అది చెన్నై లో లయోలా డిగ్రీ కాలేజీ ఆవరణ. హరిణి కాలేజీ లో మొదటి రోజు భయం భయం గా అడుగు పెడుతుంటే, సుడిగాలి లా ఒక ఫెరారీ కారు ఆమె దగ్గర లో వచ్చి ఆగింది.
బ్రాండెడ్ దుస్తులు వేసుకుని దర్జా గా ఉన్న ఒకతను కారు దిగాడు. అతని కారు, వస్త్ర ధారణ అతను శ్రీమంతుల బిడ్డ అని చెప్పకనే చెబుతున్నాయి.
ఫెరారీ కారు కమర్షియల్ లో లాగా అమ్మాయిలు షాక్ లో ఉండిపోయారు. హరిణి మాత్రం ఇవేవీ పట్టనట్లు తల వంచుకొని క్లాస్ రూమ్ లోనికి వెళ్ళి పోయింది.
కొద్ది సేపట్లో అతను హరిణి క్లాస్ రూమ్ లోనే ప్రత్యక్షమయ్యాడు. అతని తో పరిచయం కోసం క్లాస్ లోని వారు ఆసక్తి కనకనబరచటం ఒక కంట గమనిస్తూనే ఉంది.
ఒక నెల అయ్యాక ల్యాబ్ గ్రూప్ లు ప్రకటించారు. మొదటి రోజు ఫిజిక్స్ ల్యాబ్ కు వెళ్ళిన హరిణి కి అతను తన బ్యాచ్ మెట్ గా ఎదురయ్యాడు. "నా పేరు హరీష్" అని అతను పరిచయం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దానికి ఆమె సమాధానం గా చిన్న నవ్వు నవ్వి తన పేరు చెప్పి ఆ తరువాత ల్యాబ్ ప్రయోగాన్ని అమర్చటం లో మునిగి పోయింది.
“న్యూటన్ గారి మూడో సూత్రం ప్రయోగం విఫలమయ్యింది” అన్నాడు అతను అకస్మాత్తుగా.
ఆమెకు అర్థం కానట్లు అతని వైపు తిరిగి చూసింది.“అంటే నేను షేక్ హ్యాండ్ ఇస్తే మీరు ప్రతి గా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు గా, ఆయనేమో చర్య కి ఒక సమానమైన ప్రతిచర్య ఉంటుంది అని చెప్పారు…” అంటూ గొణిగాడు.
దానికి ఆమె అతని వైపు సీరియస్ గా ఒక చూపు విసిరింది.అసలే విశాలమైన కళ్ళు ఏమో, ఆమె కళ్ళు పెద్ద గా చేసి అతని వైపు చూసే సరికి అతని నోటి వెంట మాట రాలేదు.“మనం ఈ రోజు చేయాల్సింది న్యూటన్ గారి కాంతి సూత్రానికి సంబంధించిన ప్రయోగం” అని చెప్పి ఆమె ప్రిజమ్ అమర్చటం ముగించింది.
“చూడండి, కాంతి ప్రిజమ్ గుండా వెళ్ళి ఈ తెర మీద ఇంద్ర ధనస్సు రంగులు కనిపిస్తున్నాయా?” అని అడిగింది.“అవును ఎరుపు, పసుపు, నీలం – మూడు రంగులు కనిపించాయి” అన్నాడతను ఉత్సాహం గా.
ప్రయోగం చేయటం ఆపేసి ఆమె అతని వైపు ఆశ్చర్యం గా చూసింది.
మరునాడు కెమిస్ట్రీ ల్యాబ్ లో కూడా హరిణి కి అతనే ఎదురయ్యాడు.
“మళ్ళీ మీకు నేనే బ్యాచ్ మేట్ అని నన్ను తిట్టుకోకండి, మన తల్లి దండ్రులు చేసిన పొరబాటు ఇది” అన్నాడు అతను.
“ఏమిటా పొరబాటు?” అన్నది ఆమె సందేహం గా.
“అదే, మన ఇద్దరి పేర్లు పక్క పక్క నే పెట్టడం, అందుకే గా ఒకే బ్యాచ్ లో ఉన్నాం” అన్నాడు చిన్న గా నవ్వుతూ. ఆమె కూడా అతని తో పాటు ఇబ్బంది గా నవ్వింది.
ల్యాబ్ అయిపోగానే, “హరిణి గారు, కాఫీ కి వెళ్దామా?” అని సంకోచం గా అడిగాడు.
“తప్పకుండా, కెమిస్ట్రీ ల్యాబ్ కదా కాఫీ రసాయన నామం తో అడగండి, అలాగే వెళ్దాం” అంది.
