Death war in Snow in Telugu Motivational Stories by Soudamini books and stories PDF | మంచు తో మృత్యు పోరాటం

Featured Books
Categories
Share

మంచు తో మృత్యు పోరాటం

తెల్లవారుఝామున మంచి నిద్ర లో ఉన్న మాలతి కి లాండ్లైన్ ఫోన్ మ్రోగటం తో మెలకువ వచ్చింది. ఫోన్ లో అవతల వ్యక్తి చెప్పిన విషయం విని షాక్ కు గురయ్యింది.

కొద్ది సేపటికి తేరుకున్న మాలతి లేచి వెంటనే టివి పెట్టింది. టివి లో వార్తలు వస్తున్నాయి..

భారత కీలక సరిహద్దు ప్రాంతం అయిన సియాచిన్ లో మంచు తుఫాను కారణంగా పది మంది సైనికులు మంచులో కూరుకు పోయినట్లు సమాచారం. వారి జాడ కోసం గాలిస్తున్నారు.

సిమ్లా ఒప్పందం వరకు భారత దేశం గాని, పాకిస్థాన్ గాని సియాచిన్ గురించి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆ ప్రదేశం పాకిస్థాన్ కు బలమైన స్థావరంగా మారుతోందని తెలియటం వల్ల భారత దేశం 1984 లో మొదటి సారి భారత్ సియాచిన్ లోని కీలకమైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

సియాచిన్ ప్రపంచం లోనే అతి ఎత్తయిన, అతి శీతలమైన యుద్ధ భూమి. సియాచిన్ లో పగటి ఉష్ణోగ్రతలు -30 డిగ్రీలు ఉంటే రాత్రి ఉష్ణోగ్రతలు -50 డిగ్రీ ల వరకు కూడా చేరుకుంటాయి. అంటే ఎముకలు కోరికే, విరగగొట్టే చలి అన్నమాట. అది వినటానికే ఒళ్ళు గగుర్పొడుస్తోంది కదా. అటువంటి ఉష్ణోగ్రతలలో, సముద్ర తీరానికి దాదాపు 20 వేల అడుగుల ఎత్తు లో ఉన్న ఆ ప్రదేశం లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుందేమో గాని భారత సిపాయిల దేశ భక్తి కి కొదవ ఉండదు. ఇక్కడ సైనికులు శత్రువు తోనే కాదు, ప్రకృతి తో కూడా అనునిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. అకస్మాత్తుగా విరుచుకుపడే మంచు తుఫానులు ఇక్కడ సర్వ సాధారణం. ఇప్పటివరకు దాదాపు వెయ్యి మంది సైనికులు కేవలం ఇక్కడి చలి వాతావరణానికే బలి అయిపోయారు. అలాగే ఈసారి వచ్చిన మంచు తుఫాను చాలా తీవ్రంగా ఉండటం వల్ల పది మంది సైనికులు దట్టమైన ఆ మంచు క్రింద కూరుకు పోయినట్లు భావిస్తున్నారు.

మాలతి ఆ వార్త చూస్తూ బయటకు పొంగి వస్తున్న కన్నీళ్లను లోపలే దిగ మ్రింగుకుంటూ అలా నిస్తాణువులా
ఉండిపోయింది. ఈ లోగా తలుపు చప్పుడు అయ్యింది. ఇప్పటికే ఈ విషయం టివి లో చూసిన ఊరి జనం ఇంటికి వచ్చేశారు.

“అమ్మా, మాలతి నువ్వేం గాబరా పడకు. మన రామన్న ఈరుడు , ఆడు మామూలోడు కాదు. ఆడు తొందరగా మామూలు మనిషి అయిపోయి తిరిగి వచ్చేయాలని ఆ రాములోరీ గుళ్ళో పూజలు సేత్తమ్. నువ్వేమి దిగులు పడకు తల్లి” అని అందరూ ధైర్యం చెప్తున్నారు.

