుడు, ఆయన చాలా సౌమ్యుడని వినికిడి. అయితే మేమెప్పుడూ ఆయన్ని చూడలేదు. ఇక్కడ వాళ్ల బాబాయ్ వున్నారు. వారు చెప్పగా విన్నాను, ఆయన చిన్నతనంలో ఎవరినో ప్రేమించారట. ఆవిడ చనిపోవటంతో ఆయన ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూన్నారట.. పాపం ఎంత విషాధగాధ,’’ అంది.

ఆ మాటలు వింటూంటే యశో కళ్లు నీళ్లు చెమర్చాయి.

‘‘అవును చెల్లీ,’’ అంది.

“ఇక మీగురించి చెప్పండి అక్కా,“ అంది సురేఖ కుతూహలంగా.

‘‘మా గురించి చెప్పటానికి పెద్దగా ఏమీ లేదు చెల్లీ మా విచిత్ర దాంపత్యం తప్ప,” అంది యశో నవ్వుతూ

‘‘అదేమిటో చెప్ప్పుఅక్కా, బావగారికి అభ్యంతరం లేక పొతే,” అందిసురేఖ కూడా నవ్వుతూ.

"అది వినడానికి నువ్వింకా చిన్నపిల్లవి చెల్లీ, తరవాత తప్పక చెపుతాను," అంది యశో

"ఆలా అంటావేమిటి అక్కా, మా తాత నాకు పెళ్లి చేద్దామని తాహతహ లాడుతుంటే," అంది సురేఖ.

“ఎంత వరకు వచ్చింది వరుడి వేట?” అడిగింది యశో.

“మా తాత కాళ్ళు కట్నం ఉచ్చులో చిక్కుకున్నాయి అక్కా . పాపం ఆయన మాత్రం అంతంత కట్నాలు ఎక్కడి నుంచీ తేగలడు, అదీకాక నాకు అన్నదమ్ములు అక్కచెల్లులు లేరు, చిన్నతనం నుంచీ ఈయనే పెంచాడు," అంది దిగులుగా సురేఖ.

సురేఖ అప్యాయత అమాయకత్వం యశో హృదయాన్ని పూర్తిగా కదలించేయి.

‘‘నీకు నచ్చిన వాడు ఎవరూ లేరా చెల్లీ?’’ అంది.

సురేఖ కాస్త సిగ్గుపడింది చెప్పడానికి.

‘‘ఫర్వాలేదుమ్మా చెప్పు, అక్క బావలవద్ద నీకు సంకోచం ఎందుకు,’’ అంది యశో సురేఖ చేయి తీసుగుని.

‘‘మధు వున్నాడు. చాలా మంచివాడు. తన తల్లిదండ్రులు పేరుకైనా కట్నం లేకపోతే చేసుకోవటానికి వీలు లేదంటున్నారు. మధు ఎక్కడికైనా వెళ్లిపోదామంటున్నాడు. తాతయ్యని వదలి ఎలా వెళ్లను చెప్పు,” సురేఖ సిగ్గుపడుతూనే అంది.

అప్పుడు నాకు లఖియా మేనకోడలు సుజాత జ్ఞాప‌కానికొచ్చింది. సురేఖ జీవితం కూడా అదే బాట లో నడుస్తుందా?

‘‘నువ్వేమీ చింతపడకు చెల్లీ. మధు తలిదండ్రులు ఎంత కట్నం కావాలంటారు చెప్పు,’’ అంది యశో.

‘‘లాభం లేదు అక్కా; కనీసం రెండువేలైనా కావాలంటున్నారు,’’ అంది సురేఖ నిరాశతో.

‘‘నీకేమీ ఫర్వాలేదు, రేపే మధూతో చెప్పు, మీ అక్కయ్య నీ కట్నం ఏర్పాటు చేస్తుందని. ఆ రెండు వేలు నీకు త్వరలో అందేటట్లు చేస్తాను . నువ్వేమీ అడ్డుచెప్పుకు చెల్లీ; ఇది అక్కయ్య అభిలాష,’’ అంది యశో ఎంతో ధీమాగా.