“కాఫీ కి రసాయన నామం ఏమిటి, అయినా కాఫీ లో బోలెడు రకాలు ఉంటాయి, దేనికని చెప్పాలి ?” అని అతను బుర్ర గోక్కున్నాడు.
అలా ఒక వారం రోజులు గడిచిన తరువాత ఒక రోజు హరిణి కాలేజీ కి వస్తుంటే అతను కారు ఆపి లిఫ్ట్ అడిగాడు. పర్లేదు అని హరిణి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
“ప్లీజ్ త్వర గా ఎక్కండి, వెనక వాహనాల వాళ్ళు హారన్ మొగిస్తున్నారు” అని బ్రతిమాలాడు. ఇంక తప్పదన్నట్లు ఆమె కార్ ఎక్కి కూర్చుంది.
"మీరు రోజూ కాలేజీ కి కష్టపడి నడిచి రావటం ఎందుకండి. మీ ఇల్లు ఎక్కడో చెప్తే నేను మిమ్మల్ని రోజూ పికప్ చేసుకుంటాను" అన్నాడు.
"చూడండి, మీరు అందరి తో ఎలా ఉంటారో నాతో కూడా అలానే ఉండండి. నా మీద ఎవరూ సానుభూతి చూపటం నాకు ఇష్టం ఉండదు" అని ఆమె కోపం గా చెప్పింది.
ఆ సమాధానికి గతుక్కుమన్న అతడు "క్షమించండి, నా ఉద్దేశ్యం మిమ్మల్ని కించ పరచాలని కాదు, మీకు సహాయం చేద్దామని " సంజాయిషీ ఇచ్చాడు..
"సారీ, నేనే కొంచెం తొందర పడ్డాను" అపరాధ భావం ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది.
ఒక నిమిషం నిశ్శబ్దం తరువాత అన్నాడు “నేను కాఫీ రసాయన నామం చెబితే నాతో కాఫీ కి వస్తారా?”
“ఏమిటో చెప్పండి ముందు” అంది ఆమె చిన్న గా నవ్వి.
“కోబాల్ట్ ఐరన్ Co(Fe)2, దాన్ని విశదీకరిస్తే CoFFee ” అన్నాడు.
దానికి ఆమె గట్టి గా నవ్వి “మీ లాజిక్ బాగుంది. సరే రేపు వెళ్దాం లెండి అంది."
మరునాడు ఇద్దరూ కాలేజీ కాంటీన్ లో కలిశారు.
"మీకు నాట్యం అంటే చాలా ఇష్టం అనుకుంటా" అతను మొదలు పెట్టాడు.దానికి ఆమె కళ్లల్లో ఒక మెరుపు మెరిసింది "మీకెలా తెలుసు?" అని అడిగింది.
"మీ వర్క్ బుక్ లో జయంతి గారి ఫోటో చూసి ఆవిడ గురించి తెలుసుకున్నాను. కాన్సర్ ని నృత్యం తో అధిగమించారని తెలిసి ఆశ్చర్య పోయాను." అన్నాడతను.
"అవునండి, నాకు ఆవిడ అంటే చాలా అభిమానం. ఎప్పటికైనా ఆమె వద్ద నృత్యం నేర్చుకోవాలని నా కోరిక " అంది.
"మీ కోరిక తీరాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను" అన్నాడు హరీష్ నవ్వుతూ.
అన్నాడు కానీ అది అంత తొందర గా నిజం అవుతుందని ఆమె అనుకోలేదు.
మరునాడు కాలేజీ పూర్తవగానే అతను ఆమె ని అనుసరించి వచ్చాడు.
"హరిణి గారు, మీకోక శుభ వార్త. జయంతి గారు ఎక్కడ ఉంటారో తెలిసింది. ఆవిడ తో మాట్లాడి మీ అపాయింట్మెంట్ ఖాయం చేశాను. సాయంత్రం ఐదు గంటలకు, వస్తారా" అని.
ఆనందం, తడబాటు, సంశయం అన్నీ భావాలు కాలగలసిన ఆమె ముఖం చూసి మళ్ళీ అన్నాడు.
"చాలా కష్ట పడి ఆవిడ అపాయింట్మెంట్ సంపాదించాను, ప్లీజ్ కాదనకండి".ఆమె చివరకు ఒప్పుకుంది.