మాలతి తో రామన్న ముందు రోజే సాటిలైట్ ఫోన్ లో మాట్లాడాడు. ఆ రోజునే అతను సియాచిన్ పోస్టు కి చేరుకున్నాడు. ఇక నుండి వారానికి రెండు నిమిషాల పాటు అతనితో మాట్లాడవచ్చుట. నెల రోజుల తరువాత అతని గొంతు విన్న ఆనందంలో ఆ రోజు సంబరం జరుపుకుంది. అంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించనేలేదు.

ముందు రోజు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని రామన్న, మరొక నలుగురు సైనికులతో సహా తమ పోస్టు అయిన సోనమ్ పోస్టు కు చెరటానికి కాలి నడకన సన్నద్ధమయ్యారు. మూడు వారాల ప్రయాణం వలన ఆ చల్లటి వాతావరణానికి అందరూ కొంచెం కొంచెం అలవాటు పడుతున్నారు.

పది మంది తో ట్రైనింగ్ నుండి బయలు దేరిన క్యాంప్ లో ఇప్పుడు ఐదు గురు మాత్రమే మిగిలారు..

హైపో థర్మియ (అత్యంత చల్లటి వాతావరణం వాళ్ళ కలిగే స్థితి) వలన గుండె ఆగిపోయి మొదటి రోజునే ఒక సైనికుడు కుప్పకూలి పోయాడు.

ఊపిరితిత్తులలో నీరు చేరి హాపే వ్యాధితో కొద్ది రోజులకే మరొక సైనికుడు బలి అయిపోయాడు.

హాకో వలన మెదడు లో నీరు చేరి వెంటనే వైద్య సహాయం అందక మరొక సైనికుడు తన విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

చేత్తో మంచు గొడ్డలిని పోరాబాటున గ్లోవ్ లేకుండా ముట్టుకోవటం వలన మరొక సైనికుడి చేయి మొద్దుబారిపోయింది. చేయిని ఇక శరీరం నుండి వేరు చేయటానికి అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.

సూర్య రశ్మి కిరణాలు నేరు గా కంటిని తాకటం వాళ్ళ వైట్ ఐ వ్యాధితో ఒకతను కంటి చూపు పొగట్టుకొని హెలికాప్టర్ సహాయంతో బేస్ క్యాంప్ కు తిరుగు పయనం అయ్యాడు.

ఇంకా పోస్టు కు చేరటానికి ఒక్క రోజే మిగిలి ఉంది. పోస్టుకు సమీపం అవుతున్న కొద్దీ వారిలో కొత్త ఉత్సాహం పుంజుకుంటోంది.

ఆ రోజు ఉదయం ఒక సైనికుడు కంకరు లా ఉన్న మంచు గడ్డలను సుత్తి తో అరగంట ముక్కలు చేసిన తరువాత ఆ మంచుని కిరోసిన్ స్టౌ లలో వేడి చేశారు. ఒక అర గంట తరువాత ఆ మంచు కరిగి త్రాగు నీరు గా మారింది. ఆ కిరోసిన్ వేడి లోనే పాత్ర లను మంచు తో శుభ్రం చేసుకున్నారు. ఒక రెండు గంటలు వేడి చేశాక తమతో తెచ్చుకున్న సూప్ పాకెట్లను వేడి చేసి పొయ్యి మీద నుండే సూప్ ని తాగేశారు. సూప్ తాగటం ఒక నిమిషం ఆలస్యం అయినా అది నోటి లోనికి వెళ్ళే లోగా మరలా మంచు గా మారిపోతుంది.

ఐదారు జాకెట్లు ఒక దాని మీద ఒకటి వేసుకొని, మోకాళ్ళ వరకు ఉండే మంచు బూట్లు వేసుకొని, కళ్ళకు కళ్ళద్దాలు పెటుకొని – పై ఉంది క్రింది వరకు అన్నీ దట్టంగా కప్పుకొని ఇక ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. వాళ్ళు వేసుకునే బట్టలు , షూస్, వాళ్ళు తీసుకెళ్ళే మంచు గొడ్డలి, కత్తి వంటి ఆయుధాలు అన్నీ కలిపి 20-30 కేజి ల బరువు ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

ఆ రోజు రామన్న, మిగిలిన నలుగురు సైనికులు యధాతధంగా నడుముకి తాడు కట్టుకొని ఒకరి వెనుక మరొకరు బయలు దేరారు. మోకాళ్ళ వరకు మంచు ఉండటం వలన ఒక అడుగు తీసి మరొక అడుగు వేయాలంటే ఒక నిమిషం పడుతోంది. రామప్ప ముందు ఉండి అందరినీ నడిపిస్తున్నాడు.