‘‘నువ్వు నిజంగా మానవ మాత్రురాలివి కాదు అక్కయ్యా! దేవతలే మీ రూపంలో వచ్చి నన్ను ఆదు కుంటున్నారనిపిస్తోంది. ఇంత అందంగా మానవులుండరు,’’ అంది సురేఖ యశోని కౌగిలించుకుని.

‘‘అలాంటి అనుమానాలు పడకు చెల్లీ. మేము కూడా నీబోటి వాళ్లమే నా దగ్గర కాస్త డబ్బుంది, అందులో కాస్త చెల్లెలికి కట్నంగా ఇస్తాను అంతే’’ అంది యశో నవ్వుతూ.

“తప్పు పట్టవు కదా, నీ అడ్రెస్ అడగచ్చా అక్కా?” అంది సురేఖకి ఇంకా నమ్మకం కుదరక.

“పేపరూ పెన్ తీసుకురా, నీ బావగారు రాసిస్తారు,” అంది యశో.

"బావ గారూ, నా డైరీలో రాద్దురుగాని లోపలికి వెళదాం, మీరూ ఇల్లు చూసినట్టు ఉంటుంది," అంది సురేఖ.

మేము ఎడమవైపు గదిలోకి వచ్చినప్పుడు మెల్లగా యశోచెవిలో చెప్పాను, నేను అక్కడే పుట్టానని, యశో నా ముఖం కేసి చూసి చెయ్యి గట్టిగా పట్టుకుంది.

సురేఖ రెండు మంచాలు తెచ్చి పక్కలు వేసింది. చాలాసేపటివరకు అనేక కబుర్లు చెప్పింది. మధు ఆ ఊరిలో అందరికంటె అందంగా వుంటాడట. కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. ఒకసారి లంఖించిన ఆంబోతు తరుముతూవుంటే అడ్డువెళ్లి చెయ్యి విరక్కొట్టుకున్నాడు

"బావగారూ, అక్కయ్యకు చూపించడానికి మనిద్దరం మధుని తీసుకొద్దాం, ఏమంటారు? అంది

ఎంత అమాయకురాలు ఈ సురేఖ?

మేము పక్క లెక్కే సరికి పన్నెండయింది. ఎంత విచిత్రం నా ఇంట్లో నేను అతిథిగా పడుకున్నాను, పూర్వకాలంలో ఇది మా నాన్నగారి ఆఫీసు గది. ఒక వైపు, నా మనసంతా పాత జ్ఞపకాలతో నిండిపోగా, మరొకవైపు నా మెదడంతా పరిపరి ఆలోచనలతో కలవర పడింది. అదే కాక బాగా నిద్రపట్టి తెల్లవారకట్ల మెలకువ రాకపోతే మాగుట్టు రచ్చకెక్కుతుందన్న భయం. ముసలాయన లేపుతా నన్నాడు కానీ ఏం చెప్పగల. ఏమయితేనేం, ఒక్క కునుకు కూడా తీయలేక పోయాను.

కాని, పక్క మంచమ్మీద యశో ప్రశాంతంగా నిద్రపోయింది. ఎంత సంతోష స్వభావం ఈమెది , నేను పెళ్లి చేసుకోక పోయినా, ఇది తన అత్తవారిల్లులా తలచి ఎంత తృప్తి పొందుతోంది. అయినా తన్ని ఇంకా ఎందుకు భార్యగా స్వీకరించ లేకపోతున్నాను. హే విధీ, సుశీ స్మ్రుతి యశో ఆత్మకే శాపం అయింది. తానే కావాలనుకుంటే రెచ్చగొట్టి నన్నుపొందవచ్చును, అయినా ఆ అవకాశం వున్నా దాన్ని దుర్వినియోగ పరచుకోదు,అదే నిదర్శనం ఆమె వ్యక్తిత్వ ఔచిత్యం, జీవన ఔన్నిత్యానికి . కాని నేను, ఆమె అందచందాలు అడవిగాచిన వెనన్నెలవుతున్నా చీమకుట్టనట్టు కూర్చుంటున్నాను. తనయవ్వనం వ్యర్ధపరుస్తుంటే నేనామె సేవలో కులుకుతున్నానంటే నేనెంత స్వార్ధపరుడ్ని. ఆలా పరిపరివిధాలఆలోచిస్తూ యశోని చూస్తూ రాత్రంతా గడిపాను.