ఇద్దరూ కాసేపట్లో ఆవిడ వద్దకు చేరుకున్నారు. జయంతి గారిని కలిసి హరిణి ఆనందం పట్టలేక పోయింది. కొద్ది సేపు ఆమె తో మాట్లాడిన తరువాత జయంతి గారు హరిణి పట్టుదల, సంకల్పం చూసి ఆమెకు నాట్యం నేర్పటానికి అంగీకరించారు. అంతే కాదు ఆమె రోజూ ప్రయాణం చేయనవసరం లేకుండా ఒక ఆప్ సహాయం తో ఆమె ఇంట్లో నుండే సాధన చేసే వీలు కల్పించారు.
తిరుగు ప్రయాణం లో హరీష్ కు హరిణి ఎన్నో సార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది.
ఏం చేసి మీ రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అంది. దానికి హరీష్ నవ్వుతూ వెంటనే అన్నాడు,
"హమ్మయ్య మీరు అలా అడుగుతారా లేదా అని ఎదురు చూస్తున్నా.
నిజం గా మీరు చేయగలిగే సహాయం ఒకటి ఉందండి. నాకు రంగులు గుర్తించటంలో ఒక సమస్య ఉంది. దాన్ని వర్ణ అంధత్వం అంటారు మన సైన్స్ భాష లో.
మన ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు ల్యాబ్ ల లోనూ ఫలితాలు సరి చూడాలంటే అన్ని రంగులూ తెలియాల్సిందే. ఈ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్ష కి మీరు ఏమి అనుకోకుండా నాకు రంగుల విషయం లో సహాయం చేస్తారా?"
దానికి ఆమె నివ్వెర పోతూ అంది.
"ఇలాంటి లోపం ఎవరికైనా ఉంటుందని నాకు అసలు తెలియదు. మీరు మొదటి రోజు మూడు రంగులే చెబితే అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అయ్యింది సుమా ... అలాగే తప్పకుండా, మీరు చేసిన సహాయం ముందు ఇదెంత" అంది.
“లోపం లేని మనిషి ఎక్కడ ఉంటారండి, కొందరికి పైకి కనిపించే లోపం అయితే కొందరికి కనిపించని లోపం అంతే” అన్న అతని సమాధానం ఆమెకు ఎక్కడో గుచ్చుకున్నట్లు అనిపించింది.
వారిద్దరి మధ్య ఆ రోజు చిగురించిన స్నేహం తరువాతి మూడు సంవత్సరాల లో మరింత బల పడింది. దానితో పాటే హరిణి కి నృత్యం మీద పట్టు కూడా బలపడుతూ వస్తోంది.
డిగ్రీ చివరి సంవత్సరం, చివరి రోజు. చెన్నై మరీనా బీచ్ లో హరిణి, హరీష్ ఇసుక తిన్నెల మీద కూర్చుని ఉన్నారు.
అప్పుడే అస్తమిస్తున్న సూర్య కిరణాలు పడి సముద్రపు నీరు బంగారపు వర్ణం లో మెరుస్తోంది. అప్పుడు అతను ఆమె చేతి ని తన చేతి లోనికి తీసుకొని భావోద్వేగం తో అన్నాడు."ఆ సముద్రం మీద సూర్య కిరణాలు పడి ఆ సముద్రానికి మరింత వన్నె ని తీసుకొచ్చాయి కదా.. అలాగే నువ్వు కూడా నా జీవితం లోనికి వచ్చిఒక కొత్త వన్నె ని తీసుకొస్తావా. జీవితాంతం నాకు తోడు గా ఉంటావా?"
దానికి హరిణి ఉదాసీనం గా అంది “రథం లేనిదే నడవ లేని అరుణిడి కి, వేగాన్ని కోరుకునే విశాలమైన సముద్రానికి, పొంతన ఎలా కుదురుతుంది? ”
“అందం, ఆస్తి, అర్థం చేసుకునే మనసు – అన్నీ ఉన్న నిన్ను జీవితాంతం ఆశ పడితే అది అత్యాశే అవుతుంది. “ అంటూ ఒక కంట బలవంతం గా జారిన కన్నీటి బొట్టును తుడుచుకుంది.
దానికి హరీష్ ఆమె ఆమె భుజం మీద చేయి వేసి దగ్గర గా జరిగి ఆమె కళ్ల లోనికి సూటి గా చూస్తూ అన్నాడు “ఆస్తి, శరీరం అమ్మా నాన్నలు ఇచ్చింది, దానికి మన గొప్పదనం ఏముంది? వ్యక్తిత్వం ఒక్కటే మనిషి సంపాదించుకునేది. ఎవరి మీదా ఆధార పడని నీ ఆత్మ గౌరవం, దేనినైనా సాధించాలన్న నీ పట్టుదల – ఇవే నన్ను బాగా ఆకర్షించాయి. "
" చిన్నప్పటి నుండి ఏ కష్టం తెలీకుండా పెరిగాను. నా చుట్టూ ఎప్పుడూ నన్ను పొగిడేవారు, నా డబ్బుకు ఆశ పడ్డ వారే ఉండేవారు.నీ పరిచయం తరువాత నాకు జీవితం విలువ తెలిసింది, ఒక లక్ష్యం ఏర్పడింది ."