అలా కొంత దూరం నడిచాక ఈ సారి ఒక నిటారుగా ఉన్న మంచు కొండ వచ్చింది. మంచు సుత్తి లను తీసుకొని మంచులో గుచ్చుతూ బూట్ల సహాయం తో పట్టు తెచ్చుకుని పైకి ఎక్కుతున్నారు. అప్పుడప్పుడు జారి పడిపోతున్నా, అందరూ ఒకే తాడు తో కట్టి ఉండటం వలన మరలా పట్టు తెచ్చుకుని ఎక్కుతున్నారు. ఆ ఎక్కే క్రమంలో అప్పుడప్పుడు పై కొండ నుండి దొర్లి జారిపోతున్న బండ రాళ్ళు నుండి తప్పించుకుని మరలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. పైకి వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ తగ్గుతూ ఊపిరి అందటం కష్టం గా ఉంది.

మంచు కొండ నెమ్మదిగా ఎక్కిన తరువాత మరొక పెద్ద హిమాని నదం వచ్చింది. దాని కోసం ముందే ఏర్పాటు చేసుకున్న తీగ నిచ్చెన లను వాడి ఒకరి తరువాత మరొకరు ఆ హిమాని నదం అవతల ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ప్రయత్నం లో కొద్దిగా చెమట పట్టడం సహజమే. ఆ చెమట కూడా ఐదారు పొరల మందపాటి జాకెట్ల క్రింద గడ్డ కట్టుకు పోయింది. ఆ చెమట శరీరానికి తగిలి గుచ్చుకుంటూ శరీరాన్ని కోసేస్తుంటే ఆ బాధ భరిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

అలా మంచులో ఒక రెండు గంటలు నడిచి ఉంటారు. మామూలు పరిస్థితిలో అయితే ఆ దూరం నడవటానికి పది నిమిషాలు సరిపోయేది. ఇక్కడ మంచు ఎక్కువగా, ఆక్సిజన్ తక్కువ ఉండటం వల్ల త్వరగా నడవటం కుదరని పని. రామన్న మొదట కర్ర తో మంచులో గుచ్చి చూస్తాడు. అది గట్టిగా ఉంటే మిగిలిన వారిని అనుసరించమని సౌజ్ఞ చేస్తాడు. ఒక చోట ఆ కర్ర లోతుగా వెళ్ళిపోయింది. మంచు కింద హిమాని నదం ఉన్నట్లు గుర్తించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతడు ఆ హిమాని నదం లోకి జారీ పోయాడు. ఆ హిమాని నదం చాలా లోతు గా ఉంది. రామన్న తాడు సహాయం తో గాలిలో వేలాడుతున్నాడు. అతడి అనుచరులు నలుగురూ అతడిని బలం గా తాడు సహాయం తో పైకి లేపటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాడు ఆ మంచులో జారిపోతూ ఉండటంతో తనతో ఉన్న మిగిలిన నలుగురు అయినా బ్రతుకుతారు అన్న ఆశ తో అతడు ఆ తాడును కోసేయమని సౌజ్ఞ చేశాడు. కానీ అతని సహచరులు ఆ ఆజ్ఞ ఈ సారి వినలేదు. అప్పటికే మూడు వారాలు కష్టాలలో కలిసి బ్రతికిన అనుబంధం. ఈ సారి తమ సహచరుడిని కోల్పోయే పరిస్థితిలో వారు లేరు. ఒక తాడుకి గిలకను కట్టి అది విసిరి అతడిని ఒడిసి పట్టుకోమన్నారు. అతడు పట్టుకున్నాక “జై ఒపిబాబా” అని అరుస్తూ సాయశక్తులు ఒడ్డి అతడిని పైకి లాగారు. ఈ సారి వారి ప్రార్థనలు ఫలించాయి. ట్రైనింగ్లో వారికి పరిచయం అయిన దేవుడు ఓపి బాబా కనికరించి రామన్న సజీవంగా బయటపడ్డాడు.

