అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 8 చంద్రికకు కమలకు బాగా స్నేహమయింది. కమలకు చంద్రికను మొదట చూచినప్పుడే హృదయంలో ఆప్యాయత ఏర్పడింది. అదీ కాక ప్రసాద్ చెడు ప్రభావం వల్ల పెడదారులు తొక్కుతుందేమోనని భయపడింది కూడా తన పరిచయం ద్వారా ఆ ప్రమాదం నుంచి తప్పించుదామనుకుంది. చంద్రకతో అంత స్నేహం చేయడానికి కారణం ఇంకొకటి కూడా వుంది. అది కమల వొప్పుకోదు. అది హృదయాంతరాళంలో మెదిలే రహస్యపు ఆలోచన. అలాంటివి బాహ్యరూపంలో అగుపడవు. కానీ చేష్టల్ని ఆవి తీర్చిదిద్దుతునే వుంటాయి. చంద్రిక ప్రసాద్ తో కలిసి నివశిస్తోంది. ఆమె కంటే ఆప్తులు అతనికి ఎవరు లేరు. అతని రాకపోకలు, చేష్టలు అన్నీ ఈమెకు తెలుసును. మొదట నుంచీ ప్రసాద్ కమలకొక సమస్యగానే వున్నాడు. అతని స్వభావం ఆమె అర్థం చేసుకోలేక పోయింది. సాధారణ మానవకోటినుంచి ఆమడదూరంలో వున్న విచిత్ర వ్యక్తిగా ఆమెకు అగుపించాడు, అతనంటే ఒక విధమైన భయం ఏర్పడింది. అయస్కాంతంలాంటి