దానికి ఆమె చూపు క్రిందకు తిప్పుకొని అంది “ఈ ఆకర్షణ జీవితాంతం నిలుస్తుందా? నువ్వే అన్నావు కదా నాకు ఆత్మ గౌరవం ఎక్కువ అని, అందుకే చెప్తున్నాను. నీకు తెలుసు కదా నా ఆశయం, బాధ్యత ఏమిటో – నా లక్ష్యాన్ని చేరటానికి కనీసం మూడు సంవత్సరాలు పట్టవచ్చు ఇంకా ఎక్కువ అయినా పట్టవచ్చు. నా మాట విని నువ్వు అన్ని విధాలా నీకు సరి తూగే అమ్మాయిని పెళ్లి చేసుకో”.హరీష్ కొద్ది నిమిషాలు మాట్లాడలేదు. తుఫాను ముందు వచ్చే ప్రశాంతత ఏమో...
---------------------------------------
మూడు సంవత్సరాల తరువాత
----------------------------------------
చిదంబరం నటరాజ ఆలయం లో మహా శివరాత్రి వేడుకలు ఘనం గా జరుగుతున్నాయి. అందులో భాగం గా నాట్య ప్రదర్శన జరుగుతోంది. కొద్ది సేపటి లో హరిణి నాట్య ప్రదర్శన ప్రారంభమయ్యింది. అందమైన హావ భావాల తో, లయ బద్దమైన ముఖ కవళిక లతో అలరిప్పు పాట కు నృత్యం చేసి అలరించింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య నిర్వాహకులు వేదిక మీదకి వచ్చి మాట్లాడారు.
“ఇది నాట్యకారిణి హరిణి గారి తొలి ప్రదర్శన. మీరు ఆమె నాట్యం నచ్చిందని మీ చప్పట్లే చెబుతున్నాయి. మీకు తెలియని విషయం ఏమిటంటే ఆమెకు చిన్నతనం లో పోలియో సోకి ఒక కాలు పాక్షికం గా చచ్చుబడి పోయింది. అయినా అకుంఠత దీక్ష తో, పట్టుదల తో సాధన చేసి ఇంత అద్భుతమైన ప్రదర్శన ను మన ముందు ఉంచారు. హరిణి గారు వేదిక మీద కు వచ్చి మాట్లాడ వలసింది గా కోరుతున్నాను” అని ఆమె ముగించకుండానే సభ లో కూర్చున్న వారు అందరూ గౌరవ పూర్వకం గా నుంచుని చప్పట్లు కొట్టారు.
హరిణి మాట్లాడటం మొదలు పెట్టింది.“అందరికీ నమస్కారం. ఒక కృత్రిమ కాలు తో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోధించిన అరుణిమ సిన్హా గారి కంటే కానీ, నాట్య మయూరి సుధా చంద్రన్ గారి కంటే గాని నేను గొప్ప దాన్ని కాదు. అయితే శారీరక లోపం చిన్నదో పెద్దదో ఉన్న నా సోదర సోదరి మణుల తరఫున నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను.
నా పేరు హరిణి- నేను ఒక లేడి పిల్ల లా పరిగెత్తాలని నా తల్లి దండ్రులు ఆశ పడ్డారు కానీ నాకు పోలియో చుక్కలు వేయించటం లో అశ్రద్ధ చేశారు. ఆ అశ్రద్ధ నాకు పోలియో వచ్చాక నిస్సహాయత గా మారింది.
పెరుగుతున్న వయసు లో స్కూల్ లో నా తోటి విద్యార్ధులు నన్ను అవహేళన చేస్తుంటే బాధ ను ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపలే దిగమింగుకున్నాను.
శరీరం వల్ల కలిగిన బాధ కన్నా, మనసుకి కలిగిన గాయాలే ఎక్కువ బాధించేవి. చిన్నప్పటి నుండి మా బంధువులు, పొరుగు వారు నా పై సానుభూతి చూపుతుంటే నాకు ఏదో తెలియని అసౌకర్యం గా ఉండేది.
నాకు చిన్న తనం నుండి భారత నాట్యం నేర్చుకోవాలని ఉండేది. కానీ మా టీచర్ లు నేను పడిపోతాననో, లేక సరిగా నృత్యం చేయలేనేమోనన్న భయం తో నన్ను క్లాసు కి దూరం గా ఉంచే వారు.
