అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 5 ప్రసాద్ హాస్పటల్లో పదిహేను రోజులు ఉండవలసి వచ్చింది. రజని సేవ, శరీర తత్వము త్వరలోనే స్వస్థునిచేసాయి. మొదటిలో రజని రాత్రింబవళ్బు రోగితోవుండేది. రోగికి కావలసినవన్నీ ఆమె యితరులు చెప్పకుండా చేసివుంచి క్రియారూపేణా పెట్టేది. రజనితత్వం పూర్తిగా తెలిసిన ప్రసాద్ కి అది చాలా ఆశ్చర్యము వేసేది. నిపుణతతో, దృఢత్వము, మృదుత్వము మిళితమైన ఆమె పరిచర్యలకు అతనే ఎంతో విస్తుపోయి వొక రోజున “ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు రజని!” అన్నాడు. “వ్యాధిగ్రస్తులకు సేవ చేయడం నాకు చిన్నతనం నుంచి అలవాటే ప్రసాద్. మావయ్య మొదటి నుంచి రోగిష్టి. ఎప్పుడూ నేనే కనిపెట్టి వుండేదాన్ని”అంది. ప్రసాద్ “నువ్వే యిలా సేవ చేయకపోతే నేనేమై పోయేవాడిని రజని” అన్నాడు. నవ్వుతూ “నీ నోటివెంట ఆ మాటలు చాలా కృత్రిమంగా కనబడుతున్నాయి, నేనేమి కమలనుకాను ప్రసాదు వాటిని విని మోసపోవడానికి” అంది. “నేను నిజంగా కమలని మోసపుచ్చానని భావిస్తున్నావా అన్నాడు.