మొత్తానికి పోస్ట్ చేరుకొని ఫైబర్ గ్లాస్ తో చేసిన ఆ చిన్న గుడారం లో అందరూ నివాసం ఉండబోతున్నారు. తమ ఆహార అవసరాలను తీర్చే హెలికాప్టర్ వస్తున్నట్లు సాటిలైట్ ఫోన్ ద్వారా సందేశం వచ్చింది. కొద్ది సేపటిలో హెలికాప్టర్ నుండి ఆహారం, దుస్తులు పారాషూట్ రూపం లో జారి పడ్డాయి.

మూడు వారాలుగా ప్రమాదాలను జయించి గమ్యాన్ని చేరామన్న వారి ఆనందం, కొద్ది నిమిషాల లోనే మంచు తుఫాను వల్ల మట్టి కలిసి పోబోతుందన్న సంగతి వారికి అప్పటికి తెలీదు.

ప్రస్తుతం

సోనమ్ పోస్టు వద్ద మంచు తుఫాను వచ్చినట్లు బేస్ క్యాంప్ వద్ద రెస్క్యూ టీం వారికి సమాచారం అందింది. ఆ పోస్ట్ వద్ద హెలిపాడ్ ఉంది కానీ వెంటనే హెలికాప్టర్ ను పంపలేని పరిస్థితి. మంచు దట్టం గా ఉండటం వల్ల కిందా పైనా అంతా తెల్లగా ఉండి ఏది ఆకాశమో లేక ఏది మంచు కొండో గుర్తించటం కష్టం. అందుకే వారు ఆ పరిస్థితి లో ఏమి చేయాలో పాలుబోక వాతావరణం మెరుగు అయ్యేవరకు ఎదురు చూస్తున్నారు. కొందరు రామన్న సహచరులు అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్ బాబా గుడికి వెళ్ళి కనిపించకుండా పోయిన సైనికుల కోసం ప్రార్థనలు చేశారు. ఒక సారి పాకిస్థాన్ మన మీద కాల్పులు జరిపినప్పుడు సరిహద్దుల్లో ఉన్న సైనికుల గుడారం లోని ప్రెషర్ కుక్కర్ కు క్షిపణి తగిలి మన సైనికులు బ్రతికారుట. అప్పటి నుండి ఆ విరిగి పోయిన ప్రెషర్ కుక్కర్ ముక్కలకు గుడి కట్టి పూజిస్తున్నారు. ఆ గుడి మీద అక్కడ వారికి ఎంతో గురి. మరి ఆ బాబా ఎంతవరకు కరుణిస్తాడో చూడాలి...

రెండవ రోజు

పదకొండు గంటల ప్రాంతం లో వాతావరణం కొంత నెమ్మదించింది. సోనమ్ పోస్టుకి దగ్గరగా ఉండే మరొక పోస్టు నుండి సైనికులు ముందుగా తరలి వచ్చారు. డాక్టర్లు, ట్రైనర్ లు, కొందరు సిపాయిలతో కూడిన రెస్క్యూ టీం మరి కొద్ది సేపటికి ఆ ప్రాంతం లో హెలికాప్టర్ నుండి పారాషూట్ లలో దిగారు. ఆ ప్రాంతమంతా దట్టమైన మంచు దిబ్బలు పరచినట్లు ఉంది. ఇంకా జోరున మంచు కురుస్తూనే ఉంది. సైనికులు గల్లంతు అయిన పోస్టు మీద 25 అడుగుల ఎత్తు వరకు మంచు కూరుకుపోయినట్లు అంచనా వేశారు . అంత విశాలమైన ప్రాంతం లో చిక్కుకుపోయిన పది మంది సైనికులను వెతకటం అంటే ఆషామాషీ కాదు. సిపాయిల సాటిలైట్ ఫోన్ నుండి వస్తున్న సిగ్నల్స్ సహాయం తో వెతకటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ వాతావరణం వల్ల సిగ్నల్స్ చాలా పలుచగా ఉండి ఎక్కడ నుండి సిగ్నల్ అందటం లేదు. వారికి ఎవరైనా బ్రతికి ఉండవచ్చు అన్న ఆశ నెమ్మదిగా సన్నగిల్లింది. పరిస్థితి ని హై కమాండ్ కు ఎప్పటికప్పుడు అందచేస్తూనే ఉన్నారు.

