రచయిత : బివిడి ప్రసాదరావు
ఎపిసోడ్ 6
శ్రీరాజ్ తొలుత నుండి కెమిస్ట్రీ సబ్జెక్టు చదువు వైపు ఇంటరెస్టు చూపేవాడు. పైగా వాడికి మెడిసిన్ మీద, ఇంజనీరింగ్ మీద మక్కువ లేదు ముందు నుంచి. గ్రాడ్యుయేషన్ వైపు వెళ్లి, కెమిస్ట్రీ బేస్డ్ సబ్జెక్ట్స్ మీద లోతైన అవగాహన పొంది, తను అనుకుంటున్న ఆ సబ్జెక్టు బేస్ట్ న్యూ పార్ములా మీద తను పేపర్స్ క్రియేట్ చేసి, సబ్మిట్ చేయాలన్న తలంపు వాడిది తొలుత నుండి. దాంతో తమ చెంత ప్రస్తుతం అట్టి గ్రాడ్యుయేషన్ కోర్సులుకు వీలు పడక, వాడిని వేరే కాలేజీకి పంపించవలసి వచ్చింది, వాడి పెద్దలకు.
***
అలా వేరే కాలేజీలో చేరిన శ్రీరాజ్ మొదటి సంవత్సరం మంచి శాతం మార్కులు పొందాడు. అదే జోష్తో రెండవ సంవత్సరం చదువు మొదలు పెట్టాడు.
అప్పుడే, అక్కడ, మధుమతి పరిచయమయ్యింది శ్రీరాజ్కు, గమ్మత్తుగానే కాదు, కాకతాళీయంగానూ, అదీ ఉదయమే.
"మీ నాన్నగారు ట్రాన్స్ఫర్ మూలంగా నీది మిడిల్ ఎడ్మిషనైంది. ఐనా ఇక్కడ నుండే మా కోర్సు నువ్వు పాలో అవ్వాలి. పాతవి ఏమైనా తెలుసుకోవాలంటే మా బెస్టు స్టూడెంట్ శ్రీరాజ్ను మీటవ్వు" అని చెప్పాడు ఆ కెమిస్ట్రీ లెక్చరర్, అప్పుడే క్లాస్లో కొత్తగా చేరిన మధుమతితో.
అదే విషయాన్ని ఆ క్లాసులో ఉన్న శ్రీరాజ్కు ఆయన చెప్పి, "ఈ మధుమతికి ఆమె అవసరం కొద్దీ కాస్తా ఫాలో ఆప్ ఇవ్వు శ్రీరాజ్" అని అన్నాడు.
ఆ తర్వాత, మర్నాడే, మధుమతి అడిగింది శ్రీరాజ్ని, క్లాస్లోనే, "నాకు కెమిస్ట్రీ సబ్జెక్టులో గత ఛాప్టర్ అర్థాంతంగా ఉండిపోయింది. అది మీకు ఐపోయింది. సో, దానిని కాస్తా చెప్పు" అని.
"తప్పక. థర్ట్ అవర్ ఖాళీ. స్టడీ రూంకు రండి" అని చెప్పాడు శ్రీరాజ్.
"రండి ఏమిటి. మనం ఒకే క్లాస్ వారం." అంది మధుమతి.
"కొత్త, సో, అలా అన్నా" చెప్పాడు శ్రీరాజ్.
"రేపు సండేగా మా ఇంటికి రా. అడ్రస్ ఇస్తాను. లేదా, మీ ఇంటికి కానీ, రూంకి కానీ నేను వస్తా" అని చెప్పింది మధుమతి.
"కుదరదు. స్టడీ రూంకు వస్తే చెప్తాను." అని అనేశాడు శ్రీరాజ్.
"సరిసరే" అంది మధుమతి.
ఆ తర్వాత, ఆమెతో సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు, మధుమతి ఒక ఏవరేజ్ స్టూడెంట్గా గుర్తించాడు శ్రీరాజ్.
అయినా, సాధ్యమైనంత మేరకు ఆమె అర్ధం చేసుకొనేలానే ఆ గత ఛాప్టర్ను మూడు సిటింగ్స్లో టీచ్ చేసేశాడు.
మధుమతి సంతృప్తి పడింది.
శ్రీరాజ్ అంటే అప్పటికే ఆమెలో ఒక గురి ఏర్పడి ఉంది.
ఆ ఆసరాను ఆమె పోనుపోనూ శ్రీరాజ్ మీద ఒక మోజుగా మల్చుకుంటుంది.
అది శ్రీరాజ్ గమనించాడు. అది సరి కాదని, సున్నితంగా హెచ్చరికలా చెప్పేడు కూడా.
మధుమతికి ఆ మాటలును పట్టించుకో బుద్ధి కావడం లేదు.
అదీ గుర్తించాడు శ్రీరాజ్.