తెల్లవారక నాలుగు గంటలకి యశోని నిద్ర లేపుతుంటే సురేఖ తాతగారు వచ్చారు. గాబ గబా తయారయ్యి మేము వెళ్ళబోయేముందు, యశో ఆయనకి పాదాభివందనం చేస్తే, 'శ్రీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు' అని దీవించారు. ఆ ఆశీర్వాదం యశోకి ఆనంద దాయకమయితే అది నా హృదయభారాన్ని మరింత పెంచింది.

డబ్బు తప్పకుండా పంపుతానని యశో సురేఖకు మళ్ళీ మాట ఇచ్చింది.

‘‘బావగారూ. అక్కయ్యనిజాగ్రత్తగాచూసుకోండి,’’ గడపదాటేక వెనకనించి సురేఖ నన్నుహెచ్చరించింది,

ఆనాడు రణధీర్ కూడా అలాగే చెప్పాడు. అతడు యశో తమ్ముడు ఈమె చెల్లెలు.

హుటాహుటిని స్టేషన్ చేరేము. ఆ రాత్రి తనకు పట్టినంత గాఢనిద్ర యిదివరకెప్పుడూ పట్టలేదంది. ఆ రాత్రి తన ఇంటిలో గడిపినందుకు ఎంతో మనశ్శాంతి లభించిందంది. సురేఖ లాంటి చెల్లెలు తనకు దొరికినందుకు చాలా సంతోషంగా వుందంది. మేము అన్నవరం, సింహాచలం, పూరి వగైరాలు తిరిగి ఇంటికి చేరుకునేటప్పటికి సురేఖ సందేశంతో కూడిన అమె పెండ్లి శుభలేఖ స్వాగతం పలి కింది.

“ఈ శుభకార్యము నీ దయవల్లనే అవుతూవుంది అక్కయ్యా, నువ్వు రాకపోతే ఆ వెలితి తీరదు. మధుకూడా ఇదే అంటున్నాడు. పెళ్లి అయిన తర్వాత బావగారికి నీకు మేమిద్దరమూ నమస్కరిస్తాము అక్కా. నీవు రావాలి, నాకు అమ్మలేదు, ఇంకెవరూ లేరు. నువ్వు వచ్చావంటే ఆ లోటులన్నీ తీరుతాయి. రాకపోతే పెళ్లిరాత్రి నేను ఏడుస్తూ కూర్చుంటాను. చెల్లి వివాహం నీవు చూడకపోతే ఇంకెవరు చూస్తారు. అక్కా తప్పక రావాలి. బావగారికి నా నమస్కారాలు.’’

ఉత్తరం పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది యశో. ఏ మాత్రం వాత్సల్యం చూపినా ఈమె గుండె కరగిపోతుంది. ఇక చేసేదేముంది? పది రోజులక్రితం వచ్చిన ఉత్తరం ఇది. పాపం ఎంత బాధపడిందో అక్కయ్య రాలేదని, చివరికి ఉత్తరమైనా రాకపోతే నిజంగా దేవతలే అలా వచ్చారనుకుందేమో.

"మీరు వెంటనే తనకి టెలిగ్రాం ఇచ్చి ఒక మంచి బనారస్ సిల్క్ చీర పంపించి రండి

నేనీ లోపున ఉత్తారం రాస్తాను. మీ చీరల ఎంపిక గురించి వేరేచెప్పలాండి," అంది యశో నవ్వుతూ.

"మరదలు పిల్లతో పాటు తన అక్కకు కూడా ఒక చీర కొంటాను, ఏమాంటావు?" అని, యశో నగుమోము వీక్షిస్తూ, ‘బాటా’ చెప్పుల్లో కాళ్ళు దూర్చాను.