ఆటువంటి వాతావరణం లో బ్రతికి ఉండటం అసాధ్యమని భావించిన ప్రభుత్వం ఆ పది మంది సైనికులు మరణించినట్లు ప్రకటించి వారికి ప్రభుత్వ లాంఛనాలతో శ్రద్ధాంజలి అర్పించింది.

ఈ వార్తను విన్న మాలతి, ఆమె కుటుంబ సభ్యులు కూడా వారి గ్రామం లో రామన్న కు నివాళి అర్పించారు. మాలతి కంటి లోనుండి ఒక్క చుక్క కూడా నీరు రాలేదు. ఆమె కన్నీళ్ళు కూడా మంచు లాగానే గడ్డ కట్టి కంటి మూలలో దాగున్నాయి. ఎక్కడో ఒక మూల అతడు బ్రతికే ఉన్నాడన్న ఆశ తో.

మూడవ రోజు

అంత దట్టమైన మంచు క్రింద ఎవరైనా బ్రతికి ఉండకపోయినా కనీసం వారి శవాలను అయినా వారి కుటుంబం వారికి అందించాలన్న పట్టుదలతో రెస్క్యూ టీం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కాంక్రీటు కంటే దట్టం గా ఉన్న మంచును కరిగించటం చాలా కష్టతరం. ఆ మంచు కాంక్రీట్ శ్లాబ్ అంత గట్టిగా ఉంది. ఎలెక్ట్రిక్ సా, రాక్ డ్రిల్ ల సహాయం తో త్రవ్వకాలు మొదలు పెట్టారు. ఈ సారి తమతో బాటు కొన్ని పోలీసు కుక్కలను కూడా తీసుకొచ్చారు. ఆ కుక్కలు ఎక్కడ అనుమానం వచ్చి ఆగితే అక్కడ త్రవ్వటం మొదలు పెట్టారు. అలా త్రవ్వగా నాలుగు శవాలు బయట పడ్డాయి. ఒకొక్క శవాన్ని చూసినప్పుడు వారి ఉత్సాహం నీరుగారి పోతోంది (కాదు మంచు కట్టి పోతోంది) కానీ మరొక ప్రక్క ఒక్కరైనా బ్రతికి ఉంటే బాగుండునన్న ఆశ. కుక్కలు కూడా ఆ మంచుని భరించలేక మధ్యలో నిస్సత్తువ తో ఆగిపోతున్నాయి. వాటికి విశ్రాంతిని ఇచ్చి, వాటి ఒంటి లో వేడి పుట్టించి మరలా ప్రయత్నిస్తున్నారు.

ఈసారి పోలీసు కుక్కలు ఆగిన చోట త్రవ్వి చూశారు. త్రవ్వుతున్న కొద్ది సిగ్నల్స్ మరింత మెరుగు అవుతున్నాయి. అప్పుడు చేత్తో పారతో త్రవ్విన మంచుని నెమ్మదిగా అడ్డు తొలగించటం మొదలు పెట్టారు. అంతలో ఒకతని చేతికి ఏదో మెత్తగా తగిలినట్లు అనిపించింది. అందరూ కలిసి ఆ చుట్టూ త్రవ్వి లాగి చూశారు. ఆశ్చర్యం!! కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్నరామన్న. .

అక్కడే ఉన్న డాక్టర్ లు అతడికి ప్రధమ చికిత్స చేశారు. రెస్క్యూ టీం లో కొందరు హుటాహుటిన అతడిని హెలికాప్టర్ లో ఎక్కించి బయలుదేరారు.

నాలుగవ రోజు

మాలతి కి రామప్ప హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె, కుటుంబం తో సహా బయలుదేరి ఢిల్లీ చేరుకుంది.

మాలతి ఐసియూ బయట ఎదురు చూస్తోంది. ఆమె మనసులో భాగవన్నామ స్మరణ చేస్తోంది.