ఈ భయాలు, నిరుత్సాహాలు, అవమానాల మధ్య పెరిగిన నాకు కాళ్ళు సవ్యం గా ఉన్న వారు చేసేవి అన్నీ నేను చేసి చూపించాలి అని కసి గా ఉండేది. అందుకే ఎప్పటికైనా నాట్యం చేయాలన్న నా కల ఈ రోజు నా సొంతమయ్యింది.
ఈ రోజు నేను మీ ముందు ఉండి మాట్లాడుతున్నానంటే ముఖ్య కారణం ఇద్దరు వ్యక్తులు, వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఒకరు హరీష్ - ఆడగ కుండానే అతను నా ఆశ ని, ఆశయాన్ని గౌరవించి నన్ను నాట్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాడు.
రెండవ వ్యక్తి నా గురువు గారైన జయంతి గారు. ఆవిడ నా మీద నమ్మకం తో ఎంతో ఓర్పు గా, క్రమం తప్పకుండా ఆరు సంవత్సరాలు గా శిక్షణ ఇస్తూనే ఉన్నారు. అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ, మొదట చిన్న చిన్న కాళ్ల కదలిక తో మొదలు పెట్టి నెమ్మదిగా కొంచెం కష్టమైన భంగిమల వరకు పెంచుతూ శిక్షణ ఇచ్చారు.
నిజం చెప్పాలంటే ఈ శిక్షణ కు ముందు కాలిపర్ సహాయం లేనిదే నడవ లేని నేను ఇప్పుడు కొన్ని పనులు స్వతంత్రం గా చేసుకోగలుగుతున్నాను. నాట్యాన్ని పోలియో తో జయించటానికి ఇది నా మొదటి అడుగు అనే చెప్పాలి.
ఇక ముగించే ముందు ఇక్కడ కి విచ్చేసిన పెద్దలకు నా మనవి ఒకటే – మమ్మల్ని మీలో ఒకరి గా భావించి మా ఆశయాలను గౌరవించి, మాకు చేయూత నివ్వండి చాలు. ఈ సదుద్దేశ్యం తోనే హరీష్ తో కలిసి హరివిల్లు అనే ఆశ్రమాన్ని ఆరోవిల్లె లో స్థాపిస్తున్నాము. ఈ రోజు ఈ ప్రదర్శన వలన వచ్చిన విరాళాలు ఆ సంస్థకి చెందుతాయి."
సభ కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోతూ ఉంది.
-------------------------------------------
ఒక నెల తరువాత
------------------------------------------
అది పాండిచేరి వద్ద ఆరోవిల్లె ఆశ్రమం. భిన్నత్వంలో ఏకత్వం ధ్వనించే స్థలం, ప్రపంచం నలుమూలల నుండి అరవై దేశాల వారు ఒకే కుటుంబం గా నివసిస్తున్న గ్రామం. అందులో ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో హరివిల్లు ఆశ్రమం.
హరీష్ ఆశ్రమ ప్రారంభవోత్సవ వేదిక మీద మాట్లాడుతున్నాడు.
"ఇంద్రధనస్సులో అన్ని రంగులూ ముఖ్యమైనవే. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కాదు. అన్ని రంగులతో చూసినప్పుడే ఇంద్రధనస్సు అందంగా కనిపిస్తుంది. అలాగే భగవంతుని సృష్టి లో అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న పిల్లలు దివ్యాంగులు ను చూసి వారి పట్టుదల, ఆత్మస్థైర్యం నేర్చుకోవాలి. వారితో ఎలా ప్రవర్తించాలో తెలియాలి. అందుకే మా ఆశ్రమంలో అన్ని రకాల పిల్లలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఏ తారతమ్యాలు లేకుండా కలసి మెలసి పెరుగుతారు. అలాగ పెరగగలిగే మంచి వాతావరణాన్ని మేము కల్పిస్తాము..."
------------------------------------------------------------------------------------------------------------------------------------
పోలియో ని నాట్యం తో జయించవచ్చా – అవుననే చెప్తున్నారు నృత్య థెరపీ ని నిర్వహిస్తున్న సుచిత్ర గారు.
ఈ కథ కి స్ఫూర్తి నాతో పని చేసిన ఒక సహోద్యోగి. ఆమెకు పోలియో సోకింది. అయితే ఆమెపై ఎవరూ సానుభూతి చూపటం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. కార్ డ్రైవింగ్ తో సహా అన్ని పనులు స్వయంగా చేసుకుంటూ, ఎవరి మీద ఆధార పడకుండా పది మందికి స్ఫూర్తిగా నిలుస్తారు.