***
శ్రీరాజ్కు, తాత కృష్ణమూర్తి చెంత చనువు ఎక్కువ. దాంతో, డిన్నరైన పిదప, రోజులా, తన రూంకు నేరుగా పోక, కృష్ణమూర్తితో లాన్లోకి వెళ్లాడు.
అది గమనించిన లక్ష్మి, "తాతతో ఏదో మాట్లాడాలని మనవడు అనుకుంటున్నట్టు ఉంది. మీరు అటు వెళ్లకండి" అని చెప్పింది, అరుణ, చంద్రలతో.
అందుకే వాళ్లు తిన్నగా తమ రూంకు వెళ్ళిపోయారు.
లక్ష్మి కూడా తమ రూంకు వెళ్లిపోయింది.
కృష్ణమూర్తి కూడా శ్రీరాజ్ తనతో పాటు అక్కడ కూర్చోవడంతో, "ఏమిటి శ్రీరాజ్ మేటర్" అని అడిగాడు.
మధుమతి విషయం అంతా చెప్పాడు శ్రీరాజ్.
"టీనేజ్ శ్రీరాజ్. చాలా మంది దాని ప్రలోభకు లొంగిపోతుంటారు. అదే జరుగుతోంది మధుమతి విషయంలో" అని చెప్పాడు కృష్ణమూర్తి.
"నా ప్రేరణ ఏమీ లేదు తాతా" చెప్పాడు శ్రీరాజ్.
"ప్రేరణ కంటే ప్రమేయం అను. సరే, ఏదైనా చెప్పానుగా. చాలా మంది నీ ఏజ్ వారు తమంతట తామే ఇప్పుడే పల్టీలు పడుతుంటారు. వారిది తప్పు అనలేం కానీ యోచించే మార్గం ఇక్కడే వారికి టీచ్ చేయబడాలి." అని అన్నాడు కృష్ణమూర్తి.
"చెప్పాగా నేను ఆ ప్రయత్నం కూడా చేశాను తాతా." చెప్పాడు శ్రీరాజ్.
"ఏం చెప్పావు. ఇది చదువుకొనే వయస్సు. ఇప్పుడు మన మనస్సంతా స్టడీస్ మీదే ఉండాలి, అనేగా చెప్పానన్నావు" అన్నాడు కృష్ణమూర్తి.
"యయ, అవును తాతా" అన్నాడు శ్రీరాజ్.
"ఆ డోస్ చాలడం లేదు, ఆ మధుమతి విషయంలో శ్రీరాజ్" అన్నాడు కృష్ణమూర్తి, నవ్వుతూ.
శ్రీరాజ్ ఇంకా ఏమీ అనలేదు.
అదే సమయాన్న కృష్ణమూర్తి, "నువ్వు ఇకపై ఆమె పట్ల మౌనం వహించినా, పోనీ తూలనాడినా, లేదా తిరష్కరించినా ఏ లాభమూ ఉండదు. పైగా మరింతగా ఆమె రెచ్చిపోవచ్చు. నిన్ను ఆడిపోసుకోవచ్చు, లేదా, తనకు తాను దండించుకోనూ వచ్చు. ఇది చాలా సున్నితమైనది. ఈ మీ వయస్సులో ఇట్టి భావం ఎవరికైనా కలిగితే, అది మగ, ఆడ అనేదే కాదు, ఎవరైనా, చెప్పినా వినరు. ఆలోచించరు. పీక్కు పోతారు." అన్నాడు కృష్ణమూర్తి, కాస్తా ఇబ్బందిగానే.
"ఎలా తాతా. నాకు మాత్రం చదువు మీద తప్ప ఇట్టి ధ్యాస అస్సలు లేదు. ఇది నాకు ఎందుకు ఇప్పుడు ఇలా ఎదురైందో. బహుశా, ఆ రోజే ఆమెకు నేను అస్సలు టీచ్ చేయకుండా ఉండవలసింది" అని చెప్పాడు శ్రీరాజ్.
కృష్ణమూర్తి, "నీ తప్పు ఏమీ కాదు శ్రీరాజ్. ఆమెలోని ఈ స్పందనకు నీ ఎప్రోచ్ కారణం కాదు, నీవు ఆమె కంట పడడమే. అప్పుడు నీ రూపు లేదా నీ నాలెడ్జ్ లేదా నీ స్టైలాఫ్వే లేదా ఏదో, ఇంకేదో ఆమెలో టక్కున రేగి, అది ఆమెను రెచ్చకొడుతోంది ఇప్పుడు. ఇట్టి మూమెంట్స్ ఈ మీ ఏజ్ తాలూకు ప్రక్రియలే. థట్సిట్." అని చెప్పాడు కృష్ణమూర్తి.
శ్రీరాజ్ అయోమయంలో ఉన్నాడు.