ఇంతలో డాక్టర్ భారతి ఐసియూ నుండి వచ్చి మాలతి తో చెప్పింది.

“అమ్మా, ఇంకా రామప్ప కోమా లోనే ఉన్నారు. అతని కిడ్నీ లో, ఊపిరితిత్తులలో నీరు చేరింది. నీటిని తొలగించి అతనికి స్పృహ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ విషయం రాబోయే 48 గంటల లోగా చెప్పలేం. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. “

“నా పెనిమిటి కి రామయ్య అంటే శానా గురి. ఆయన నా పెనిమిటిని తప్పక బతికిస్తాడు” అని నమ్మకం గా చెప్పింది మాలతి.

అక్కడి నుండి మాలతి రిసెప్షన్ వద్ద ఎదురు చూస్తున్న విలేకరుల వద్దకు వెళ్ళింది.

“అంత ప్రతికూల పరిస్థితుల్లో రామన్న జీవించి ఉండటానికి కారణం ఏమయి ఉంటుంది డాక్టర్” అని అడిగాడో విలేకరి.

“ఇటువంటి పరిస్థితి లో గాలి పీల్చుకోవటానికి గాలి సంచులు అనే టెక్నిక్ ని ఉపయోగించటం నేర్పుతారు. అతడు తన ముక్కు వద్ద గాలి పీల్చే ఏర్పాటు చేసుకున్నట్లు మాకు అందిన సమాచారం బట్టి తెలిసింది. అదీ గాక అతడి సహచరులు చెప్పిన దాని బట్టి అతడికి రోజూ యోగా సాధన చేసే అలవాటు ఉంది. దాని వల్ల కూడా అతనికి ఊపిరి పీల్చుకోవటం సులువు అయ్యి ఉండవచ్చు. వీటి అన్నింటి కంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది అతడి మనో ధైర్యం. అదే అతనిని కాపాడింది. ఇక ముందు కూడా ఆ మనోధైర్యమే అతడిని కాపాడాలని ఆశిద్దాం”.

ఐదవ రోజు

డాక్టర్ భారతి పిలవటం తో మాలతి రామప్ప ఉన్న గదిలోనికి పరుగున వెళ్ళింది. అతడి శరీరానికి తగిలించిన యంత్రాలను ప్రక్కకు తోసి అతడిని అమాంతం హత్తుకుంది. అప్పటి వరకు గూడు కట్టుకున్న కన్నీళ్ళు ధారాళాపాతంగా వస్తుంటే వాటిని ఆపటం ఆమె వశం కావటం లేదు.

మంచుని జయించిన రామప్ప కండ బలాన్ని, గుండె బలాన్ని అందరూ ప్రసంసిస్తున్నారు. కానీ తనను ప్రాణాలకు తెగించి కాపాడిన సహచరులు ప్రాణాలు కోల్పోయినందుకు అతని హృదయం ఎంత ద్రవిస్తోందో ఎవరికి తెలుసు? దానికి సాక్ష్యంగా అతడి కంటి నుండి జారి పడుతున్న కన్నీటి చుక్కలకు తప్ప.


---

మనం కంటి నిండా నిద్ర పోవటానికి తాము నిద్ర పోకుండా పహారా కాస్తున్న భారతీయ సైనికులు అందరికీ వందనం.

2016 లో హనుమంతప్ప అనే సైనికుడు 6 రోజులు మంచులో కూరుకుపోయి కూడా సజీవంగా బయటపడ్డాడు, కానీ ఆ తరువాత మరణించాడు. ఎందరో సైనికులు ప్రతి సంవత్సరం ఆ మంచు పర్వతాలకి బలి అవుతూనే ఉన్నారు. వారందరి స్ఫూర్తితో వారి దైనిందిన జీవితం లోని సాహసాల గురించి అందరకీ తెలియజేయటానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది.

ఈ కధకు కోసం అంతర్జాలం లో పత్రికలు, మిలిటరీ కి సంబంధీచిన బ్లాగ్ లు, కెప్టెన్ రఘు రామన్ గారి వీడియొ లు అధ్యయనం చేయటం జరిగింది.