"శ్రీరాజ్ నువ్వు వెహికల్ డ్రయివింగ్లో జాగ్రత్త గానే ఉంటావు. రూల్సు ప్రకారమే ముందుకు వెళ్తుంటావు. ఐనా వెనుక నుండి కానీ, ఎదురు నుండి కానీ, పక్కల నుండి కానీ డ్రయివ్ చేస్తూ వస్తున్నవారు తమ అజాగ్రత్తగా నీ వెహికల్ని ఢీ కొడితే నువ్వూ నష్టపోతావు కదా. ఇదే ప్రక్రియ ఇక్కడా చోటు చేసుకుంది. సో, ఇక తదుపరిది ఏమిటో యోచిద్దాం" అని అన్నాడు కృష్ణమూర్తి.
"మీతో కానీ లేక ఆమె పెద్దవాళ్లతో కానీ చెప్పిస్తే బాగుంటుందేమో తాతా" అన్నాడు శ్రీరాజ్.
"అసలు బాగోదు శ్రీరాజ్. ఇందాకే చెప్పాగా. తనకు నచ్చందానిని చేపడితే తను రెచ్చిపోయే అవకాశం కూడా ఉంటుందని. సో, ఒక పని చేసి చూద్దాం." అని ఆగాడు కృష్ణమూర్తి.
శ్రీరాజ్ శ్రద్థ వహించాడు. మౌనంగా తన తాత ఏమి చెప్పుతారా అని చూస్తున్నాడు.
ఆగి, కృష్ణమూర్తి, "శ్రీరాజ్ కాలం దొడ్డది. దానినే మనం వాడుకుందాం. నువ్వు సాధ్యమైనంత త్వరగా, వీలు ఐతే, రేపే, నువ్వే స్వయంగా ఆమెను కలు. తను ఐ లవ్ యూ అనే లాంటివి చెప్పేయక ముందే, నీలోని ధ్యేయాన్ని, ఆశయాన్ని ఆమెకు విడమర్చి చెప్పు. అది సాధించేందుకు తను అడ్డు కాకుండా ఉండాలని, పైగా అందుకు తన సహకారం నీకు మిక్కిలిగా కావాలని కోరు, లేదు, లేదు అర్థించేలా మాట్లాడు. నీ మీద మోజు పడుతోంది కనుక, నీ ఫ్యూచర్కై తప్పక ఆమె నీకు కోపరేట్ చెయ్యవచ్చు. ఇంకా కావాలంటే, నీ మూలంగానే నా ఫ్యూచర్ బ్రైట్వుతోందని కూడా ఏడ్ చేసి చెప్పు. ఏమీ కాదు. ఇకపై అంతా సర్దుకోవచ్చు. సాఫీ కావచ్చు." అని చెప్పాడు కృష్ణమూర్తి.
శ్రీరాజ్కు కృష్ణమూర్తి ఎత్తుగడ నచ్చింది.
"తప్పక తాతా, థాంక్సు తాతా" అన్నాడు గబగబా.
"అంతే కాదు శ్రీరాజ్. ఒకటి గుర్తు పెట్టుకో. ఇదీ మన ఆశయం. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఆమెతో సమయస్ఫూర్తితో మాట్లాడు. ఎందుకంటే, మనం అనుకున్నట్టే అక్కడ మాట్లాడడం కుదరదు కూడా. అటు వైపు ప్రతి స్పందనకు తగ్గట్టు మాట్లాడాలి సుమీ. తుదకు మన కాన్సెప్ట్ సక్సస్ ఐయేలా మాత్రమే నువ్వు వ్యవహరించాలి. చాలు" అని కూడా చెప్పాడు కృష్ణమూర్తి.
"సరే తాతా" అన్నాడు శ్రీరాజ్, కొత్త ఉత్సాహంగా.
కృష్ణమూర్తి లేస్తూ, "పద, పడుకుందాం" అంటూ ఇంటి వైపు కదిలాడు.
శ్రీరాజ్ అనుసరించాడు.
ఆ తర్వాత, తన గది వైపు పోతూ, "గుడ్నైట్ తాతా" అన్నాడు కృష్ణమూర్తితో.
"గుడ్నైట్ శ్రీరాజ్" అని చెప్పి, కృష్ణమూర్తి తమ గదిలోకి వెళ్ళాడు.
అప్పటికి లక్ష్మి ఇంకా నిద్ర పోవడం లేదని గుర్తించి, "పడుకోలేదా." అంటూ ఆమె పక్కన, ఆ మంచం మీద పడుకున్నాడు.
"మన శ్రీరాజ్ మూలంగా నాకు గర్వంగా ఉంది లక్ష్మీ" అని చెప్పాడు కృష్ణమూర్తి, ఎంతో తనివిగా.
ఎందుకు అని లక్ష్మి అడగలేదు.
కృష్ణమూర్తే అంతా చెప్పాడు. చివరన, "ఇక పడుకో, గుడ్నైట్" అని అన్నాడు, మెండుగా.
లక్ష్మి, "ఇక హాయిగా నిద్రపడుతోంది. గుడ్నైట్" అని అంది, నిండుగా.
***
(మిగతాది తరువాయి ఎపిసోడ్ లో)